– ఈ ధర్నా ఆషామాషీ వ్యవహారం కాదు
– ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల రిజర్వేషన్ పై ధర్నా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఢిల్లీ: రేపు బీసీల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శంగా ఉంది, దేశానికి దశ, దిశను నిర్దేశిస్తుంది, రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తున్నామని, మా గొంతు కలుపుతామని కాంగ్రెస్ ఎంపీలతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ధర్నా వద్దకు వచ్చి మద్దతు తెలిపారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చట్టబద్ధమైన పనులు పూర్తి చేసాం, పార్లమెంట్లో చర్చ కోసం మన ఎంపీలు అడ్జెండ్మెంట్ మోషన్ ఇచ్చి మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తన పనిని పూర్తి చేసింది కేంద్రమే ఆమోదముద్ర వేయాలి అన్నారు. దశాబ్దాల ఓబీసీలకల నెరవేరాలి, అసెంబ్లీలో మద్దతు తెలిపిన బిజెపి పార్లమెంట్ లోను మద్దతు తెలియజేస్తుందని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
బీసీల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్, బిజెపి పార్టీలకు సంబంధించింది కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదనీ డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. తెలంగాణ రైజింగ్.. రైజింగ్ అన్నారు.
బిల్లు పంపిన తర్వాత ఆర్డినెన్స్ ఏంటని అవగాహన లేని కొందరు నేతలు మాట్లాడుతున్నారు కానీ స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ మించకుండా బిఆర్ఎస్ నేతలు పెట్టిన పరిమితిని తొలగించేందుకే, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆర్డినెన్స్ తెచ్చిందనీ డిప్యూటీ సీఎం వివరించారు.
కేంద్ర నుంచి బిల్లు తెచ్చుకుంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 50% మించకూడదన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన నిబంధన అడ్డం వస్తుంది కాబట్టి ఆర్డినెన్స్ తెచ్చాం అన్నారు. జంతర్ మంతర్ ధర్నా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం, విద్య ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ త్వరితగతిన సాధించేందుకు, రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లును ఆమోదింప చేసుకునేందుకు చేపట్టిన ఈ ధర్నా ఆషామాషీ వ్యవహారం కాదు అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్తు క్యాబినెట్ ఆమోదించి బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ కు పంపాం అన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడం మా బాధ్యత అని తెలిపారు.
సర్వే చేపట్టినప్పుడు ఇది సాధ్యమా అని పలువురు నేతలు అవహేళనగా మాట్లాడారు, చేసి చూపిస్తామని మా నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పి చేసి చూపించారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది, సర్వేలో ఏ చిన్న పొరపాటు జరగకుండా సైంటిఫిక్ గా సర్వే చేయాలని, నా ఆధ్వర్యంలో ఉన్న ప్రణాళికా శాఖకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ అప్పగించింది.
1.05 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుని ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేని రీతిలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం అన్నారు. సర్వే కార్యక్రమం చేపట్టేందుకు తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ కు ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు.
సర్వే ముగిసింది మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ముందు సర్వే వివరాలు పెట్టగా గొప్పగా జరిగింది అని క్యాబినెట్ కు పంపారు, క్యాబినెట్లో ఆమోదం పొంది అసెంబ్లీలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పక్షాలతో ఆమోదింప చేసుకొని బిల్లును రాష్ట్ర గవర్నర్ కు పంపాము, గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి పంపారు, వారు ఆ బిల్లును ఆమోదించాల్సి ఉన్నది అని డిప్యూటీ సీఎం వివరించారు.