– సింగపూర్‌లో నాంది
(చాకిరేవు)
అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఇప్పటికే IBM, TCS, L&T వంటి దిగ్గజాలు జట్టుగా చేరి బలమైన పునాదులు వేయగా, ఇటీవలే బెంగళూరుకు చెందిన QPiAI సైతం అమరావతికి వచ్చి చంద్రబాబుతో సమాలోచనలు చేసి ఆసక్తి చూపింది.
ఏ టెక్ దిగ్గజం అయినా వచ్చే కొత్త టెక్నాలజీ అందుకోక పోతే, పోటీపడకపోతే.. చరిత్రలో కలిసిపోతాయి. క్వాంటం వ్యాలీలో ఇప్పుడు దిగ్గజాలు ఒక్కొక్కటి దిగనున్నాయి పోటీపడడానికి. అవి రాకతప్పని పరిస్థితిని చంద్రబాబు రాజేశారు అనడం సముచితం.
ఆ క్రమంలో.. తాజాగా, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్‌లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను సందర్శించడంతో, అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మరో గ్లోబల్ పోటీదారుని ఆకర్షించే అవకాశం దొరికింది. మైక్రోసాఫ్ట్ ఎంట్రీ అంటే.. ఏపీలో AI భవిష్యత్తుకు ఒక కొత్త అడుగు పడినట్టే!
మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్లో లోకేష్ అధ్యయనం!
మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లోని AI Ghost Store గ్యాలరీల్లో మంత్రి లోకేష్ బృందం ఆశ్చర్యకరమైన విషయాలు చూశారు. ఆరోగ్య సంరక్షణ నుండి తయారీ వరకు, ఫైనాన్స్ నుండి వినియోగదారుల రంగాల వరకు AI ఎలా విప్లవాత్మక మార్పులు తెస్తుందో ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా, IBM-Microsoft Copilot జోన్లో Azure ఆధారిత పరిష్కారాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో నిశితంగా గమనించారు.
ఈ వినూత్న టెక్నాలజీలు వ్యాపారులకు, వినియోగదారులకు, ప్రేక్షకులకు ఎలా చేరువవుతాయో తెలుసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్‌లు, పరిశ్రమ పరిష్కారాలు, నవకల్పనల వర్క్‌షాప్‌లు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు – ఇలా ప్రతి కోణాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు.
మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, సీటీఓ మార్క్ సౌజా, సెలా హెడ్ జాస్మిన్ బేగంతో జరిగిన కీలక భేటీలో మంత్రి లోకేష్ ఆసక్తికర ప్రతిపాదనలు చేశారు. జనరేటివ్ AI ఆధారిత పరిష్కారాలను కనుగొని, సమన్వయం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ జోన్ లేదా టెక్నాలజీ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
తెలుగు వారి ఫిజిక్స్, లెక్కల, టెక్ సామర్థ్యాన్ని సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి, అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో Azure OpenAI, Microsoft Copilot టెక్నాలజీలతో సంబంధించి 2026లో ప్రపంచ స్థాయి హ్యాకథాన్‌ను నిర్వహించాలని సూచించారు. దీనికి అవసరమైన అన్ని రకాల మద్దతు, సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. జనరేటివ్ AI, హైబ్రిడ్ క్లౌడ్ వంటి cutting-edge టెక్నాలజీలలో ఏపీ టాలెంట్ పూల్‌ను skill transformation కోసం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కోరారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కూడా అమరావతి క్వాంటం వ్యాలీకి రాబోతున్నది అని వచ్చిన సమాచారానికి ఈ సందర్శన బలంచేకూరుస్తోంది.