– డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్
– బీజేపీ మోడల్ వల్లే దక్షిణాదికి న్యాయం
– రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని రేవంత్ చెప్పడం బీఆర్ అంబేద్కర్ ని ఘోరంగా అవమానించడమే
– డీలిమిటేషన్ ఆర్టికల్ 82 మరియు 170 ప్రకారం ప్రతి పది ఏళ్లకు జరిగే సెన్సస్ ఆధారంగా చేపట్టే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ
– దీనిపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదు
– మహిళా రిజర్వేషన్లు పెరగడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా?
– ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెరగడం కాంగ్రెస్ చూడలేకపోతోందా?
– ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి వెనుకబడిన జిల్లాల్లో సీట్లు తగ్గించి, కేవలం హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకే సీట్లు పెంచుతారా?
– రేవంత్ టు గాంధీ సెటిల్మెంట్ రాజకీయం బీజేపీలో ఉండదు
– బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు మహిళా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పడం బీఆర్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
రాజ్యాంగ ప్రియంబుల్లోనే ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం’ అని స్పష్టంగా ఉందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తమ పార్టీయే ఇచ్చిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అనేది ఆర్టికల్ 82 మరియు 170 ప్రకారం ప్రతి పది ఏళ్లకు జరిగే సెన్సస్ ఆధారంగా చేపట్టే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దీనిపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా, భారత రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్‌తో సంప్రదించి డీలిమిటేషన్ కమిషన్‌ను నియమిస్తారని, ఆ కమిషన్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వంటి సభ్యులు ఉంటారని ఆయన వివరించారు. అదేవిధంగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి నాయకులు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
గత చరిత్రను గుర్తు చేస్తూ, 1952, 1962, 1972, 2002లో డీలిమిటేషన్ జరిగిన విషయాన్ని ప్రస్తావించిన మహేశ్వర్ రెడ్డి, 1962లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 43 సీట్లు ఉండగా, 1972లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డీలిమిటేషన్ వల్లే మనకు ఒక సీటు తగ్గి 42 అయిందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ చేసిన పునర్విభజన వల్లే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది.
కానీ ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో 50 శాతం పైగా సీట్లు పెంచి, పార్లమెంటు సీట్ల సంఖ్యను 850కి చేర్చడం ద్వారా సామాజిక న్యాయం చేయాలని చూస్తోంది. దీనివల్ల దాదాపు 80 మంది అదనపు ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు గణనీయంగా అధిక ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు పెరగడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా? ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెరగడం కాంగ్రెస్ చూడలేకపోతోందా? అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఆర్టికల్ 330, 332 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఆయన గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్ పాలసీ’ లేదా ‘జీఎస్డీపీ మోడల్’ అనే దానికి అసలు రాజ్యాంగబద్ధత లేదని మహేశ్వర్ రెడ్డి కొట్టిపారేశారు. జీఎస్డీపీ (GSDP) అంటే ‘గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్’అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పన్నులు కట్టే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి కొత్త నరేటివ్ అని విమర్శించారు.
ఇదే పద్ధతిని రాష్ట్రంలో అమలు చేస్తే, రెవెన్యూ తక్కువగా ఉండే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి వెనుకబడిన జిల్లాల్లో సీట్లు తగ్గించి, కేవలం హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకే సీట్లు పెంచుతారా? ఇది పేదలను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి తన నేషనల్ పొలిటికల్ ప్రమోషన్ కోసం, మల్లికార్జున్ ఖర్గే సీటుపై కన్నేసి, గాంధీ కుటుంబం దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఆడుతున్న ‘జగన్నాటకం’ అని విమర్శించారు.
గణాంకాలతో సహా ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన మహేశ్వర్ రెడ్డి, బీజేపీ మోడల్ వల్లే దక్షిణాదికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 129 సీట్లు (24%), బీజేపీ ప్రతిపాదించిన 53% సీట్ల పెంపు ఫార్ములా వల్ల 198కి పెరుగుతాయని వివరించారు. ఒకవేళ కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ చెప్పినట్లు కేవలం జనాభా ప్రాతిపదికన (2011 సెన్సస్) వెళ్తే కేవలం 171 సీట్లు, ఎలక్ట్రోరల్ ట్రెండ్ ప్రకారం వెళ్తే కేవలం 159 సీట్లు మాత్రమే వస్తాయని, తద్వారా దక్షిణాదికి 39 సీట్ల వరకు నష్టం జరుగుతుందని ఆయన లెక్కలు చూపారు. సౌత్ ఇండియాకు అన్యాయం జరిగే మోడల్‌ను కాంగ్రెస్ సమర్థిస్తూ, మళ్ళీ బీజేపీ మీద బురద జల్లడం శోచనీయమన్నారు.
కాంగ్రెస్ అంటేనే “Creating Obstacles for Nation’s Growth and Empowerment of South States” అని ఆయన విమర్శించారు. బ్రిటిష్ వారి ‘డివైడ్ అండ్ రూల్’ పాలసీని రేవంత్ రెడ్డి పుణికిపుచ్చుకున్నారని, నార్త్-సౌత్ విభజన రాజకీయం చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఓటు హక్కు కల్పించింది తామే అని కాంగ్రెస్ చెప్పుకోవడంపై స్పందిస్తూ, 1919లోనే బ్రిటిష్ పాలనలో మహిళలకు ఓటు హక్కు వచ్చిందని, బ్రిటిషర్ల వారసత్వం కాబట్టి తామే చేశామని చెప్పుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.
మరోవైపు రాష్ట్రంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి దేశ రాజకీయాల గురించి లెటర్లు రాయడం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ పాలిటిక్స్‌కు నిదర్శనమన్నారు. “నీ సీటు కాపాడుకోవడానికి నువ్వు చేసే RTGS (రేవంత్ టు గాంధీ సెటిల్మెంట్) రాజకీయం బీజేపీలో ఉండదు. డీలిమిటేషన్ అంశంపై ఏ మీడియా పాయింట్ దగ్గరైనా, ఏ డాటాతోనైనా ఓపెన్ డిబేట్‌కు మేం సిద్ధం.. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా?” అంటూ మహేశ్వర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని, దక్షిణాదికి మేలు చేసే మహిళా రిజర్వేషన్ , డీలిమిటేషన్ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలపాలని ఆయన హితవు పలికారు.