* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు
* ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ నెంబర్ వన్
* బీసీ బిడ్డల ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం
* 2027 నాటికి మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యం : మంత్రి సవిత
* అత్యధిక మార్కులు సాధించిన బీసీ విద్యార్థులకు సత్కారం
* మెమోంటోలు, నగదు బహుమతి అందజేత
* ఉప్పొంగిన మాతృహృదయం
* అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న బిడ్డను చూసి ఆనందభాష్పాలు రాల్చిన తల్లి
* తల్లీబిడ్డను వెన్నుతట్టి ప్రోత్సహించిన మంత్రి సవిత
* ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా స్కూళ్ల బ్యాగ్ ల పంపిణీ
విజయవాడ : రాష్ట్రంలో బీసీ సంక్షేమ విద్యాసంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు బీసీ వర్గాలకు మాత్రమే కాకుండా సమాజానికే ఆదర్శం నిలిచారని కొనియాడారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులు, సిబ్బంది, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
బీసీ సంక్షేమ శాఖను రాష్ట్రంలో ఆదర్శ శాఖగా తీర్చిదిద్దడంలో శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున్, ఎంజేపీ సొసైటీ కార్యదర్శి మాధవీలతతో పాటు అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నానని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన ఉపాధ్యాయులు, ఆహారం, వసతులు అందుబాటులో ఉండటంతో బీసీ వెల్ఫేర్ విద్యాసంస్థలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ నెంబర్ వన్
టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీసీ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసిందన్నారు. విద్యార్థులతో సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, మస్కిటో మెష్‌లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
సీఎస్ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్, ప్రభుత్వ నిధులతో హాస్టళ్లలో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. కొత్తగా 1500 మరుగుదొడ్ల నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం కోసం కుక్ లు, కాపీలు నియమించామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్యం మెరుగు కోసం త్వరలో 1291 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నామని తెలిపారు.
రూ.500 కోట్లతో ఎంజేపీలకు శాశ్వత భవనాలు
విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. వంట గదుల సామగ్రి కోసం రూ.18 కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు. ఎంజేపీ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఎంజేపీ గురుకులాల్లో రూ.1.50 లక్షలు, బీసీ హాస్టళ్లలో రూ.75 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సంఖ్యను గతంలో 42 నుంచి 109కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని మంత్రి గుర్తుచేశారు.
ఆరు ఎంజేపీ గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు వార్డెన్లతోగాని, తల్లిదండ్రులతోగాని తెలపాలన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని హితవు పలికారు. పట్టుదలతో ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని, భవిష్యత్తులో మీలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు ఎదగాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. హాస్టళ్లు, గురుకులాల్లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. నెట్ జీరో కార్యక్రమం కింద ప్రతి హాస్టల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల అభివృద్ధి చేపట్టాలని సూచించారు. విద్యార్థులు మారుతున్న ప్రపంచ పోటీని ఎదుర్కొనేందుకు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు.
గత ఏడాదితో పోలిస్తే బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 77 శాతం నుంచి 87 శాతానికి పెరిగిందని, రెసిడెన్షియల్ స్కూల్స్ 96.4 శాతం ఫలితాలు సాధించాయని వెల్లడించారు. త్వరలోనే మంత్రి సవిత ఆధ్వర్యంలో నీట్, ఐఐటీ కోచింగ్ కోసం ప్రత్యేక కళాశాలలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, టెన్త్, ఇంటర్ లో బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులు ఈ ఏడాది గణనీయమైన ఫలితాలు సాధించారన్నారు.
గత ఏడాది టెన్త్ లో ఉత్తీర్ణత శాతం 77.22 శాతం కాగా, ఈ ఏడాది 86.09 శాతానికి పెరిగిందని వెల్లడించారు. అలాగే 1,054 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. పోలవరం జిల్లా 100 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచిందని, కోనసీమ, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప జిల్లాలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించాయని తెలిపారు.
ఉప్పొంగిన మాతృ హృదయం
నెల్లూరుకు చెందిన ప్రణీత టెన్త్ లో 589 మార్కులు సాధించినందుకు మంత్రి సవిత సన్మానించారు. ఈ సందర్భంగా వేదికపై విద్యార్థిని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, తన విజయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లి లక్ష్మీదేవి పాత్ర కూడా ఉందంటూ పేర్కొంది. అదే సమయంలో పక్కనే నిల్చొన్న విద్యార్థిని తల్లి లక్ష్మీదేవి తీవ్ర భావోద్వేగానికి గుర్యయ్యారు. తన కడుపున బిడ్డ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతుండడంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చారు. తన బిడ్డ విజయాన్ని చూసి ఉప్పొంగిపోతున్న ఆ మాతృమూర్తిని చూసిన వారి కళ్లు కూడా చమర్చాయి. మంత్రి సవిత తన సీటు నుంచి లేచి వెళ్లి… తల్లీబిడ్డను ఆలింగనం చేసుకుని అభినందించారు.
