– 10 శాతం ముస్లింలకు కేటాయించడం వల్ల బీసీలకు మిగిలేది 32 శాతమే
– కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి రూ.20,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తామని చెప్పారు
– రెండు బడ్జెట్లు పూర్తయ్యినా, నయాపైసా కూడా విడుదల కాలేదు
– రూ.20,000 కోట్లు ఇవ్వడానికి ఏ షెడ్యూల్ అడ్డంగా ఉంది?
– ఏ ఆర్టికల్ అడ్డవుతోంది?
రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు, ఎవరికి ఇచ్చారో చెప్పగలరా?
– ఆదిలాబాద్ బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్
హైదరాబాద్: ఢిల్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దుష్ప్రచారం చేసుకుంటుందో రాష్ట్రంలోని బీసీలు అన్నీ గమనిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు. ఈ విషయాన్ని శాసనసభలో బిల్లు పెట్టిన సందర్భంలోనే మేము స్పష్టంగా చెప్పాం.
బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టినట్టే పెట్టి, ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చేర్చి, ఆ బిల్లును సమర్థించకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ బిల్లు పెడతారు, భవిష్యత్తులో ఢిల్లీలో ధర్నా చేస్తారు అని అప్పుడే చెప్పాం. మేము చెప్పినదే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న నాటకాల రూపంలో నిజమవుతోంది.
శాసనసభలో ముస్లింలు లేనట్లుగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామా అనే ప్రశ్నకు, ఇప్పటికీ కాంగ్రెస్ సమాధానం ఇవ్వలేదు. మేము లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ ఇంకా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ధర్నాను 42 శాతం బీసీలకోసమని చెబుతున్నారు. కానీ వాస్తవానికి అది ముస్లింలకు 10 శాతం కట్టబెట్టాలన్న ఆలోచనతోనే నడుస్తోంది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. ఇప్పుడు 42 శాతం పేరుతో రిజర్వేషన్లు పెరిగినట్లు చెప్పి, అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడం వల్ల బీసీలకు మిగిలేది 32 శాతమే.
అంటే 2014లో ఉన్న 34 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు 32 శాతానికి తగ్గుతున్నాయి. ఇది ఏ రకమైన వ్యవహారమో ఈరోజు రాష్ట్రంలో బీసీలు అర్థం చేసుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి రూ.20,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తామని చెప్పారు. రెండు బడ్జెట్లు పూర్తయ్యినా, నయాపైసా కూడా విడుదల కాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ దీనిపై సమాధానం చెప్పాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పరిపాలనలో దశాబ్దకాలంగా బీసీలకు మోసం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అదే మోసం కొనసాగుతోంది.
రూ.20,000 కోట్లు ఇవ్వడానికి ఏ షెడ్యూల్ అడ్డంగా ఉంది? ఏ ఆర్టికల్ అడ్డవుతోంది? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 42 శాతం రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతూ చెప్తున్నారు. “తెలంగాణ రాష్ట్రం వెళ్లి చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది” అని. అయితే నిజంగా రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు, ఎవరికి ఇచ్చారో చెప్పగలరా?
రాష్ట్రంలో ఏం జరిగిందో చూసి, దేశమంతటా ‘తెలంగాణ మోడల్’ అంటూ రాహుల్ గాంధీ చెబుతుండడం ప్రజలను మోసం చేయడమే. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం, డ్రామాలను రాష్ట్రంలోని బీసీలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. మాటిమాటికీ బీజేపీపై మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
50 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ప్రధాని చేయాలన్న ఆలోచన చేసిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అయినా బీసీని ముఖ్యమంత్రిగా చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. నాలుగు ముఖ్యమంత్రులను మార్చినప్పుడు, ఒక్కసారి అయినా బీసీకి అవకాశం ఇయ్యలేదు.
ఇప్పుడు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టాలని చూస్తున్నారు. మేము పదే పదే హెచ్చరిస్తున్నాం.. బీసీల హక్కులను ముస్లింలకు దోచిపెడతామంటే, బీసీలు చూస్తూ ఊరుకోరు.
దేశమంతా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటున్నారని ఇప్పుడు మరో కొత్త మాట మాట్లాడుతున్నారు. అదే లక్ష్యంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారా?
అందుకే కాంగ్రెస్ కు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వంటి నాయకుల మద్దతు లభిస్తున్నదా? వారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా మేము ఆ విషయాన్ని గుర్తించి, అనుమానాస్పదంగా ఉందని చెప్పాం.
ఎట్టి పరిస్థితుల్లోనైనా బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు, గమనించవలసిన విషయం ఏమిటంటే.. 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, దేశ కేబినెట్లో 20 శాతం బీసీ మంత్రులు కూడా లేదు.
ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో గతంలోనూ.. ఇప్పుడు కూడా 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు.దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ లేదా మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. వాటిలో 10 రాష్ట్రాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
ఈ విధంగా, ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరేలా చేసే ప్రయత్నంలో నరేంద్ర మోదీ నాయకత్వం అద్భుతంగా ముందుకు సాగుతోంది. మోదీ గా నాయకత్వాన్ని విమర్శించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు.
ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ ధర్నా 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసమని కాకుండా, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టాలన్న ఆత్రుతతోనే జరుగుతున్నది. బీసీలకు హక్కుగా ఉన్న రిజర్వేషన్లను దోచేయాలన్న కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది.
గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ముస్లింలు బీసీలకు చెందిన సీట్లలో పోటీ చేసి గెలిచిన పరిస్థితి మనకు సాక్ష్యంగా ఉన్నది. హైదరాబాద్లో జరిగినట్లుగానే రాష్ట్రమంతా కూడా ముస్లింలకు బీసీల హక్కులను దూరం చేయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది.
అందుకే ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో బీసీలు పాల్గొనలేదు. అక్కడి వాస్తవాలు బీసీలకు పూర్తిగా తెలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేస్తుందో వారు స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
కాబట్టి, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రపూరిత ఆలోచనల నుంచి బయటపడాలి. ముస్లింలకు లేని రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. లేదంటే బీసీల తరపున మరింత బలంగా ఒత్తిడి తీసుకొస్తాం. కాబట్టి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ విషయాలపై ప్రభుత్వం మీద తప్పకుండా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాం.