*మహిళల పేరిట సంక్షేమ పథకాలు అమలు
*నేలకొండపల్లి డిగ్రీ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటి, మార్కెట్ యార్డులో మండల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని, మహిళల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు లతో కలిసి బుధవారం నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటారు.
అనంతరం నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణ లో మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల కష్టాలు చూసిన ప్రభుత్వం వారికి భరోసా కల్పించే విధంగా పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. ప్రతి రోజు పేదల ముఖంలో చిరునవ్వు ఉండేలా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు.
ప్రతి ఇంటికి మహిళలు మహాలక్ష్మి లుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఇండ్లను ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరిట ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు.
గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో లక్ష మంది మహిళలను లక్షాధికారులు చేస్తామనీ మాట ఉండేదని, ప్రస్తుతం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయిన ఆర్థిక సంవత్సరంలో సున్నా వడ్డీతో 25 వేల కోట్ల రూపాయలు 65 లక్షల మంది మహిళ సంఘాల మహిళలకు అందించామని అన్నారు.
గడిచిన 4 నెలల్లో మహిళలకు ప్రజా ప్రభుత్వం సున్నా వడ్డీ క్రింద 855 కోట్లు మహిళా సంఘాలకు విడుదల చేశామని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో మహిళ శక్తి సంబరాలు నిర్వహిస్తూ సున్నా వడ్డీ సొమ్ము చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళా సంఘాల్లో చేరే వయస్సును కనీస వయస్సు 15 సంవత్సరాలు గరిష్ట వయస్సు 65 సంవత్సరాలకు సవరించామని అన్నారు.
గత పాలకులు పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి విమర్శించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి రేషన్ కార్డు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉగాది నుంచి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేశామని అన్నారు.
గత పాలకులు 10 ఏళ్ళలో రైతులకు 17 వేల కోట్ల రుణ మాఫీ చేస్తే ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలోనే దాదాపు 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు.
ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన పేదలందరికీ దశలవారీగా తప్పనిసరిగా అందించే బాధ్యత తనపై ఉందని అన్నారు.
అనంతరం మంత్రి నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు మాదారం గ్రామంలో 88.5 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, బోదులబండ గ్రామంలో 15 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, మండ్రాజుపల్లి గ్రామంలో మండ్రాజుపల్లి నుండి కోరట్లగూడెం వరకు 2 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఆర్డీఓ నరసింహా రావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎర్రయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటి చైర్మన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.పరంజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.