‘మీ బిడ్డ విజయంలో నీ పాత్ర ఉంది… నీ కుమార్తెను ఇంకా ఉన్నత విద్యలు చదివించాలి… కూటమి ప్రభుత్వం బీసీల విద్య కోసం అన్ని విధాలా అండగా ఉంటుంది’ అంటూ విద్యార్థిని తల్లి లక్ష్మీదేవికి వెన్నుతట్టారు. టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫొటోలు పేపర్లలో యాడ్ వేస్తూ ప్రచురించి, నూతన చరిత్రకు మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో 596 మార్కులు సాధించిన నెరవాడ ఎంజేపీ గురుకుల పాఠశాలకు చెందిన తనకంటి సాయిశ్రీ ఉండడం ఆ శాఖ మంత్రిగా గర్వంగా ఉందని మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు.
మేం బీసీ హాస్టళ్ల విద్యార్థులం
అత్యధిక మార్కులు సాధించిన ఎంజేపీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులు మాట్లాడుతూ, ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించడంలో తమ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందన్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ వంద రోజుల ప్రణాళికలు తాము అత్యధిక మార్కులు సాధించడానికి సాయపడ్డాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందన్నారు. తాము బీసీ హాస్టళ్ల విద్యార్థులమని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. ప్రస్తుతం లభించిన విజయంతో భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించడానికి అవకాశం కలిగిందన్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రులు నారా లోకేశ్, సవితకు రుణపడి ఉంటామని తెలిపారు.
విద్యార్థులకు మెమోంటోలు, క్యాష్ ప్రైజ్
టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఎంజేపీ గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులకు మంత్రి సవిత చేతుల మీదుగా మెమోంటోలు, నగదు బహుమతి అందజేశారు. ఎంజేపీలో సెకండ్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించి తమ గ్రూపుల్లో మొదటి స్థానంలో నిలిచిన ప్రియాంక(992 మార్కులు, ఎంపీసీ), శైలజా( 989 మార్కులు, బైపీసీ), దీప్తి(969 మార్కులు, ఎంఈసీ), హిమబిందు(981 మార్కులు, సీఈసీ)కు రూ.10 వేలు చొప్పున, ద్వితీయ స్థానంలో నిలిచిన భవానీ(989 మార్కులు, ఎంపీసీ), రాణి(987 మార్కులు, బైపీసీ), నిర్మలాజ్యోతి(966 మార్కులు, ఎంఈసీ), సరస్వతి(975 మార్కులు, సీఈసీ) రూ.5 వేలు చొప్పున నగదు బహమతిని మెమోంటోలతో పాటు అందజేశారు.
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఎంజేపీ గురుకుల పాఠశాలలకు చెందిన ఆరుగురు విద్యార్థులు టి.సాయిశ్రీ, జె.పవన్ కుమార్, ఎస్.గుణశేఖర్, డి.రీటాసాహితి, కె.యశ్వంత్ కుమార్, జి.షబానాకు రూ.10 వేలు చొప్పున, ద్వితీయ స్థానంలో నిలిచిన 27 మందికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు. బీసీ హాస్టళ్లకు సంబంధించి టెన్త్ అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి రూ.10 వేలు చొప్పున, ద్వితీయ స్థానంలో నిలిచిన ఎనిమిది మందికి రూ.5 వేల చొప్పున అందజేశారు.
ఇంటర్ లో సెకండియర్ లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఆర్సీ, ఎంఈసీ గ్రూపుల్లో అత్యధిక మార్కులతో నిలిచిన అయిదుగురి విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, ద్వితీయ స్థానంలో నిలిచిన మరో అయిదుగురికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు. వారందరికీ మెమోంటోలు, సర్టిఫికెట్లను మంత్రి సవిత చేతుల మీదుగా అందజేశారు.
ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్ బ్యాగ్ లు ఉచితంగా…
తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు మంత్రి సవిత స్కూల్ బ్యాగ్ లు ఉచితంగా అందజేశారు. 400 మంది విద్యార్థులకు ఈ బ్యాగ్ లను పంిపణీ చేశారు. గతేడాది కూడా టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి సవిత స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి సవిత అభిలషించారు.
ఫలితాల రావడంలో విశేష కృషి జరిపిన డీబీసీడబ్ల్యూవోలను కూడా మంత్రి సవిత సత్కరించారు. అనంతరం విద్యార్థులతో మంత్రి సవిత సహఫంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, మల్లె ఈశ్వరరరావు, ఎంజేపీ కార్యదర్శి మాధవీలత, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, ఇతర అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.