– ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం
న్యూఢిల్లీ: రిటైలర్లు.. కొనుగోలుదారుల నుంచి క్యారీ బ్యాగులకు డబ్బు వసూలు చేయడం అన్యాయమైన చర్య అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. రిటైలర్లు క్యారీ బ్యాగులకు డబ్బు చెల్లించమని అడగడాన్ని ప్రభుత్వం సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. డబ్బు వసూలు చేయడం అన్యాయమని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీర్పు ఇచ్చింది వాస్తవమేనా ఆరా తీశారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వినియోగదారుల రక్షణ, సాధికారత కోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 2024 నవంబర్ 27న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వినియోగదారుల నుంచి క్యారీ బ్యాగులకు డబ్బు వసూలు చేయడం వినియోగదారుల రక్షణ చట్టం- 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతికి సమానమని స్పష్టం చేశారు.
ప్రపంచీకరణ, సాంకేతికతలు, ఇ-కామర్స్ మార్కెట్లు మొదలైన ఈ యుగంలో వినియోగదారుల రక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం, 1986 స్థానంలో కొత్తగా వినియోగదారుల రక్షణ చట్టం- 2019 అమలులోకి తెచ్చామన్నారు. కొత్త వినియోగదారుల రక్షణ చట్టం- 2019 ద్వారా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేశామని, వినియోగదారుల కమిషన్లలో న్యాయనిర్ణయ ప్రక్రియను సరళీకరించడం, వినియోగదారుల కమిషన్ల ఆర్థిక అధికార పరిధిని పెంచడం, ఫిర్యాదును ఆన్లైన్లో దాఖలు చేయడం, విచారణ కోసం వీడియో కాన్ఫరెన్సింగ్, దాఖలు చేసిన 21 రోజుల్లోనే ఫిర్యాదులను అంగీకరించే వెసులుబాటు తీసుకొచ్చామని వివరించారు. కల్తీ ఉత్పత్తులు/నకిలీ వస్తువుల తయారీ/అమ్మకానికి శిక్షా నిబంధనలు, ఇ-కామర్స్ అమ్మకాలలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి నిబంధనలు రూపొందించాయని చెప్పారు.
వినియోగదారుల రక్షణ చట్టం, 2019 నిబంధనల ప్రకారం, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 2020 జూలై 24న ఉనికిలోకి వచ్చిందని, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల వల్ల వినియోగదారులకు కలిగే నష్టాన్ని నివారించడానికి, వాపసులు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా తప్పుదారి పట్టించే ప్రకటనలను నిరోధించడం, నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు.