– ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం నిబంధనలకు విరుద్ధం
– 41.15 మీటర్ల వరకు నిల్వ చేస్తే పోలవరం ప్రాజెక్టు నిరుపయోగం
– గోదావరి నదీ జలాలపై రెండవ ట్రిబ్యునల్ ను వెంటనే నియమించి, సమస్యను పరిష్కరించాలి
– ఎగువ భద్ర ప్రాజెక్టును అడ్డుకోకపోతే తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బలాల్లో శాశ్వత నష్టం
– ప్రభుత్వానికి ఆలోచనాపరుల వేదిక డిమాండ్
విజయవాడ: కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ కర్నాటక ప్రభుత్వం చేపడుతున్న ఎగువభద్ర ప్రాజెక్టును, కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది. మరోసారి అల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్నాటక చేస్తున్న ప్రయత్నాలను నివారించాలని కోరింది. ఎగువభద్ర ప్రాజెక్టును అడ్డుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
పోలవరం ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణాన్ని చేపట్టడానికి అవసరమైన రు.32,000 కోట్లు మంజూరు చేయాలని, కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, గోదావరి జలాలపై రెండవ ట్రిబ్యునల్ ను నియమిందాలని, వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర జలశకే మంత్రికి విజ్ఞప్తి చేయడం ఆహ్వానించ తగ్గ విషయం.
కేవలం విజ్ఞప్తి మేరకే పరిమితం కాకుండా.. అత్యంత కీలకమైన ఈ నాలుగు అంశాలపైన కేంద్ర ప్రభుత్వం సత్వరం సానుకూల నిర్ణయాలు తీసుకునే ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, వ్యక్తులుగా మరియు ఉమ్మడిగా అంకితభావంతో కృషి చేయాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, మరీ ముఖ్యంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఈ సమస్యల పరిష్కారానికి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
పోలవరం బహుళ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, 45.72 మీటర్ల గరిష్ట స్థాయిలో వీటిని నిల్వ చేయకుండా 41.15 మీటర్ల వరకు నిల్వ చేస్తే, ప్రాజెక్టు నిరుపయోగంగా మిగిలిపోతుంది. పోలవరం ద్వారా ఒనగూరాల్సిన బహుళ ప్రయోజనాలు లబించవు. రెండవ దశ నిర్మాణంలో అత్యంత కీలకమైనది ప్రాజెక్టు నిర్మాణం.
పర్యవసానంగా మామూలు మరియు జీవనాధారం కోల్పోయి నిర్వాసితులైన ప్రజలకు, అందులోనూ అత్యధికంగా సామాజికంగా వెనుకబడిన గిరిజనులకు పునరావాస పథకం అమలు చేయడానికి అత్యధిక మొత్తాన్ని వెచ్చించాల్సి ఉన్నది. దీనిపై అలసత్వం ప్రదర్శిస్తే, పోలవరం ప్రాజెక్టు జలాశయం, కుడి మరియు ఎడమ కాలువల నిర్మాణాలు పూర్తి చేసి, జాతికి అంకితం చేసినా, ప్రయోజనం ఉండదు.
కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే అమలులో ఉన్నది. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును ప్రస్తుతం ఉన్న 519.16 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంచుకోవడానికి పూనుకున్నది. అలాగే, బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించి, ఎగువ భద్ర ప్రాజెక్టును నిర్మిస్తున్నది. వీటిని అడ్డుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బలాల్లో శాశ్వతంగా నష్టం జరుగుతుంది.
వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు జీవనాధారమైన వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు దశాబ్దాలు గడచిపోతున్నా అమల్లోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమిలో బీజేపీ భాగస్వామి. ఒడిస్సాలో అధికారంలో బీజేపీ ఉన్నది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం విజిపి నేతృత్వంలో ఉన్నది. వంశధార నదీ జలాల వివాద పరిష్కారానికి, రాజకీయంగా అత్యంత సానుకూలమైన వాతావరణం ఉన్నది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా కార్యాచరణకు పూనుకోవాలి.
గోదావరి నదీ జలాలపై 1980లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. తర్వాత కాలంలో నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. నీటి వినియోగంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి స్పష్టత లోపించింది. పర్యవసానంగా సమస్య జటిలంగా తయారయ్యింది. ఈ పూర్వరంగం” కేంద్ర ప్రభుత్వం గోదావరి నదీ జలాలపై రెండవ ట్రిబ్యునల్ ను వెంటనే నియమించి, సమస్యను పరిష్కరించాలి.