– రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్-బీజేపీ
– పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ కు కనిపించడం లేదా?
– కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా?
హైదరాబాద్: జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ కు కనిపించడం లేదా? కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్-బీజేపీ నేతలకు “పోలవరంను.. కూలవరం” అనే దమ్ము ధైర్యం ఉందా?
తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా ? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏ ను దించి, బీఆర్ఎస్ పై బురజల్లిన బీజేపీ నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారు ?
ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ ను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్ కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే.
2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకూ లేదు. మరోసారి ఏపీలో పోలవరం కాఫర్ డ్యామ్ గోదావరిపాలైనా, ఇటు తెలంగాణలో ఎస్.ఎల్.బీ.సీ. టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్.డి.ఎస్.ఏ అడ్రస్ లేదు.
పంజాబ్ నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి , దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన కేసీఆర్ పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం.