(నవీన్)
ఒకరు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత. మరొకరు అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు. ఒకరు నరేంద్ర మోదీ. ఇంకొకరు డొనాల్డ్ ట్రంప్. వారిద్దరి మధ్య వేల మైళ్ళ దూరం ఉండవచ్చు. వారి రాజకీయ నేపథ్యాలు వేరు కావచ్చు. కానీ వారిద్దరినీ ఒకే గాటన కట్టే అంశాలు చాలా ఉన్నాయి. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలన శైలి ఒకే అచ్చులో పోతపోసినట్టు అనిపిస్తుంది.
మోదీ, ట్రంప్ ఇద్దరూ రాజకీయాల్లోకి ఓ కొత్త శక్తిలా దూసుకొచ్చారు. అప్పటికే ఉన్న రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాకచక్యంగా వాడుకున్నారు. తాము ఆ వ్యవస్థకు చెందిన వారం కాదని, ప్రజల పక్షాన పోరాడటానికి వచ్చిన బయటి వాళ్ళమని చాటుకున్నారు.
వాషింగ్టన్లోని అవినీతి రాజకీయాలపై ట్రంప్ యుద్ధం ప్రకటించారు. ఢిల్లీలోని “ల్యూటెన్స్ మీడియా, మేధావుల వర్గాన్ని” మోదీ లక్ష్యం చేసుకున్నారు. (దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చే బ్రిటిష్ సామ్రాజ్య ప్రాజెక్టుని ఆర్కిటెక్ట్ ఎడ్విన్ “ల్యూటెన్స్” రూపొందించారు. ఇది పాశ్చాత్య భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబించే విశాలమైన, చెట్లతో కప్పబడిన అవెన్యూలు, గొప్ప ప్రభుత్వ భవనాలు పెద్ద బంగ్లాలతో ఉంటుంది.
ఈ ప్రాంతం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ప్రముఖ నివాసితులకు ప్రసిద్ధి చెందింది. ప్రజలతో సంబందంలేకుండా అన్ని రంగాలను ప్రభావితం చేయగల వారిని ఢిల్లీ ల్యూటెన్స్ అంటారు.) ప్రజల భాషలో మాట్లాడుతూ, వారి భావోద్వేగాలను స్పృశిస్తూ సామాన్యులకు చేరువయ్యారు.
వారిద్దరి ప్రచారాల్లో జాతీయవాదం ప్రధాన అస్త్రంగా మారింది. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అంటూ ట్రంప్ అమెరికన్ల దేశభక్తిని తట్టిలేపారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటూనే మోదీ ఒక “నవ భారత” నిర్మాణం గురించి మాట్లాడారు.
తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడటానికే తాము ఉన్నామని ప్రజలను నమ్మించారు. ఈ జాతీయవాద నినాదాలు వారి మద్దతుదారులను ఏకం చేశాయి. వారిని గుడ్డిగా ఆరాధించే భక్త గణాన్ని తయారుచేశాయి.
ప్రధాన స్రవంతి మీడియాపై దాడి చేయడం వారిద్దరి రాజకీయ వ్యూహంలో మరో కీలక భాగం. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను, చానెళ్లను ట్రంప్ “ఫేక్ న్యూస్” అని కొట్టిపారేశారు. మోదీ మద్దతుదారులు అలాంటి మీడియాను “ప్రెస్టిట్యూట్స్” అని, (డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ వృత్తిపరమైన నిజాయితీని, నైతికతను అమ్ముకుని, వార్తలు రాసే పత్రికలను, మీడియా సంస్థలను, లేదా జర్నలిస్టులను కించపరిచేందుకు వాడే ఒక అవమానకరమైన పదం ఇది.) “దేశద్రోహులు” అని ముద్ర వేశారు.
మీడియాను బలహీనపరిచి, తమ సందేశాన్ని నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇద్దరూ సఫలమయ్యారు. దీనివల్ల తమ చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మించుకున్నారు. విమర్శలు ఆ కోట గోడలను తాకలేకపోయాయి.
వారి పాలనలో వ్యక్తి ఆరాధన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలైనా, దేశ విజయాలైనా అన్నీ తమ ఘనతగానే ప్రచారం చేసుకున్నారు. తామే దేశానికి రక్షకులమని, తమ వల్లే దేశం సురక్షితంగా ఉందని చాటుకున్నారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా జరిగాయి. మంత్రులు, అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు. నాయకుడే సర్వస్వం అనే భావన బలపడింది.
ఆర్థిక రంగంలోనూ వారి విధానాల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దేశీయ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచితే, మోదీ “మేక్ ఇన్ ఇండియా” అంటూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించారు. వారి విధానాలు కొన్నిసార్లు ఆర్థికవేత్తల విమర్శలకు గురైనా, తమ మద్దతుదారుల నుంచి మాత్రం బలమైన సమర్థన లభించింది.
ఈ ఇద్దరు నేతల ప్రస్థానం ఆధునిక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటూ, దాని స్ఫూర్తిని దెబ్బతీసే నాయకత్వ శైలి ఇది. ప్రజల ఆకాంక్షలను, వారి భయాలను చాకచక్యంగా వాడుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకుని, దాన్ని నిలబెట్టుకునే సరికొత్త రాజకీయం ఇది. అందుకే మోదీ, ట్రంప్ వేర్వేరు దేశాల నేతలైనా, వారి రాజకీయ పంథా మాత్రం ఒకే దారిలో సాగుతున్నట్టు కనిపిస్తుంది.
( రచయిత సీనియర్ జర్నలిస్టు)