– మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం ఓటుబ్యాంకు రాజకీయమే
– కొత్త రేషన్ కార్డులు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు
– నిరుద్యోగులకు భృతి లేదు.. ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు
– బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంది
– మిగిలినది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంది
– తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బిజెపి అధికారంలోకి రావాలి.
– భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
నల్లగొండ: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మొదటి పర్యటన నల్లగొండ జిల్లాలో చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా జన్మభూమి. నల్లగొండ జిల్లా ఉద్యమాల గడ్డ, త్యాగాల గడ్డ. అనేకమంది ఏబీవీపీ కార్యకర్తలు త్యాగాలు చేశారు. శ్రీనివాస్, మైసయ్య గౌడ్ వంటి వారు జాతీయవాదం కోసం ఈ గడ్డపై ప్రాణత్యాగం చేశారు. నల్లగొండ జిల్లా రాజకీయ చైతన్యంతో అనేక ప్రజా ఉద్యమాలకు నాంది పలికింది.
అయితే ఈ జిల్లా ఒక కుటుంబ పాలనలో ఉంది. ఈ జిల్లాను ఒక కుటుంబానికి చెందిన సోదరులు నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం చేతిలో బానిసగా ఉంది. ఆ పార్టీకి బానిసగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు.నల్లగొండ జిల్లాలో కుటుంబ పరిపాలనకు ముగింపు పలకాలంటే, బిజెపి అధికారంలోకి రావాల్సిందే.
రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశానికి ముఖద్వారం తెలంగాణ అవుతుంది. ఇక్కడ కూడా బిజెపి ప్రభుత్వం వస్తుంది. తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేస్తున్నాం. దళారీ వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీ చేస్తే పేదలకు వాటి ప్రయోజనం అందదు.
గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితిలో సంక్షేమ పథకాలు ఎవరికీ వర్తించవు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని తెలుస్తోంది. పేదలకు ఇవ్వడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అసలైన అర్హులకు ఇవ్వకుండా, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తే బిజెపి ఆధ్వర్యంలో ప్రజల తరఫున ఉద్యమించి పోరాడుతుంది. రాబోయే రోజుల్లో బిజెపి పోరాటాల బాటలో సాగుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 హామీలతో పాటు అనేక వాగ్దానాలు చేసింది. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. నిరుద్యోగులకు భృతి లేదు. ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంది. మిగిలినది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బిజెపి అధికారంలోకి రావాలి.
తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ పాలించాయి. ప్రజలు వారి పాలన చూశారు. ఇప్పుడు బిజెపి కి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుతో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తుంది.
తెలంగాణలో బిజెపి క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పడు భారతీయ జనతా పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో బిజెపి ఓటు శాతం అత్యధికంగా పెరిగింది. యావత్ తెలంగాణలో బిజెపి బలంగా ఉంది. మరింత బలోపేతం అవుతుంది. త్వరలో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. అందుకే కాంగ్రెస్ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై బిజెపి ప్రజాపోరాటాలు చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా రావాలంటే కష్టపడాలి. ఉద్యమించాలి. తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించేలా పోరాడాలి.
అవినీతి పార్టీలు, అవినీతి ప్రభుత్వాలను ఓడించి, నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతిరహిత పాలన అందించాలి.
సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఢిల్లీకి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు. రాహుల్‌కు కూడా రేవంత్ మీద నమ్మకం పోయింది. దాంతో తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి కేంద్రంపై నిందలు వేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించారు. ఉచిత రేషన్, శ్మశానవాటికలు, గ్రామ పంచాయతీలకు నిధులు.. ఇలా తెలంగాణకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోంది.
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత వల్ల నల్లగొండలో డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కదలలేకపోతున్నాయి. అందుకే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును ఏర్పాటు చేయాలి. ఎరువుల కొరత ఉందంటూ కేంద్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అడిగిన 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కంటే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం యూరియాను బ్లాక్ మార్కెట్‌కు ఎలా ఆస్కారం కల్పించినట్లు? కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదు. రైతుబంధు నిలిచిపోయింది. రైతులకు అన్ని ఆర్థిక సహాయాలు ఆపేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ భేషరతుగా మద్దతు తెలిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జాబితాలో 10 శాతం ముస్లిం మైనారిటీలను కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం ఓటుబ్యాంకు రాజకీయమే. దీన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
నిజంగా బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే బిజెపి స్వాగతిస్తుంది. శాస్త్రీయంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే మద్దతు ఇస్తుంది. కానీ ఆ 42 శాతం రిజర్వేషన్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం. పోరాడుతాం. రిజర్వేషన్ల హామీ ఇచ్చింది కాంగ్రెస్. అమలు చేయాల్సింది కూడా కాంగ్రెస్‌దే బాధ్యత. అందుకే బీసీలకే పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి సామర్థ్యం లేక కేంద్రంపై నిందలు వేస్తోంది.
తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రజలు నమ్మడం లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే బిజెపి ప్రభుత్వం రావాలంటే ప్రతి కార్యకర్త కష్టపడాలి. ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు.