– ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్
అమరావతి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రెండు ఎక్సైజ్ స్టేషన్లలోని సిబ్బందిని సమూలంగా మార్చుతూ ఎక్సైజ్ శాఖ కమీషనర్ నిశాంత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రెండు ముఖ్య ఎక్సైజ్ స్టేషన్లలో సిబ్బంది పనితీరుపై పలు మార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు లేకపోవటంతో గురువారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
నవోదయం 2.0 కార్యాచరణను మరింత బలోపేతం చేయటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ స్పష్టం చేసారు. రాజమహేంద్రవరం నార్త్ , సౌత్ స్టేషన్లలో గత సమీక్షలలో వారి పనితీరు సక్రమంగా లేకపోవడం, రెండు అవకాశాలు ఇచ్చినప్పటికీ అవసరమైన మార్పు చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇచ్చిన సూచనలు, ఫాలో అప్ సమీక్షల తరువాత కూడా అధికారుల సూచనల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఈ రెండు స్టేషన్లలో ఉన్న మొత్తం సిబ్బందిని ఇతర యూనిట్లకు బదిలీ చేసి, పూర్తిగా కొత్త సిబ్బందిని నియమించారు. ఈ మార్పులు మెరుగైన ఫలితాల సాధన దిశగా తీసుకున్న చర్యలుగా అధికారులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది కి పనితీరు ఆధారంగా చర్యలు తప్పవన్న సంకేతాన్ని ఈ నిర్ణయం స్పష్ట పరుస్తుండగా, అవసరమైతే మిగిలిన చోట్ల కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడానికి శాఖ సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఇచ్చినట్లయింది.