-
పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్ధుల వినతి
-
అభ్యర్ధుల వినతికి సర్కారు సానుకూల స్పందన
-
పరీక్షలు వాయిదా వేయమన్నా పట్టించుకోని ఏపీపీఎస్సీ
-
సర్కారుకు ఏపీపీఎస్సీ బాసుల ఝలక్
-
సీఎం చంద్రబాబు లేఖనూ లెక్కచేయని ధిక్కారం
-
వాయిదా కుదరదంటూ తిరుగుటపాలో లేఖ రాసిన ఏపీపీఎస్సీ
-
లోకేష్ ట్వీట్‌నూ పట్టించుకోని అధికారులు
-
అనుకున్న ప్రకారమే నేడు ఏపీపీఎస్సీ పరీక్ష
-
అనూరాధను ఏరికోరి నియమించుకున్న చంద్రబాబు
-
ఎవరికీ అందుబాటులోకి రాని అనూరాధ
-
పరీక్ష వాయిదా లేదంటూ ఇన్చార్జి సెక్రటరీ పత్రికా ప్రకటన
-
పైగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
-
పాలకుల పరువు తీసిన ఏపీపీఎస్సీ ఇన్చార్జి సెక్రటరీ
-
నష్టపోతున్న వేలాదిమంది నిరుద్యోగ అభ్యర్ధులు
-
వైజాగ్‌లో రాత్రివేళ రోడ్డెక్కిన అభ్యర్ధులు
-
విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీసు ముట్టడికి యత్నం
-
నిరుద్యోగ అభ్యర్ధుల ఆగ్రహంతో కూటమి అభ్యర్ధులలో వణుకు
-
ఏపీపీఎస్సీ నిర్ణయంతో ప్రమాదంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు
-
నిరుద్యోగులు పీడీఎఫ్ వైపు మొగ్గే ప్రమాదం?
-
ఇప్పటికే రెండుచోట్లా కూటమి-పీడీఎఫ్ అభ్యర్ధుల ఓట్ల తేడా 20 వేలే
-
ఏపీపీఎస్సీ మొండి వైఖరితో ప్రమాదంలో కూటమి అభ్యర్ధుల భవితవ్యం
-
ఓటమి ఖరరాయిందంటూ ఇప్పటికే తల పట్టుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
-
సర్కారుకు ఏపీపీఎస్సీ అధికారుల అవమానం
( మార్తి సుబ్రహ్మణ్యం)
పిల్లి గుడ్డిదయితే ఎలుక ఏదో చూపించిందన్నది వెనుకటికి ఒక ముతక సామెత. ఇప్పుడు ఏపీలో సరిగ్గా జరుగుతోంది అదే. ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయాల్సిన అధికారులు, చివరకు సీఎం మాటను కూడా బేఖాతరు చేసి , అవమానపర్వానికి తెరలేపిన ధిక్కార పర్వమిది. ఏరికోరి మరీ నియమించుకున్న అధికారులే.. సర్కారు సూచనలను బుట్టదాఖలు చేస్తే, మరి ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరు? అధికారులా? రాజకీయ నాయకత్వమా? ఇక ప్రభుత్వం నడపటం కూటమికి అవసరమా? .. ఇవీ.. ఏపీపీఎస్సీ బాసుల పుణ్యాన.. వే లాదిమంది నిరుద్యోగ అభ్యర్ధుల దృష్టిలో ముద్దాయిగా నిలబడ్డ, ‘కూటమి సర్కారు విషాదంపై’ కూటమిలో వినిపిస్తున్న వ్యాఖ్యలు!
కుక్క తోక ను ఆడించాలి. కానీ తోక కుక్కను ఆడించకూడదు. ఏపీలో జరుగుతున్న విచిత్ర-విషాద-విభ్రాంతికరమైన వ్యవహారాలు చూస్తే.. మెదడున్న ఎవరికయినా ఇలాంటి సందేహమే వస్తుంది. ప్రభుత్వంలో ఉన్నవారికి తెలియకుండానే విపక్ష పార్టీ కాంట్ట్రార్లకు బిల్లులు పువ్వుల్లో పెట్టి ఇస్తుంటారట. మంత్రులకు తెలియకుండానే విపక్ష పార్టీకి సేవలందించిన అధికారులు బదిలీ అవుతుంటారట. కార్పొరేషన్ చైర్మన్లను అధికారులు ఖాతరు చేయరు. విపక్ష పాలనలో వెలిగిన కంపెనీలకే మళ్లీ కాంట్రాక్టులు, బిల్లులు ఇచ్చేస్తుంటారట. ఆ కంపెనీలకు మేళ్లు చేసిన అధికారులకే పిలిచి పెద్దపీట వేసి, పాలన అప్పగిస్తారు. మరి ఆ ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ పాలనా? అధికారుల పాలనా? పెత్తనం చేస్తున్నది ప్రభుత్వమా? ప్రభుత్వం నియమించిన అధికారులా?.. ఏపీపీఎస్సీ చేతిలో దారుణ పరాభవం పాలైన సర్కారు దీన స్థితిని చూసిన వారికెవరికయినా కలిగే సందేహాలే ఇవి.
