– మాటల్లో గాంధీయిజం, చేతల్లో గాడ్సేయిజం
– జనహిత పాదయాత్ర పేరుతో జనంపై మీనాక్షి దండ యాత్ర
-నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులు అక్రమం
– బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
నిజామాబాద్: తాను గాందేయవాదినని చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చేతల్లో మాత్రం గాడ్సేయిజం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
జనహిత పాదయాత్ర పేరుతో మీనాక్షి జనంపై దండ యాత్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆలూరు నుంచి ఆర్మూర్ వరకు మీనాక్షి శనివారం పాదయాత్ర సందర్భంగా ఎక్కడ నిరసన సెగలు తగులుతాయోనన్న భయంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను , రైతు నాయకులను పెద్ద ఎత్తున అరెస్టులు చేయించడం అక్రమమని ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి పదవి కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్ ప్యాలెస్ టూ ఢిల్లీ కి చక్కర్లు కొడుతోంటే షాడో సీఎం మీనాక్షి నటరాజన్ ఆలూరు టూ అర్మూర్ పాదయాత్ర పేరుతో అన్నదాతలపై దండయాత్ర చేస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించు కోవడానికి గులాబీ శ్రేణులను ముందస్తు గా అరెస్టు చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు
మోసపూరిత కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడాలని, సిద్ధులగుట్ట శివయ్య సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఒట్లు ఏమయ్యాయని ప్రశ్నించాలని ఆయన కోరారు. రుణ మాఫీ కాని, రైతు భరోసా రాని, రైతు బీమా అందని రైతులు కాంగ్రెస్ సర్కారు ను నిలదీయాలని, తులం బంగారం రాని వారంతా రోడ్లపైకొచ్చి మీనాక్షిని ప్రశ్నించాలని, పెన్షన్లు పెంచుతామన్న హామీని తుంగలో తొక్కినందుకు అవ్వా తాతలు నిలదీయాలని, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రాని యువకులు, స్కూటీలు రాని విద్యార్థినులు కాంగ్రెస్ సర్కారుపై తిరగబడాలని అసలు కాంగ్రెస్ పాదయాత్ర దేనికని మీనాక్షి నటరాజన్ ను అడగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.