– ఇది ముగింపు కాదు… ఇకపై ధర్మయుద్దం కొనసాగుతుందని రామచంద్రయాదవ్ ప్రకటన
మంగళగిరి: బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన “బీసీ ధర్మదీక్ష” నాలుగో రోజున తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. నాలుగు రోజులుగా నిరాహారంగా ఉన్న ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో, వైద్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ, కాపు సంఘాల పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన తన దీక్షను విరమించారు. అయితే, ఇది కేవలం విరామం మాత్రమేనని, బీసీల హక్కుల సాధన కోసం తన పోరాటం ఇకపై “ధర్మయుద్ధం”గా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
నాలుగో రోజు దీక్ష కొనసాగుతున్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో రామచంద్రయాదవ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందిన నాయకులు, ఆయన దీక్షను విరమించాలని కోరారు. వారి విజ్ఞప్తిని మన్నించి, భవిష్యత్ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే లక్ష్యంతో ఆయన దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు, దీక్షా శిబిరం నుంచి మాట్లాడిన రామచంద్రయాదవ్… ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాడుతుంటే, ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఐదు ప్రధాన డిమాండ్లతో ఈనెల 11న నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాను,” అని ఆయన అన్నారు.
“నాలుగో రోజు దీక్ష కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించకపోవడం ఈ దోపిడీ, కుటుంబ పార్టీలకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని బయటపెడుతోంది. రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు అనే రాక్షసుడి పరిపాలనలో కొనసాగుతున్న కౌరవ ప్రభుత్వం,” అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
“చంద్రబాబు తన రాజకీయ జీవితమంతా ప్రజలను వంచించి, దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ఆయన చెప్పేది అభివృద్ధి కోసం కాదు, అవి ఆయన కుటుంబం ఏర్పాటు చేసుకున్న రెండు ఏటీఎంలు. పోలవరం ఒక ఏటీఎం అని సాక్షాత్తూ ప్రధాని మోదీయే చెప్పారు. ఇప్పుడు అమరావతి అనే మరో ఏటీఎంను పెట్టుకుని, వేల ఎకరాలు సేకరించి తన బినామీలకు కట్టబెడుతున్నారు,” అని రామచంద్రయాదవ్ ఆరోపించారు. అమరావతి చంద్రబాబు కుటుంబ ఆస్తి కాదని, రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిందని నిరూపించే వరకు, బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రామచంద్రయాదవ్ దీక్షకు కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, కాపు జె ఏ సి కన్వీనర్ చందూ జనార్ధన్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్, తెలంగాణా నాయకులు బిల్లి చంద్రశేఖర్, ప్రముఖ బీసీ నాయకులు అంబర్పేట శ్రీనివాసయాదవ్, తెలంగాణా రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు వట్టి జానయ్య, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకటేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివాజీ, ప్రముఖ కాపు నాయకులు సుధాకర్ నాయుడు, సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య, గౌడ, శెట్టి బలిజ నాయకులు శ్రీనివాసరావు, బీసీ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు కుర్రం శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు మార్గాని చంటిబాబు, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ కనకం శ్రీనివాస్, మంగళగిరి మాజీ ఎంపీపీ ఆర్. మోహన్ బాబు, కర్ణాటక హైకోర్టు అడ్వకేట్ రాజ్ కుమార్, రాష్ట్ర గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు ధరం నాగరాణి సహా అనేక మంది నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.