– మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారు?
– తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిందా? మీ బంధం తెగిపోయిందా?
– బీఆరెస్ వాళ్ళు మోదీ చెప్పులు మోసి బతుకుతున్నారా?
– కేసీఆర్ చేసిన చట్టం ఇప్పుడు గుదిబండగా మారింది
– డ్రామారావు.. డ్రామా నీ ఇంట్లో ఉంది.. నీ ఒంట్లో ఉంది.. నీ రక్తంలో ఉంది.. నీ పేరులో ఉంది
– మీ మొత్తం కుటుంబమే డ్రామాలు వేసి బతికే కుటుంబం
– అటు ఇటు కానివాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నరు
– ఢిల్లీలో “కాంగ్రెస్ పోరుబాట”కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ: విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించాం. 2018 లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనవర్గాల మీద కక్షగట్టి, రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఉండేలా తెలంగాణ రాష్ట్రంలో చట్టం తెచ్చారు.
ఈనాడు మనం 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే, ఆనాడు కేసీఆర్ చేసిన చట్టం ఇప్పుడు గుదిబండగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ, మా మంత్రివర్గం ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ కు పంపించాం.రెండు బిల్లులను, ఆర్డినెన్స్ ను గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు.రెండు బిల్లులు పంపించి నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి ఆమోదముద్ర పడలేదు.
మోదీ, బీజేపీ ఈ బిల్లులను అడ్డుకుని బలహీనవర్గాలకు అన్యాయం చేస్తుంటే…గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం. మోదీ మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికే ఈ ధర్నా. హైదరాబాద్ లో ధర్నా చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రం లోని రాజకీయ నాయకుల మద్దతు ఉంటుంది.
జంతర్ మంతర్ వేదికగా నిర్వహిస్తున్న ఈ ధర్నాకు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి చెందిన నాయకులంతా మద్దతుగా నిలిచారు. వంద మంది పైగా పార్లమెంటు సభ్యులు, వేలాదిగా తరలివచ్చిన మిమ్మల్ని చూశాక సంపూర్ణ విశ్వాసం కలిగింది. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన నిర్వహించాం.
వందేళ్లలో 300కు పైగా ముఖ్యమంత్రులు చేయలేనిది, మీ అందరి సహకారంతో తెలంగాణలో చేయగలిగాం. ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఈ అవకాశం దక్కింది. ఇది చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కులగణతో పాటు బీసీలకు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని చేసి ఢిల్లీకి సవాలు విసిరాం. మన పోటీ, సవాల్ రిజర్వేషన్లకు అడ్డుపడ్డ కేసీఆరో, బండి సంజయో, కిషన్ రెడ్డినో , రాంచందర్ రావుతోనో కాదు. మన సవాల్ ఢిల్లీ మీద… నరేంద్ర మోదీ మీద.. భారత ప్రభుత్వంపై.
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్
మోదీగారు… ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాల్ విసురుతున్న.మా డిమాండ్ ను ఆమోదిస్తారా?లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసి, 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించుకుంటాం.
అయ్యా నరేంద్ర మోదీ గారు.. మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేం అడగలేదు. మీ పోరుబందర్ పోర్టు నుంచి చుక్క నీరు అడగలేదు.మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డపై మా బలహీన వర్గాల సోదరులకు, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామని అడిగితే మీ గుజరాత్ కు వచ్చిన కడుపుమంట ఏంటి? మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిందా.. మీ బంధం తెగిపోయిందా?
తెలంగాణ మోడల్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళఖాతంలో కలవబోతోంది.మోదీ కుర్చీ దిగబోతున్నారు. అటల్ బిహారీ వాజ్ పయి, ఆరెస్సెస్ చేయలేని పనిని, 2029 ఎన్నికల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ చేసి చూపిస్తారు.
ఎన్నికల యుద్ధంలో మోదీ ఓడించి గద్దె దింపుతాం. జంతర్ మంతర్ సాక్షిగా ఇదే మా శపథం. మోదీ పేరుతోనే ఎన్నికలకు రండి. బీజేపీకి 150 కంటే ఒక్క సీటు ఎక్కువ రానివ్వం.
పేరు బంధం తెంచుకున్న బీఆరెస్, పేగు బంధం కూడా తెంచుకుందా? మీరెందుకు మోదీతో అంటకాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదని బీఆరెస్ ని అడుగుతున్నా. బీజేపీ వాళ్లు మోదీ మోచేతి నీళ్లు తాగుతుండొచ్చ. కానీ బీఆరెస్ వాళ్ళు మోదీ చెప్పులు మోసి బతుకుతున్నారా?
ఎన్నికల కమిషన్ కలవడానికి ఢిల్లీ వచ్చానని ఓ సన్నాసి నిన్న మాట్లాడిండు. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ లో డ్రామా చేస్తుండని నన్ను విమర్శిస్తున్నాడు. ఆయన పేరు డ్రామారావు.. డ్రామా నీ ఇంట్లో ఉంది.. నీ ఒంట్లో ఉంది.. నీ రక్తంలో ఉంది.. నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలు వేసి బతికే కుటుంబం.
మాకు డ్రామాలు అవసరం లేదు.. మాకు చిత్తశుద్ధి ఉంది. అందుకే కులగణన నిర్వహించాం. వందేళ్ల సమస్యకు ఒక్క ఏడాదిలోనే పరిష్కారం చూపించాం.నువ్వా మా చిత్తశుద్ధిని శంకించేది? మీ ఇంట్లోనే ఒకరు బీసీకి అనుకూలమంటే ఒకరు వ్యతిరేకమంటున్నారు.అటు ఇటు కానివాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నరు