– మృతుడి అక్క ఆరోపణ
– ఆదుకోవాలని లోకేష్‌కు విజ్ఞప్తి
– మృతుడు గతంలో వైసీపీ సానుభూతిపరుడు
తాడేపల్లి: మా కుటుంబాన్ని టీడీపీ కి చెందిన వ్యక్తులు ఇబ్బందులు పెడుతున్నారంటూ తాడేపల్లి మహానాడులో నాలుగు రోజుల కిందట గోడపైన రాసి ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరిపోసుకుని ఎం.డి. బాజీ అనే 31 ఏళ్ళ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్న బాజీను ఉద్దేశం పూర్వకం గానే టీడీపీ కి చెందిన వ్యక్తులు బాజీ పై, తన అన్నపై పలుమార్లు దాడి చేశారని మృతుని అక్క ఆరోపించారు. ఇప్పుడు ఆ బాధలు భరించలేక తమ్ముడు చనిపోయారని తెలిపారు.
గత నాలుగు రోజులుగా పోలీసులు చుట్టూ తిరుగుతున్న పార్టీ నేతల వత్తిడి తో కేసు నమోదు చేయకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని పైగా మీరే చంపేసి ఖననం చేసి వచ్చారా అని పోలీసులు హేళన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో మనిషి చనిపోయి బాధలో ఉంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టి మాట్లాడుతున్నారని, నిందితులేమో మా ఇంటి ముందే కాలర్ ఎగురవేసి మాకు తెలుగు దేశం పార్టీ నేతల అండ ఉందని, మీ కేసు తీసుకోరని బహిరంగంగానే భయపెడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. వారి నుంచి మాకు ప్రాణం ఉందని, కేసును విచారించి నిందితులకు చట్ట ప్రకారం అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలని, మా కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.