-
మనసు మార్చుకుని అసెంబ్లీకి హాజరు?
-
ధృవీకరించిన వైసీపీ వర్గాలు
-
మంచి నిర్ణయమంటూ వెల్లువెత్తుతున్న అభినందనలు
-
పూర్తి స్థాయి సమావేశాల వరకూ ఉంటారని రఘురామకృష్ణంరాజు ఆశాభావం
-
సంతకం పెట్టి వెళ్లిపోతారన్న వ్యాఖ్యలను నమ్మనన్న రఘురామ
-
జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని వ్యాఖ్య
-
వైసీపీ కొత్త ఎమ్మెల్యేల ఆనందం
-
మాట్లాడే అవకాశం వస్తుందన్న ఆశ
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మనసు మార్చుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు హాజరయి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి. దీనికి సంబంధించి జగన్ తన పార్టీ సీనియర్లతో చర్చించిన తర్వాత, అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
తనను ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించేవరకూ సభకు రానంటూ, శాసనసభను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్.. ఎట్టకేలకూ మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షనేగా గుర్తించాలంటూ కోర్టులో కేసువేసినందున.. అది తేలేవరకూ అసెంబ్లీకి హాజరు కావాలన్న పార్టీ సీనియర్ల సూచన మేరకు, జగన్ అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు.
గత ఎనిమిది నెలల నుంచి తన పార్టీ క్షేత్రస్థాయిలో చేసిన ప్రజా పోరాటాలు, వివిధ అంశాలపై తనతో సహా పార్టీ నేతలు వివిధ అంశాలపై చేసిన ఆరోపణలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు, అసెంబ్లీనే సరైన వేదిక అని సీనియర్లు జగన్‌కు సూచించారు. నందిగం సురేష్, వంశీ అరెస్టు సహా పార్టీ నేతలపై కేసులతోపాటు.. రైతు సమస్యలు, నిలిపివేసిన తమ పథకాలపై మాట్లాడే అవకాశం వదులుకోవద్దని సీనియర్లు హితవు పలికినట్లు వినికిడి. పైగా కీలకమైన బడ్జెట్ సమావేశాలయినందున.. గతంలో తమ ప్రభుత్వం చేసిన కేటాయింపులను, ప్రస్తుత బడ్జెట్‌తో పోల్చి వాస్తవాలను ప్రజలకు వివరించే అవకాశం వదులుకోవడం, తెలివైన నిర్ణయం కాదని పలువురు సూచించినట్లు సమాచారం.
దీనితో అసెంబ్లీకి రానంటూ గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా.. సభకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పైగా సభకు హాజరయి ప్రజా సమస్యలపై చర్చించాలంటూ కూటమి నాయకులు చేస్తున్న సవాళ్లు, సభకు వస్తే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటనల్లో వాస్తవమెంతో కూడా తేలిపోతుందని పలువురు సీనియర్లు జగన్ వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒకవేళ సభకు వచ్చినా జగన్‌కు అవకాశం ఇవ్వకపోతే, దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వమే ఒక అవకాశం ఇచ్చినట్టవుతుందని జగన్ వద్ద విశ్లేషించినట్లు తెలుస్తోంది.
