– కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
హైదరాబాద్ : పార్లమెంట్ వేదికగా బీజేపీ సభ్యులు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగాలను మనోభావాలను తీవ్రంగా అవమానించే వ్యాఖ్యగా భావిస్తున్నాము. దశాబ్దాల పాటు సాగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని, ముఖ్యంగా విద్యార్థులు, యువత, అమర వీరులు చేసిన త్యాగాలను ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవమానిస్తున్నాయి. భారత రాజ్యాంగ పరిధిలో సాగిన సకల జనుల ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.
2014లో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక చారిత్రాత్మకమైన, న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య విజయంగా నిలిచింది. దాన్ని విభజనతో పోల్చడం అంటే భారత సమాఖ్య వ్యవస్థపై అవగాహన లేకపోవడాన్ని, ప్రజల ఆకాంక్షల పట్ల గౌరవం లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తుంది. తెలంగాణ ప్రజల గౌరవం, స్వాభిమానంపై నేరుగా చేసిన దాడిగా భావిస్తున్నాం, బీజేపీ నాయకత్వం అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు పై విషం చిమ్మడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను పరిహాసం చేస్తుంది
తక్షణమే క్షమాపణ చెప్పాలని తేజస్వి సూర్య ని మరియు భారతీయ జనతా పార్టీ ను మేము డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా తెలంగాణా బిజెపి నాయకులు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ గౌరవం, చరిత్ర, ప్రజాస్వామ్య హక్కులను వీరోచిత పోరాటాల చరిత్రను అసమాన త్యాగాలను వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు.