– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: బాలబాలికల విద్యా వికాసమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం సత్తెనపల్లి, రాజుపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో రూ.3.87 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సమగ్రశిక్షా, పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసిన 1 కోటి 59 లక్షల 50 వేల నిధులతో కస్తూరిబా గాంధీ పాఠశాల రాజుపాలెంలో బాలికల అదనపు వసతిగృహం, 1కోటి 67 లక్షల 54 వేలతో సత్తెనపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాల బాలికల అదనపు వసతిగృహం, సత్తెనపల్లి కేజీబీవీలో కంప్యూటర్ రూమ్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, లైబ్రరీల కోసం 60 లక్షల 10 వేల నిధులతో చేపట్టిన పనులను శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్న విద్యా మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ నిధులు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం, సౌకర్యాలు వాడుకుని బాలికలు ఉన్నత విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కూటమి, నాయకులు పాల్గొన్నారు.