– బీజేపీ, కాంగ్రెస్ లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి
– రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టుకు శిరస్సు వంచి సలాం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు
హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీలు కోదంరాం, అమీర్ అలీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు అన్నారు. ఈ రెండు ఢిల్లీ పార్టీలు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ఆయన మండిపడ్డారు.
బడుగు, బలహీనవర్గాలైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ చేసిన సిఫారసును పట్టించుకోకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ చులకనచేశారని కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు.
తమ ప్రభుత్వ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి తన బీసీ వ్యతిరేక వైఖరిని రేవంత్ రెడ్డి చాటుకున్నాడని మండిపడ్డారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ల చర్యలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు కేటీఆర్. దీంతో పాటే బీజేపీ, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైందన్నారు.
బీఆర్ఎస్ నామినేట్ చేసిన బలహీనవర్గాల అభ్యర్థులకు అడ్డుతగిలి, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిన బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కిన ఈ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని సుప్రీంకోర్టు తన తీర్పుతో చాటిచెప్పిందని ఆయన కొనియాడారు.
రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడిన బీఆర్ఎస్ పక్షాన గౌరవ న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.