– అభివృద్ధి జరుగుతుందనే ఆశతోనే మనల్ని ప్రజలు గెలిపిస్తున్నారు
– అన్ని ప్రభుత్వమే చేయాలంటే అవ్వదు
– వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు కడుపు తరుక్కుపోతుంది
– 43 క్లస్టర్ పాఠశాలల అభివృద్ధికి, 17 రెసిడెన్షియల్ వసతి గృహాల అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కమిటీలు
– నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు: కింది స్థాయి నుండి పై స్థాయి వరకు రాజకీయాలలో ఉండే ప్రతి నాయకుడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ వసతిగృహాల సమస్యలపై పలుమార్లు ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఎన్నో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అధికారులు.
వెంటనే తన వ్యక్తిగత ఇంజనీరింగ్ విభాగాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 17 రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గత వారం రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యల నివేదికను ఎమ్మెల్యే కి సమర్పించారు వ్యక్తిగత ఇంజనీర్లు.
నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదని నాయకులందరూ అభివృద్ధిలో భాగస్వామం కావాలని, అభివృద్ధి కోసం ఎలా నిధులు సమీకరించాలనే దానిపై చర్చించారు. నా మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో నిధులు కేటాయిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నానని.. మర్రిగూడ లోని కస్తూరిబా బాలిక పాఠశాలలో మదనపు తరగతి గదులు కాంపౌండ్ వాల్, అదనపు బాత్రూంలు టాయిలెట్స్, నూతన డ్రైనేజీ సిస్టం లాంటి మౌలిక వసతులను కల్పిస్తున్నానని… సంపాదన ఎక్కువగా ఉన్న నాయకులు కూడా తమ వంతుగా నిధులు ఇచ్చి అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.
వివిధ దేశాలకు వెళ్లి అభివృద్ధి అయిన ఈ ప్రాంతానికి చెందిన ఎన్నారైల ద్వారా కూడా నిధులు సమీకరించాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిపై నాయకుల అభిప్రాయాలు ఆలోచనలు సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మన గ్రామం మన మండలం మన నియోజకవర్గం, మనమందరం అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది సమావేశంలోని పలువురు ముఖ్య నాయకులు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
పాత రోజులు వేరు నేటి సమాజం వేరని, మనం చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి చేసిన వారికే రాజకీయాలలో కొనసాగే పరిస్థితి ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ తో నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకోవాల్సిందిగా కోరారు.