‘జగన్ గారు బడ్జెట్‌పై కచ్చితంగా గత మా ప్రభుత్వంలో చేసిన కేటాయింపులు-ఇప్పటి కేటాయింపుల గురించి మాట్లాడే సందర్భంలో సహజంగా విమర్శలు చేస్తారు. అప్పుడు ప్రభుత్వం ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కూటమి సభ్యులు ఆయనను మాట్లాడనీయరు. ఆ క్రమంలో సభలో ఆవేశకావేశాలు చోటు చేసుకుంటాయి. సహజంగా ప్రభుత్వ సూచనల మేరకు, జగన్ మినహా మా సభ్యులను కొద్దిరోజులు సభ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత జగన్ గారు స్పీకర్ అనుమతితో మాట్లాడి, ప్రభుత్వ నిర్ణయాన్ని తూర్పారపట్టి సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎలాగూ మీడియాతో బడ్టెట్‌పై మా వాదన వినిపిస్తా’’మని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
కాగా జగన్ సభకు హాజరుకానున్నారన్న వార్తలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సానుకూలంగా స్పందించారు. ‘జగన్‌కు సభకు హాజరయ్యే ధైర్యం ఉందనుకుంటున్నా. ఆయనకు గతంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోయినా, ఇప్పుడు నమ్మకం ఉన్నట్లు భావిస్తున్నా. సభకు రావడం సభ్యుడిగా ఆయన హక్కు. దానిని ఎవరూ అడ్డుకోలేరు. సభా నిబంధనల మేరకు ఒక సభ్యుడికి ఇచ్చే అవకాశాలన్నీ జగన్‌కూ ఉంటాయి. దానిపై ఎలాంటి సందేహ ం లేదు. నేనేదో జగన్ వస్తే మైకు ఇవ్వనన్న ప్రచారం సత్యదూరం. బయట వరకే పార్టీలు, రాజకీయాలు. సభలోకి వస్తే అందరూ సమానమే. కాకపోతే నిబంధనల మేరకు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ విషయం ఎంపీ, ఎమ్మెల్యే, సీఎంగా చేసిన జగన్‌కూ తెలుసనుకుంటా. బఢ్జెట్‌పై జగన్ తన పార్టీ వైఖరితోపాటు, ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేస్తే ఆయనకే గౌరవం పెరుగుతుంది’’ అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
అయితే సభకు హాజరుకాకపోతే అనర్హత వేటు వేస్తారనే భయంతోనే జగన్ సభకు వస్తున్నారన్న సోషల్‌మీడియా వార్తలను తాను ప్రస్తుతానికి నమ్మటం లేదని రఘురామ చెప్పారు. ‘ఆయనకు సభకు వచ్చే ధైర్యం ఉందనుకుంటున్నా. ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సభకు వస్తారనే ఆశిస్తున్నా. అలా కాకుండా ఒకరోజు సంతకం చేసి వెళ్లిపోయేంత పిరికితనం, ఆయనలో ఉందనుకోవడం లేదు. ఏదేమైనా జగన్ సభకు హాజరుకావడాన్ని సాటి సభ్యుడిగా, డిప్యూటీ స్పీకర్‌గా స్వాగతిస్తున్నా’నని రాజు చెప్పారు.
జగన్ సభకు వస్తే ఆయనను ఆట పట్టిస్తారని, ఆయనకు మైకు ఇవ్వరంటూ సోషల్‌మీడియాలో వస్తున్న కథనాలను రాజు త్రోసిపుచ్చారు. బహుశా సభా సంప్రదాయాలపై అవగాహన లేని వారే అలా ప్రచారం చేస్తూ ఉండవచ్చన్నారు. ‘‘జగన్‌ను మిగిలిన సభ్యుల మాదిరిగానే గౌరవిస్తామే తప్ప, ఎందుకు ఆటపట్టిస్తాం? అసలు ఆటపట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది? మాకు హుందాతనం తెలియదా? మాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. గతంలో ఎలా ఉన్నా ఈ సభను మాత్రం స్పీకర్‌గారు, నేను స్వతంత్రంగానే నడుపుతాం. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. అందుకే అంత నమ్మకంగా చెబుతున్నా. మరి అలా గతంలో జరిగిందేమో నాకు తెలియదు. ఎందుకంటే నేను గతంలో సభలో సభ్యుడిని కాదు కాబట్టి’’ అని రఘురామ వ్యాఖ్యానించారు.
కాగా జగన్ సభకు హాజరుకావాలన్న నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు స్వాగతిస్తున్నారు. ఆయన మనసుమార్చుకుని సభకు హాజరుకావడాన్ని అభినందిస్తున్నారు. ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన ప్రతిపక్షం బయట ఉండటం మంచిదికాదని, సభలో ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడమే ప్రతిపక్ష ధర్మం అని స్పష్టం చేస్తున్నారు.
జగన్ నిర్ణయంపై ప్రధానంగా వైసీపీనుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ తాము సభకు వెళ్లనందున, మాట్లాడే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అసెంబ్లీలో ఎవరి గదులు ఏమిటో, ఎక్కడ ఏం ఉందో కూడా పరిశీలించే అవకాశం రాలేదని వాపోతున్నారు. దానికితోడు మా ఎమ్మెల్యే సభలో కనిపించడం లేదని కొందరు, సభకు వెళ్లని దానికి ఎమ్మెల్యేగా ఉండి ఏం ఉపయోగమంటూ మరికొందరు.. నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక తలపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సభకు హాజరుకావాలన్న నిర్ణయం వారిని ఆనందపరుస్తోంది.