ఆదివారం ఏపీపీఎస్సీ పరీక్ష జరగనుంది. అయితే దానిని వాయిదా వేయాలని అభ్యర్ధులు చాలారోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించడంపై అభ్యర్ధులు అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిపై కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇది ఈనెల 11న విచారణకు రానుంది. ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం కావలసి ఉంది.
దీనితో పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 92,750 మంది అభ్యర్ధుల భవిష్యత్తు, ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పరీక్ష వాయిదా వేయమని ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా పరీక్ష వాయిదా చర్చ జరిగింది. అభ్యర్ధుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పరీక్ష వాయిదా వేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు సూచించారు. దానితో చంద్రబాబు స్పందించి, పరీక్ష వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా విద్యార్ధుల భవిష్యత్తు, ఆందోళనను లీగల్ దృష్టికి వెళ్లి పరిష్కరిస్తానని ట్వీట్ చేశారు.
కాగా శుక్రవారం పరీక్ష వాయిదా వేయమని సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. అయితే ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని ఇన్చార్జి కార్యదర్శి నర్శింహమూర్తి తిరుగులేఖ రాయడం సర్కారుకు తలకొట్టేసినంత పనయింది. మరో అడుగుముందుకేసిన ఇన్చార్జి కార్యదర్శి.. పరీక్షలు వాయిదా వేయలేదని, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, వాయిదా అంటూ జరుగుతున్న దుష్ప్రచారం నమ్మవద్దని పత్రికాప్రకటన విడుదల చేశారు.
అక్కడితో ఆగని ఆయన.. పరీక్ష వాయిదాపై దుష్ప్రచారం చేస్తున్న చానెళ్లు, సోషల్‌మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇది ప్రభుత్వాన్ని నేరుగా ధిక్కరించడమేనని అధికారి తీరుతో స్పష్టమయింది. ఒకరకంగా వేలాదిమంది విద్యార్ధుల ఎదుట, ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టడమేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
నిజానికి మాజీ ఐపిఎస్ అధికారిణి అనూరాధ రిటైరయినప్పటికీ, ఆమెను ఏరికోరి ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆమె, ప్రభుత్వంలో ఉన్న వారి మాట వినరన్న ప్రచారం తెలిసిందే. నిబంధనల ప్రకారం వ్యవహరించే అనూరాధకు, గతంలో చంద్రబాబునాయుడు ఇంటలిజన్స్ చీఫ్ పోస్టింగ్ ఇచ్చారు. ఆమె హయాంలోనే ఓటుకునోటు కేసు ఘటన జరిగింది. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడంతోపాటు, హైదరాబాద్‌లో పరిణామాలు ముందుగా కనిపెట్టడంలో విఫలమైన ఆమెను తప్పించి, ఏబీ వెంకటేశ్వరరావును ఆ పదవిలో ఆగమేఘాలపై నియమించారు.
మళ్లీ ఆమె రిటైరనప్పటికీ, పిలిచి ఏపీపీఎస్సీ చైర్మన్ వంటి కీలక బాధ్యత అప్పగించడం పార్టీ వర్గాలను విస్మయపరిచింది. విపక్షంలో ఉండగా పార్టీకి వివిధ రూపాల్లో సేవలందించిన అనేక మంది అధికారులు ఉండగా, ఎవరికీ ఎలాంటి మేలు చేయని అనూరాధకు చైర్మన్ ఇవ్వడమే వారి ఆశ్చర్యానికి కారణం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మొదటి పోస్టింగ్ పార్టీ నాయకులకు ఇస్తారని భావించారు. కానీ పార్టీకి ఎలాంటి సేవలు చేయని మాజీ ఐఏఎస్ లక్ష్మీపార్ధసారథికి తొలి పోస్టింగ్ ఇవ్వడం పార్టీ వర్గాలను విస్మయపరిచింది.
నిజానికి ఎవరికీ ఎలాంటి మేలు చేయని అధికారులను, చంద్రబాబు ఏరికోరి పదవులిచ్చారన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. పార్టీకి పనిచేసే వర్గాలకు మేలు చేయని వారికి చైర్మన్ పదవులివ్వడం వల్ల ఎవరికి ఉపయోగం? కార్యకర్తలకు పనులు చేయకపోతే వారిని అక్కడ ఎందుకు నియమించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు అధికారులకు రాజకీయ పదవులు ఇవ్వడం ఏమిటి? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పలువురు కార్పొరేషన్ చైర్మన్ల వద్దకు వివిధ పనుల కోసం వెళ్లే పార్టీ వర్గాలకు నిరాశే ఎదురవుతోందంటున్నారు. ఫలానా ఎండీ మన మాట వినరనో, మీరు చెప్పిన పని రూల్సుకు విరుద్ధమనో చెబుతూ తప్పించుకుంటున్నారన్న ఫిర్యాదులు పార్టీ కార్యాలయానికి చేరుతున్నాయి.
