(నవీన్)
ప్రయివేట్ వ్యక్తుల చేతిలో వున్న లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేపట్టాలన్న పాలసీ మార్పుతోనే స్కామ్ మొదలైంది. పాలసీమార్పునకు కేబినెట్ ఆమోదం వుందా? లేదా? అన్న ప్రస్తావన SIT నివేదికల్లో కాని ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో కాని లేదు. జె బ్రాండ్ లిక్కర్ స్కామ్ మొత్తం వ్యవహారంలో బాధ్యతను వేర్వేరు స్థాయిలలో చూడాల్సి ఉంటుంది.
1 క్రిమినల్ బాధ్యత: లంచాలు తీసుకోవడం, కుట్ర చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడినట్లు SIT ఛార్జ్‌షీట్‌లో ఆరోపించబడిన రాజకీయ నాయకులు, అధికారులు, మరియు ప్రైవేట్ వ్యక్తులు చట్టపరంగా బాధ్యత వహించాలి. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరుగుతోంది.
2 సామూహిక బాధ్యత: ఒక విధాన నిర్ణయానికి మొత్తం మంత్రిమండలి సామూహికంగా బాధ్యత వహించాలి. ఈ పాలసీ క్యాబినెట్ ఆమోదంతో జరిగి ఉంటే, దాని పర్యవసానాలకు అప్పటి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మొత్తం క్యాబినెట్ రాజ్యాంగపరంగా జవాబుదారీ అవుతుంది.
3 వ్యక్తిగత మంత్రిత్వ బాధ్యత: తన శాఖలో జరిగిన భారీ అక్రమాలకు సంబంధిత శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో జరిగిన వాన్ పిక్ స్కామ్ లో అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ జైలుకి వెళ్ళారు. ఇది ప్రజాస్వామ్య జవాబుదారీతనంలో కీలకమైన సంప్రదాయం.
4 పరిపాలనా బాధ్యత: చట్టవిరుద్ధమైన ఆదేశాలను అమలు చేయడం లేదా అక్రమాలు జరుగుతున్నప్పుడు నిష్క్రియంగా ఉండటం కూడా నేరంతో సమానమే. ఈ కేసులో, విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన, అక్రమాలను నిరోధించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారులు కూడా పరిపాలనాపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాన్ పిక్ స్కామ్ లోనే ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలుకు వెళ్ళారు.
లిక్కర్ పాలసీ మార్పుతోనే లంచాలు మొదలయ్యాయి. SIT ఛార్జ్‌షీట్ ప్రకారం, ఈ కుట్ర 2019 చివరలో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఒక సమావేశంతో మొదలైంది. అక్కడ, వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన పెద్దలుమద్యం డిస్టిలరీల యజమానులను బెదిరించి, 12% నుండి 20% వరకు లంచాలు చెల్లించాలని, లేకపోతే వ్యాపార ఆర్డర్లు నిలిపివేస్తామని హెచ్చరించినట్లు గుర్తించారు.
ఈ కుంభకోణానికి సూత్రధారిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A-1)ని పేర్కొన్నారు. లంచాల రూపంలో వసూలు చేసిన డబ్బును, ఇద్దరు ఎంపీల ద్వారా అప్పటి ముఖ్యమంత్రికి నెలకు ₹50-60 కోట్ల చొప్పున చేరవేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అనేది కేవలం కొందరి అవినీతి మాత్రమే కాదు, విధాన రూపకల్పన ప్రక్రియనే దుర్వినియోగం చేసి, ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి, వ్యక్తిగత లాభం కోసం వ్యవస్థను ఎలా వాడుకున్నారనడానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. దర్యాప్తు పూర్తయి, న్యాయస్థానంలో ఆరోపణలు రుజువైతే, ఈ కుట్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ, వారి హోదాతో సంబంధం లేకుండా, చట్టం ముందు బాధ్యత వహించాల్సి ఉంటుంది.