– ఓటేసిన ప్రజలనే కాటేసిన కాలనాగు కాంగ్రెస్ సర్కారు
– మీనాక్షి వాకింగ్ మనస్సాక్షి లేని రేవంత్ కు షాకింగ్
– రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం, మీనాక్షి నటరాజన్ షాడో సీఎం
– అసలు మీ పాదయాత్ర ఉద్దేశ్యమేంటి మీనాక్షి మేడమ్?
– రేవంత్ ను గద్దెదించడానికా?, మళ్ళీ ప్రజలను వంచించడాని కా?
– పాదయాత్రలో కాంగ్రెస్ మోసాలపై ప్రజలంతా తిరగబడాలి
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ది ప్రజల కోసం చేపట్టిన పాదయాత్ర కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిన ఆరు గ్యారెంటీల అంతిమ యాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
పచ్చి అబద్ధాలు, గోబెల్స్ మాటలు, అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాలనాగులా నమ్మి ఓటేసిన ప్రజలనే నిర్దయగా కాటేసిందని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
మీనాక్షి నటరాజన్ వాకింగ్ ఏమాత్రం మనస్సాక్షి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహకందని షాకింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొనే డమ్మీ సీఎం అని, మీనాక్షి నటరాజన్ అదే కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ లో కూర్చొని రాహుల్ గాంధీ ఎజెండా అమలు చేస్తున్న షాడో సీఎం అని ఆయన ఎద్దేవా చేశారు.
ఆర్ఎస్ఎస్ మూలాలు ఉండి డిల్లీలో మోడీ, గల్లీలో చంద్రబాబు భజన చేస్తున్న రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్మడం లేదని, అందుకే రేవంత్ ను కలవడానికి కూడా రాహుల్ గాంధీ ఇష్టపడటంలేదని జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పెద్ద కాలాంతకుడని తెలిసే కాంగ్రెస్ పెద్దలు ఆయనను పక్కనబెట్టి మీనాక్షి నటరాజన్ ను రాహుల్ గాంధీ దూతగా రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు.
అసలు మీ పాదయాత్ర ఉద్దేశ్యమేంటి మీనాక్షి మేడమ్? అని జీవన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ భావజాలం బొత్తిగా లేని రేవంత్ రెడ్డి సీఎం గద్దెదించడానికా? లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు సరికొత్త మోసాలతో మళ్ళీ ప్రజలను వంచించడానికా? అని ఆయన ప్రశ్నించారు.
మీనాక్షి నటరాజన్ పాదయాత్ర గత ఎన్నికల్లో ఇచ్చిన 420హామీలకు సమాధి, మరో నయా మోసానికి పునాది అని ఆయన దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లకోసం ’మీనాక్షి నటరాజన్ ’సరికొత్త నాటకానికి, డిల్లీకి డబ్బుమూటలు పంపే మాయాజాలానికి తెరదీశారని ఆయన ఆరోపించారు.
పాదయాత్రలో కాంగ్రెస్ మోసాలపై ప్రజలంతా తిరగబడాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.