– ప్రధానకార్యదర్శి ఎల్వీ పై వేటు పడిన వివాదం
(నవీన్)
2019 నవంబర్‌లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్.వి. సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ రాష్ట్ర బ్యూరోక్రసీలో, రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. అది కేవలం ఒక సాధారణ పరిపాలనా మార్పుగా కాకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), రాష్ట్ర అత్యున్నత అధికారి మధ్య జరిగిన తీవ్ర అధికార ఘర్షణకు ముగింపుగా నిలిచిపోయింది. ఈ వివాదం వెనుక అనేక పరిణామాలు, విభేదాలు ఉన్నాయి.
రాష్ట్రానికి అత్యంత కీలకమైన, ఆదాయ వనరైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మేనేజింగ్ డైరెక్టర్ (MD) పదవిలో డి. వాసుదేవ రెడ్డిని నియమించాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఫైలుపై రాసి ఆదేశాలు జారీ చేశారు.(వాసుదేవరెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఇపుడు రిమాండ్ ఖైదీగా జైల్ లో ఉన్నారు.)
పోస్టింగులలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే కావడంతో, నాటి సీఎస్ సుబ్రహ్మణ్యం ఆ ఆదేశాలను అమలు చేస్తూ 2019 సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. సుబ్రహ్మణ్యం ఈ నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించనప్పటికీ, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించే అధికారిగా పేరున్న ఆయనకు, ప్రభుత్వ వేగానికి మధ్య అప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ నియామకం వారి మధ్య ఉన్న ఘర్షణను మరింత పెంచిందని విశ్లేషకులు భావించారు.
సీఎంఓకు, సీఎస్‌కు మధ్య ప్రచ్ఛన్నంగా సాగుతున్న ఈ పోరు, ఒక షో-కాజ్ నోటీసుతో బహిర్గతమైంది. ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడిగా, సీఎంఓలో కీలక అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ నియమాలను (Business Rules) ఉల్లంఘించారని ఆరోపిస్తూ సీఎస్ సుబ్రహ్మణ్యం ఆయనకు షో-కాజ్ నోటీసు జారీ చేశారు.
తన అనుమతి లేకుండా కేబినెట్ ఎజెండాలో అంశాలను చేర్చడం, ఫైళ్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం వంటి కారణాలతో “తీవ్రమైన దుష్ప్రవర్తన”, “ఉద్దేశపూర్వక అవిధేయత” ప్రదర్శించారని నోటీసులో పేర్కొన్నారు. ప్రవీణ్ ప్రకాష్‌ను ప్రశ్నించడం అంటే పరోక్షంగా ముఖ్యమంత్రినే ప్రశ్నించినట్లు అయ్యింది.
షో-కాజ్ నోటీసు జారీ చేసిన మూడు రోజులకే, నవంబర్ 4, 2019న సుబ్రహ్మణ్యంపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను ప్రాధాన్యత లేని పదవిగా భావించే బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్-జనరల్‌గా బదిలీ చేసింది.
ఈ బదిలీలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏమిటంటే, ఆ బదిలీ ఉత్తర్వులపై సంతకం చేసింది స్వయంగా ప్రవీణ్ ప్రకాష్. తన పై అధికారి అయిన సీఎస్‌ను, ఒక కింది స్థాయి అధికారి బదిలీ చేయడం బ్యూరోక్రసీ చరిత్రలో “అపూర్వమైనది”గా రికార్డయింది.
ఈ బదిలీపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ముఖ్యమంత్రి “నియంతృత్వ వైఖరి”కి నిదర్శనమని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు విమర్శించాయి. నిజాయితీగా పనిచేసే అధికారులను అవమానించడమేనని, ఇది పరిపాలనా వ్యవస్థ పతనానికి దారితీస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం తక్షణ కారణంగా కనిపించినప్పటికీ, ఈ బదిలీ వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో పనిచేస్తున్న అన్యమతస్థులైన ఉద్యోగులను తొలగించాలనే విషయంలో సుబ్రహ్మణ్యం కఠినంగా వ్యవహరించడం కూడా, ప్రభుత్వానికి నచ్చలేదని ఒక బలమైన వాదన ఉంది. ఈ వైఖరే ఆయన బదిలీకి ఒక ముఖ్య కారణమై ఉండవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద, ఎల్.వి. సుబ్రహ్మణ్యం బదిలీ కేవలం ఒక అధికారి మార్పు కాదు. అది నియమబద్ధ పాలనకు, రాజకీయ సంకల్పానికి మధ్య జరిగిన సంఘర్షణకు పరాకాష్ట. ఈ సంఘటనతో, రాష్ట్ర పరిపాలనలో సీఎంఓ తిరుగులేని అధికార కేంద్రంగా మారిందని, నిబంధనల కంటే రాజకీయ విధేయతకే ప్రాధాన్యత అనే స్పష్టమైన సందేశం బ్యూరోక్రసీకి పంపబడింది. ఈ పరిణామం, రాష్ట్ర పరిపాలనపై, అధికారుల మనోస్థైర్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపింది.
ఎంత కట్టుదిట్టంగా చేసిన నేరంలో అయినా ఏదో ఒక క్లూ దొరకుతుందని క్రిమినాలజీ చెప్తుంది. జగన్ ప్రభుత్వంలో స్కాములు జరిగాయని ప్రజలకు కూడా అర్ధమౌతోంది. అయితే ఆధారాలు సేకరించడం దర్యాప్తు సంస్థలకు తలనొప్పిగా మారుతోంది.
లిక్కర్ స్కామ్ గురించి జనసామాన్యానికి తెలిసిపోయినా, ఆధారాలు ఏమిటన్న ప్రశ్న అన్ని వర్గాల్లోనూ ఉంది. బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ మేనేజింగ్ డైరక్టర్ గా వాసుదేవరెడ్డిని నియమించాలన్న నోట్ ఫైల్ మీద స్వయంగా జగన్ సంతకం చేయడమే, లిక్కర్ స్కామ్ కి పెద్ద ఆధారమని భావిస్తున్నారు.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)