– రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య
మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే రాష్ట్ర చేనేత రంగానికి నూతన దిశ చూపేందుకు నిరంతరం కృషి చేస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానంతరంగా అత్యధిక ప్రజలు ఆధారపడిన రంగంగా చేనేత నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రోత్సాహం కరవ్వడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా లభించలేదు. దీంతో 2019-24 కాలంలో రాష్ట్ర చేనేత రంగంలో చీకటి కాలంగా మిగిలిపోయింది. 2024 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కష్టాలు పరిష్కరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో చేనేత కుటుంబాల సమస్యలను ప్రత్యక్షంగా చూశారని, అందుకే వారికి నిత్య ఆదరణగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.