సింగపూర్ వీధుల్లో నాయుడి నడక వ్యాయామం కోసం కాదు. ఉత్సుకతతో కూడిన నిరంతర అన్వేషి ఆయన. కొత్త విషయాలను అభ్యసించి, వాటిలోని మంచిని అవగాహన చేసుకుని ఆచరణలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మే ఆయన, మన భవిష్యత్తు కోసం కలయతిరిగారు.
సింగపూర్‌లోని బిడదారీ హౌసింగ్ ఎస్టేట్ ఒకప్పుడు శ్మశానవాటిక. నేడు, 30,000 మంది జనాభా నివసిస్తున్న 10 వేల కుటుంబాల అత్యద్భుతమైన, పర్యావరణ హితమైన నివాస సముదాయం ఇది. 250 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్ట్, సింగపూర్ యొక్క “సిటీ ఇన్ నేచర్” విజన్‌కు సజీవ సాక్ష్యం. చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో భాగంగా, బిడదారీ ఎస్టేట్‌లో రెండు గంటల పాటు కాలినడకన పర్యటించారు.
సింగపూర్ అధికారులు, చెట్లను తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని వివరించారు. ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దిన సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు మరియు అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీల పనితీరును సీఎం ప్రశంసించారు. పట్టణీకరణ ప్రకృతితో ఎలా సహజీవనం చేయగలదో బిడదారీ నిరూపించింది.
బిడదారీ సందర్శన అనంతరం, ముఖ్యమంత్రి బృందం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్, మరియు ప్రపంచ బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో, పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరలో నాణ్యమైన గృహ నిర్మాణంపై దృష్టి సారించారు.
“బిడదారీ ప్రాజెక్టును రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉంది. పర్యావరణం దెబ్బతినకుండా చేపట్టిన అర్బన్ ప్రాజెక్టు అద్భుతంగా ఉంది” అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్న సీఎం బృందం, “అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్త నగరం. ఇది ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం” అని ఆయన తెలియజేశారు.
అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ సంస్థలను ఆయన ఆహ్వానించారు. సింగపూర్ ఇప్పటికే అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించింది, ప్రపంచ బ్యాంక్ కూడా నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చించారు.
నిత్య విద్యార్థిలా నాయుడు గారు నడిచి పొందిన అభ్యాసం, అనుభవాల నుండి మన భవిష్యత్తుకు మెరుగైన ప్రణాళికలు రూపొందించి, సమర్థవంతంగా అమలు చేస్తారు. ఈ కృషి ఫలితంగా, ఆయన కలలుగనే స్వర్ణాంధ్ర 2047 సాకారమై, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు వైపు సాగుతుందని ఆశిద్దాం!