– శ్రీశైలం హరిత హోటల్ సందర్శించిన పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ
శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్‌ను ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ సందర్శించారు.
ఈ సందర్భంగా హోటల్ సిబ్బందిని కలుసుకొని, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. హరిత హోటల్ భవనం, గదుల నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలు, సందర్శకులకు అందిస్తున్న వసతులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే దృష్టితో హోటల్ అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు కూడా చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డా. నూకసాని బాలాజీ , “శ్రీశైలం ఒక పవిత్ర క్షేత్రం మాత్రమే కాకుండా, పర్యాటకంగా అత్యంత ప్రాధాన్యమున్న ప్రదేశం. ఇక్కడికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఉత్తమ స్థాయి వసతులు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. హరిత హోటల్‌ను ఇంకా అభివృద్ధి చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నాము” అని తెలిపారు.
పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైలంలో పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి, సాహసిక పర్యాటక కార్యక్రమాలు, స్థానిక ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. స్థానిక యువతకు శిక్షణ ఇస్తూ, పర్యాటక రంగాన్ని గ్రామీణాభివృద్ధికి వేదికగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.