“”ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు”” గా ఉంది కర్ణాటక లోని ధర్మస్థల మంజునాథ స్వామి దర్శనం . భక్తులు అదృశ్యమై అస్థిపంజరాలుగా మారడం అంతుచిక్కని మిస్టరీ. ఇటీవలనే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. సినిమా ఫక్కీలో జరుగుతున్న దేవాలయ ట్రస్టీ బోర్డు దారుణాల గుట్టు రట్టు చేసి మంత్రులైనా ఎంత పెద్ద హోదాలో ఉండిన వారైనా వారు చేసిన నేరాలకు తగిన కఠినశిక్ష పడాల్సిందే.
ఇది ఒక మతానికే సంబందించినదిగా భావించకుండా మానవత్వానికి సంబంధించిన అంశం గా పరిగణించాలి. ఈ సంఘటన ప్రభుత్వానికి విసిరిన పెద్ద సవాల్. అసహజ మరణాల గురించి ఆరా తీస్తుంటే అన్ని శక్తులు కల్సి పని చేసి ఉండవచ్చు అన్న సందేహం బలం గా ఉంది.పుణ్యస్థలానికి వచ్చిన వందల మంది పురుషులు మహిళలు కనపడకుండా పోయి ధర్మ స్థల పరిసర ప్రాంతాలలో శవాలుగా మారడం మానవాళి మనుగడ కే ముప్పు.
ఇదంతా చూస్తుంటే డ్రగ్స్ మత్తుకన్న మతం మత్తు తో మనిషన్న వాడు మాయమై పోతున్నాడు అన్నది నగ్న సత్యం. ఇది హిందూ సంస్కృతి సంప్రదాయం పై చేసిన విమర్శ గా భావించరాదు.మనిషి మనిషి లా బతుకాలి అన్నదే మనిషన్న వాడు కోరుకున్నది.భక్తి తొక్కిసలాటలో మానవత్వం నలిగి పోతుంది. ఆగ్నికి ఆజ్యం పోసినట్లు కాషాయ వస్త్రధారులు కట్టు కథల ప్రవచనాలతో ప్రజలను మోసగించి వ్యాపారాలు చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మం పేరిట అశాస్త్రీయ పద్ధతులతో జనాలను తప్పుడు దారి పట్టిస్తున్నారు.
దానికి మన పాలకులు వంత పాడుతున్నారు. ఇదీ ఒక ప్రజాస్వామ్య పరిపాలనేనా ? అన్పిస్తుంది ప్రార్థనా మందిరాలు దుఃఖానికి నిలయాలుగా మారినవి .ఇది ప్రతి రోజు సోషల్ మీడియాలో చక్కర్లు గొట్టే దృశ్యాలే మరి ! పురాణాల లాగ కట్టు కథలు అనుకునేరు సుమీ ! ధర్మస్థలి లో చాలా కాలం నుండి లెక్కలేనన్ని మృతదేహాలను పూడ్చి పెట్టినట్లు ఓ పారిశుధ్య కార్మికుడు దక్షణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ కు జూలై రెండవారములో రాసిన ఓ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
“”తనచేత ఆ పనులు చేయించిన కొందరు వ్యక్తులు తమ కుటుంబమునకు చెందిన యువతి పైనే అఘాయిత్యానికి పాల్పడడం తో బెదిరి పోయి ఆ ప్రాంతం వదిలి పారి పోయినట్టు ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పినట్లు వార్తలు వినబడుతున్నాయి. తనకు రక్షణ కల్పిస్తే అన్ని నిజాలు బయట పెడతా అంటూ అతడు తన లేఖలో స్పష్టముగా రాయడం తో ప్రభుత్వం వెంటనే స్పందించి, జూలై 19 న నలుగురు సీనియర్ ఐ. పి ఎస్ లతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఆ కార్మికుడు ఇచ్చిన కొన్ని ఆధారాలతో 13 పాయింట్ లను గుర్తించి తవ్వడం తో బుధవారం 30 జూలై ఒక పాయింట్ వద్ద తవ్వుతుండగా ఒక ఆస్తి పంజరం అవశేషాలు పాక్షికంగా బయటపడినట్లు సమాచారం. మరో చోట మహిళ అవశేషాలు కనిపించాయని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇంతకు ఆ అపరిచిత వ్యక్తి ఎవరు ? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉన్నాయి ? తెర వెనుక ఉండి మనుషులను మింగు తున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరు ? ఆ మానవ మృగాలను రచ్చకీడువాలి . రాజ్యసభ సభ్యుడైన డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయ ధర్మాధికారిగా ఉంటున్నారని వార్తలు వచ్చినాయి .రాజ్య సభ సభ్యుడై ఉండి కూడా ఎందుకు ఈ ఘోరాలకు కళ్ళెం వేయడం లేదు?
గత పదేళ్లలో ధర్మస్థలము చుట్టు పక్కల 450 మందికి పైగా అదృశ్యమైనట్లు పోలీస్ లెక్కలు చెబుతున్నాయి. అక్కడి స్థానికులు కూడా దీన్ని బలపరిచారు. నేత్రావతి ఇసుక పాయల్లో కలిసిపోయిన శరీరాలు ఎన్నెన్నో.మంజునాథ ఆలయానికి సంబంధించిన వ్యక్తులే ఈ అదృశ్య మరణాల వెనుక ఉన్నారని, అందుకే తాను అక్కడినుండి పారిపోయానని పారిశుధ్య కార్మికుడు చెప్పడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలుసు కోవాలనే ఆరాటం భక్తులలో స్థానికులలో మెండుగా ఉంది.