కాగా అనూరాధ కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నందున, ఏపీపీఎస్సీ వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కార్యదర్శిగా ఉన్న అధికారి కూడా లేకపోవడంతో, న రసింహమూర్తి అనే అధికారికి ఇన్చార్జి సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. ఆయన చాలా ఏళ్ల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ అధికారే సీఎం చంద్రబాబు లేఖను బుట్టదాఖలు చేసి, పరీక్ష వాయిదాకు ససేమిరా అని, పరీక్ష నిర్వహిస్తుండటం విశేషం.
తాజా పరిణామాలు నైతికంగా-రాజకీయంగా కూటమిని దారుణ అవమానానికి గురిచేశాయి. కార్యకర్తల్లో అంతర్మథానికి కారణమయ్యాయి. ఈనెలలో నాలుగు జిల్లాల్లో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మూడు జిల్లాల్లో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీపీఎస్సీ పరీక్ష వాయిదా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. పరీక్ష వాయిదా వేస్తామన్న చంద్రబాబు మాట నిలబెట్టుకోకుండా, వేలాదిమంది విద్యార్ధులను మోసం చేశారంటూ వైసీపీ, పీడీఎఫ్ నేతలు ఇప్పటికే ప్రచారం ఉధృతం చేశారు. మరోవైపు విశాఖలో అభ్యర్ధులు రోడ్డెక్కి ధర్నాలకు దిగారు. విజయవాడలో సైతం అభ్యర్ధులు ఏపీపీఎస్సీ ఆఫీసు వద్ద ధర్నా చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనల్లో పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడం, పీడీఎఫ్ అభ్యర్ధులకు వరంగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులకు శాపంగా పరిణమించింది.
నిజానికి ఇంటెలిజన్స్ నివేదికల ప్రకారం.. నాలుగు జిల్లాల్లో టీడీపీ-పీఢీఎఫ్ అభ్యర్ధులకు, జిల్లాకు 20 వేల ఓట్లు మాత్రమే తేడా ఉన్నట్లు సమాచారం. అంటే గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార-విపక్ష అభ్యర్ధుల మధ్య కేవలం 20 వేల ఓట్ల తేడా మాత్రమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్ధులు తొలి ప్రాధాన్యం ఓట్లతో గెలిచే పరిస్థితులు లేవని, ఈ దశలో పరీక్ష వాయిదా వేయని ఆగ్రహం పీడీఎఫ్ అభ్యర్ధులకు వరంగా పరిణమిస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే మొత్తుకుంటున్నారు.
‘నాలుగు జిల్లాల్లో చెరో 25 వేల ఏపీపీఎస్సీ అభ్యర్ధుల ఓట్లు పీడీఎఫ్‌కు పోలయినా మా అభ్యర్ధులు ఓడిపోవటం ఖాయమని’ ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు చోట్లా అభ్యర్ధులను ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధులకు సరైన సహకారం లేదని, ఆ తలనొప్పికి తోడు ఈ పరీక్షల తలనొప్పి మా అభ్యర్ధులకు ఎసరు తెస్తోందని ఓ మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీపీఎస్సీ పరీక్ష వాయిదా వేయని నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్, ఉత్తరాంధ్ర టీచర్ నియోజవర్గ అభ్యర్ధి రఘువర్మ భవితవ్యం పూర్తి స్థాయి ప్రమాదంలో పడిందన్న ఆందోళన కూటమి ఎమ్మెల్యే, మంత్రుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
తాజాగా అధికారుల చేతిలో ఎదురైన పరాభవ పర్వాన్ని దృష్టిలో ఉంచుకునయినా ఇకపై అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడం మానేయాలని టీడీపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ, అధికారుల పాలనే ఉంటుందన్న నిజాన్ని ఈసారి కూడా రుజువు చేశారని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ‘‘ ఎన్నికల ముందు ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు సమయం ఇచ్చి తప్పు చేశాం. ఇకపై కార్యకర్తలకే ఎక్కువ సమయం కేటాయిస్తా అనటం. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అధికారులకే పెత్తనం ఇవ్వడం మా సారుకు అలవాటయింది. మాకు ఇవన్నీ తప్పవు కదా?’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
జగన్ సీఎంగా ఉండగా అధికారులు హడలిపోయి, వైసీపీ నేతలు చెప్పిన పని చేశారని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘మరి అదే అధికారులు మా పార్టీ వస్తే మా మాట ఎందుకు వినరు? ఎందుకు ఎదురు చెబుతున్నారు? వాళ్ల పెత్తనం ఎందుకు సాగుతుంది? అంటే తప్పు ఎవరిది? వాళ్లకు పెత్తనం ఇచ్చిన మా ప్రభుత్వానిదా? అడ్డుకోలేని మాదా? అని ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆవేశంగా ప్రశ్నించారు. పైన ఉండేవారి బట్టే కింద ఉన్న వారు పనిచేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.