– ఆఁబోతుకీ ఎద్దుకీ మధ్య తేడా ఏమిటి?
ఆబోతు, ఎద్దు రెండూ పుట్టినప్పుడు కోడెదూడలే. ఆవుకే పుడతాయి. కోడెదూడలు అంటే.. మగవి. పెయ్యదూడలు అంటే.. ఆడవి. పుట్టినప్పుడు కోడెదూడలుగా ఉన్నవాటిలో కొంత కాలం తర్వాత కొన్ని ఎద్దులు అయితే.. మరికొన్ని ఆబోతులు అవుతాయి. వ్యవసాయంలో రైతుకు ఆసరాగా ఉండేవి.. అంటే పొలం దున్నడానికి.. బండి నడపడానికి సాయం చేసేవి ఎద్దులు. ఏ కష్టం చేయకుండా.. చక్కగా తిని తిరిగేవి ఆబోతులు.
సాధారణంగా పల్లెటూర్లలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిపేటప్పుడు కొంతమంది కోడె దూడలకు శంఖుచక్రాలు ముద్ర వేసి వాటిని దేవుని పేరు మీద వదిలేస్తారు. అప్పటి నుంచి ఆ కోడె దూడ ఆబోతు అవుతుంది. దానిని వెంకన్న స్వరూపంగా భావిస్తారు.
కొన్ని ఊర్లలో ఆబోతు కోసం ప్రతి రోజూ ఉదయం గాని సాయంత్రం గాని ప్రత్యేకంగా చిట్టు, తవుడు, వేరుశెనగ అచ్చు… ఇలాంటివి ఆహారంగా పెడుతుంటారు. రోజూ ఏ సమయానికి ఆహారం పెడతారో.. ఆ సమయానికే వస్తూ ఉంటుంది. కొందరు పొలాల దగ్గర కూడా ఆబోతు కోసం ప్రత్యేకంగా పశుగ్రాసం లాంటివి పెడుతుంటారు.
పైగా దైవ స్వరూపంగా భావించడం వల్ల ఆబోతుని ఎవరూ ఏమీ అనరు. కొట్టరు. ఎప్పుడైనా అది అల్లరి చేస్తుంటే అది వెళ్లిపోవడానికి దానిపై పసుపు నీళ్లను చల్లుతారు. పంట పొలాలను తినేస్తున్నా దాన్ని కొట్టడానికి సాయం చేయరు. పంట చేలను తినకుండా ఉండాలనే.. దానికంటూ ప్రత్యేకంగా పొలం గట్టున పశుగ్రాసం పెడుతుంటారు.
ఆబోతు ఎదురుగా వస్తే దానికి ఎదురుగా వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దాన్ని దైవ స్వరూపంగా భావించడం.. రెండోది.. ఉన్నట్టుండి ఆబోతు రంకె వేసిందంటే.. ఎదురుగా ఎవరుంటే వారిని కుమ్మి పడేస్తుంది. అందుకే దానికి వీలైనంత దూరంగా ఉంటారు. దాని బారిన పడి చనిపోయిన వాళ్లు కూడా ఉంటారు.
తెలుగునాట ఓ సామెత ఉంది. అదే ‘అచ్చోసిన ఆబోతులా తిరుగుతున్నాడని’ అంటూ ఉంటారు. పనీపాటా, భయమూ లేకుండా ఊరి మీద పడి ఆవారాగా తిరిగే వారిని అలా వ్యవహరిస్తుంటారు.
– బెల్లంకొండ లక్ష్మి