ఈ అపరిచిత వ్యక్తుల బండారం బయట పడితే గ్రామం నుండి డిల్లీ దాకా ట్రస్టీ బోర్డు మరియు వారికి అండగా నిలిచిన ప్రజా ప్రతినిధుల పునాదులు కదలనున్నాయి.పాతికేళ్లు గా ఎవరు తొక్కిపెడుతున్నారు ? ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు ? అన్న విషయం తెలియాలి. అసహజ మరణాలకు సంబంధించిన ఆరోపణలు 2015 లో వస్తే, రాష్ట్ర ప్రభుత్వం “ఉగ్రప్ప” కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ నివేదిక ప్రకారం 300 మంది పురుషులు మహిళలు మరికొందరు బాలలు అసహజ మరణాలకు గురి అయినారని కమిటీ తెలియచేసిన ప్పటికి చర్యలు మృగ్యం దీని వెనుకాల పెద్దల హస్తం ఉందని తెలుస్తుంది. మరో విషయం ఏమంటే ఈ అసహజ మరణాల లో డాక్టర్లు జర్నలిస్టులు, కూడా ఉండడం.
సిట్ దర్యాప్తు బృందం కూడా నీరు గారి పోయే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.ఈ దారుణాల మిస్టరీ తేలక పోతే ధర్మ స్థల చరిత్ర ఆధర్మస్థలంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని భక్తులు వాపోతున్నారు.
మిస్టరీ వెనుక అదృశ్య హస్తాన్ని త్వరగా వెలికి తీయాలి. మానవత్వం మంటగల పే సంఘటన పై. సి పి ఐ జాతీయ కార్యదర్శి
కె నారాయణ తీవ్రంగా ఖండించారు. మానవవాదులు హేతువాదులు, ముక్తకంఠము తో గొంతెత్తి ఆ దేవాలయమును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు
15 సంవత్సరాల కాలములో జరిగిన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులు కావాలని సమాచార హక్కు కార్యకర్త జయంత్ RTI ద్వారా కోరగా పత్రాలు ,పోస్టుమార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు , నోటీసులు గుర్తు తెలియని గుర్తింపు కోసం తీసిన ఫోటోలు, సాధారణ పరిపాలన ఆదేశాలమేరకు ధ్వంసం చేశామని ,బెల్తంగాడి ,పోలీసులు సమాధానం చెప్పడం కలకలం రేపుతుంది ఈ విషయం జయంత్ సోషల్ మీడియాకు వెల్లడించారు.సమాచారం డిజిటల్ చేయకుండా ధ్వంసం చేయడములో అంతరార్థం మేమిటని ప్రశ్న ? ప్రశ్నగానే ఉండి పోతుందా ?
. ప్రధాని మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా పలు మార్లు తొలి స్థానం లో నిలిచారు. ఇది సంతోషించ దగిన విషయమే కానీ “ఇంట గెలిచి రచ్చ గెలవాలి “.
ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు
ఉచిత పథకాలు ఎందుకు ? కార్పొరేట్ దిగ్గజాలకు రుణమాఫీ ఎందుకు ? నల్లదనం ఎందుకు అరికట్ట లేకపోయింది? GST విధానం చిన్న వ్యాపారులకు భారం ఎందుకు పడింది ? మేక్ ఇన్ ఇండియా ఎక్కడ ? ఆదాయమునకు మించి ఖర్చులెందుకు ?
గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు ఎందుకు లేవు ? విద్య లో నాణ్యత ఎందుకు లేదు ? బి జె పి పాలన రాష్ట్రాలలో హిందూమత సంబంధిత అంశాలను పాఠ్యాంశంగా ఎందుకు చేర్చాలి ? డిఫెన్సీ పాలసీ లో అవినీతి ఎందుకు ? విదేశీ విధానం తో కొన్ని శత్రుదేశాలుగా ఎందుకు మారాయి.? న్యాయ వ్యవస్థ లో అవినీతి ఎందుకు ?
బీజేపీయేతర పార్టీలు సలహాలు చెప్పిన విమర్శలు చేసిన ప్రధానమంత్రి మోదీ కి “”చెవిటి వాని ముందు శంఖమూదినట్లు”” గానే ఉంది. అధికార మత పెత్తనం తప్ప, ప్రజా క్షేమానికి తిలోదకాలిచ్చారు .ధర్మస్థలిలో అసహజ మరణాల పై సోషల్ మీడియా కోడై కూస్తున్నా, గ్లోబల్ లీడర్ గా ఎదిగిన మన ప్రధాన మంత్రి మోడీ అదృశ్య శక్తులను పట్టుకోలేక పోతున్నారా ?
లేక బి ,జె పి ,పరువు పోతుందని రహస్యముగా ఉంచుతున్నారా ? అన్నది కోటి డాలర్ల ప్రశ్న! హోమ్ మంత్రి. అమిత్ షా ధర్మస్థల అసహజ మరణాలపై మౌనముగా ఎందుకు ఉన్నారు ? ఇది అందరూ ప్రశ్నించాల్సిందే . ఇది మనిషికి సంబంధించిన అంశం
బి జె పి పాలన కడిగిన ముత్యం లా బయట పడాలంటే.. అసహజ మరణాల వెనుక దాగి ఉన్న అదృశ్య శక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. మనిషన్న వాడికి న్యాయం జరుగాలి. మతాలకతీతంగా అన్ని కోణాలలో దేశం అభివృద్ధి చెంది ప్రజాస్వామ్యం వికసించాలి. లేనిచో ఏదో ఒక రోజు ప్రజల తిరుగుబాటు ఉప్పెనలా రాక తప్పదు.
పూసాల సత్యనారాయణ
(సామాజిక విశ్లేషకుడు)
9000792400