Suryaa.co.in

Telangana

అది దెయ్యాల రాష్ట్ర సమితి!

– దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదు
– ముందు నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.
– మాకు గంధమల్లకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో తెలియదా?
– రైతులను ఆదుకుంటుంటే కడుపులో విషం పెట్టుకుని కుట్రలు
– ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభలో బీఆరెస్ పై సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

ఆలేరు: ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దెయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా, ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదు. అది బీఆర్ఎస్ కాదు డీఆరెస్.. భారత రాష్ట్ర సమితి కాదు… దెయ్యాల రాష్ట్ర సమితి. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశాం. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. యాదగిరిగుట్ట అలయం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.

నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవనం చేసి తీరుతాం. మోదీ సబర్మతి, గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?

మా నల్లగొండల బిడ్డలు మూసీ మురికి కూపంలో బ్రతకావాల్సిందేనా ఎవరేం అనుకున్నా సరే… మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. నిజాంనవాబులను దిగంతాలకు తరిమిన చరిత్ర నల్లగొండది. ఎవరో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే నల్లగొండ బిడ్డలు చూస్తూ ఊరుకోరు.

గత బీఆరెస్ పదేళ్లపాలనలో నల్లగొండకు వాళ్లు చేసిందేం లేదు. ఎస్ఎల్బీసీ, బునాదిగాని కాలువ.. ఇలా పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా, ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదు. బీఆర్ఎస్ కాదు డీఆరెస్.. డీఈ దెయ్యాల రాష్ట్ర సమితి. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలి.

పదేళ్లు దోచుకుతిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తారట. ఆనాడు వాసాలమర్రికి వచ్చి, ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇండ్లు కూలగొట్టి స్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసిన వాసాలమర్రి పరిస్థితిని బాగు చేయాలని మా నాయకులను ఆదేశిస్తున్నా.

మేం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. నీళ్లు ఎలా ఇస్తారని కొందరు మాట్లాడుతున్నారు. ఎస్సారెస్పీ, మిడ్ మానేరు కట్టిందెవరు? ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో తెలియదా? ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నికల్పించాం.

రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించాం. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చింది నిజం కాదా? అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతిలో పెట్టింది నిజం కాదా? కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని మేం ప్రయత్నిస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారు.

రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసింది నిజం కాదా? రైతులు పండించిన ప్రతీ గింజ కొంటూ రైతులను ఆదుకుంటుంటే కడుపులో విషం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతంరిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశాం. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించాం.

ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల పోరాటాల కలను నెరవేర్చాం. ఇంతకంటే నాకు ఇంకా కావాలి? ఆనాడు తొడగొట్టి పడగొడతానని చెప్పా. పడగొట్టి చూపించా. పట్టు పట్టిన… పడగొట్టిన… ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. నాకు ఇక వేరే కోరిక లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం.

ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు. ముందు నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తున్న.

LEAVE A RESPONSE