– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
ఒంగోలు: ఎన్నికల సంఘంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తి నిరాధారం గా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాధవ్ మాట్లాడారు. రాహుల్ వ్యాఖ్యలు పరిపక్వత లేని విధంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలపై కర్నాటక ఎన్నికల సంఘం స్పందించి ఆధారాలు ఉంటే సమర్పించమని లేదంటే ఎన్నికల సంఘంపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించిందన్నారు. అయినా… రాహుల్ స్పందించడం లేదని ఇదే ఆయన పరిపక్వత లేదని చెప్పడానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.
ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే ఆ హోదాకి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మాధవ్ వ్యాఖ్యానించారు. కర్నాటకలో మహాదేవపురలో బీజేపీ ఎలా గెలిచిందని వ్యాఖ్యానించడాన్ని మాధవ్ తప్పు పట్టారు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. పొగాకు రైతు నుండి ఆక్వా రైతు వరకు ఎదుర్కొంటున్న సమస్యల్ని మాధవ్ ప్రస్తావించారు. వారి సమస్యలు ఎన్డీయే సర్కారు పరిష్కరిస్తుందన్నారు.