– కంట్రోల్డ్ ఎక్స్ ప్లోజివ్ సిద్దాంతం ఆధారంగానే మేడిగడ్డ బ్యారేజీని కూల్చే ప్రయత్నం
– ఈఫిల్ టవర్ కంటే 7 రెట్ల ఐరన్, బుర్జ్ ఖలీఫా కంటే 7 రెట్ల సిమెంట్ వాడి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం
– రేవంత్ ,బండి సంజయ్,కిషన్ రెడ్డి కాల్ డేటా బయటకు తీయాలి
– కాంగ్రెస్,బిజెపి కలిసి కుట్ర పన్నాయి
– రేవంత్ రెడ్డి ఆంధ్ర ఏజెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టే కాళేశ్వరం రిపేర్ చేయించడం లేదు
– గత రెండేళ్లుగా కేసు అలాగే పెండింగ్ లోనే
సిట్ విచారణ జరపాలని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ వద్ద అక్టోబర్ 21 2023న పెద్ద ఎత్తున బాంబులు పేలిన శబ్దాలు వచ్చాయి. ఆ శబ్దం సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి. వెంటనే స్థానిక రవికాంత్ అనే ఇంజనీర్ మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 174/2023 కింద కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు తిరిగి కేసు గురించి పట్టించుకోలేదు.
ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదులో అసాంఘిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్రలు చేసినట్లుగా అనుమానం ఉందని తెలిపారు. కానీ పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అలాగని లాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేయలేదు. గత రెండేళ్లుగా కేసు అలాగే పెండింగ్ లోనే ఉంది. పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్,బాంబ్ స్క్వాడ్,జెలెటిక్స్ ఎక్స్ ప్లోజన్ డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించాల్సింది.
పిల్లర్ సాంపుల్స్,ఇసుక సాంపుల్స్,సీస్ పిక్ రిపోర్టు తీసుకొని సంబంధిత శాఖా ల్యాబ్ కు పంపి పరీక్ష చేయాల్సింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పటికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ల కాల్ డేటా, కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఆ రోజు తిరిగిన అనుమానాస్పద వ్యక్తుల కాల్ డేటా సేకరించాల్సింది. కానీ పోలీసులు ఆ పని చేయలేదు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారికి లేఖ రాశారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేశారు. లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులో, లక్ష కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. అది ఎలా సాధ్యం?
అదే సమయంలో 2023 జూన్ నెలలో ఉత్తరాఖండ్ లోని తీస్తా నదిపై నిర్మించిన బ్యారేజీ మొత్తం వరదలకు కొట్టుకుపోయింది. అయినా బిజెపి నాయకులు ఎవరూ లేఖ రాయలేదు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు అక్కడికి వెళ్లలేదు. ఎందుకంటే అక్కడ బిజెపి అధికారంలో ఉంది.
పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం కుంగిందని వార్తలు వస్తున్నాయి. మరి కిషన్ రెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఎందుకు లేఖ రాయడం లేదు? ఎందుకంటే అక్కడ బిజెపి,టిడిపి కూటమి అధికారంలో ఉంది కాబట్టి. కేవలం తెలంగాణకు మాత్రమే ఎన్డిఎస్ఏ అకస్మాత్తుగా ఎలా వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్,బిజెపి కలిసి బిఆర్ఎస్ ప్రభుత్వంపై కావాలని అధికారం నుండి తప్పించాలనే కుట్రలో ఎన్నికల సమయంలో విష ప్రచారం చేశారు.
2022 లో రష్యా ఉక్రెయిన్ మద్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ లోని నిప్రో నదిపై నిర్మించిన ఖాకోవ డ్యాం ను, కంట్రోల్డ్ ఎక్స్ ప్లోజివ్ సిద్దాంతం ఆధారంగా పేల్చేయడంతో వంద మంది అమాయక ప్రజలు మరణించారు. అదే పద్దతిలో కంట్రోల్డ్ ఎక్స్ ప్లోజివ్ సిద్దాంతం ఆధారంగానే మేడిగడ్డ బ్యారేజీని కూల్చే ప్రయత్నం జరిగినట్టు అనుమానం ఉంది.
వాస్తవానికి మట్టి లేదా ఇసుక కుంగడం వల్ల ప్రమాదం జరిగితే పిల్లర్లకు క్రాక్స్ రాకూడదు.కానీ ఇక్కడ వచ్చాయి. మన ఇంట్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే గోడలు పగులుతాయి. కానీ భీమ్ లకు పగుల్లు ఉండవు. జెనెటిక్స్, డిటొనేటర్స్ వంటి ప్రమాదకర పేలుడు పదార్థాలు వాడితేనే ఇలాంటివి జరుగుతాయని ఇంజనీర్ మేధావులు చెబుతున్నారు. అసలు బ్యారేజీ కుంగితే పేలుడు శబ్దాలు ఎందుకు వస్తాయి.?
అందుకే ఈ అంశంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయాలి.
ఇంజనీర్ల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేయాలి. అవసరమైతే 174/2023 మహదేవ్ పూర్ కేసు విచారణను సీబీఐ వంటి స్వతంత్ర విచారణ సంస్థకు అప్పగించాలి.
పిసి ఘోష్ కమిషన్ కానీ,నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు గానీ, కేవలం కేంద్రం నుండి తీసుకున్న అనుమతులు,కేబినెట్ నిర్ణయాలు,ప్రాజెక్టు నిర్మాణం సంబంధించిన అంశాల పట్ల మాత్రమే విచారణ చేశారు తప్ప, ఎందుకు?ఎలా? ప్రమాదం జరిగిందనే కోణంలో విచారణ చేయడంలో విఫలమయ్యాయు.
పిసి ఘోష్ కమిషన్ కేవలం ప్రాజెక్టు అనుమతులు,కేబినెట్ నిర్ణయాలు, మంత్రులు తాగిన ఛాయ్, బిస్కెట్ల గురించి విచారణ చేశారు తప్ప, అసలైన విషయాన్ని పట్టించుకోలేదు.
ఇంజనీర్ల స్టేట్ మెంట్లు సేకరించి,పేలుడు శబ్దాలు,మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాల గురించి పట్టించుకోలేదు. ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై కమీషన్,ఎన్డిఎస్ఏ అధికారులు పట్టించుకోలేదు. కాబట్టి సీబీఐ విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలు,బాధ్యులు ఎవరో తేల్చాలి. రేవంత్ రెడ్డి,బండి సంజయ్,కిషన్ రెడ్డిలను విచారించి వారి కాల్ డేటా బయటకు తీయాలి.
ప్రమాద సమయంలో ఘటన జరిగిన చోట డిటొనేటర్స్,ఎక్స్ ప్లోజర్స్ వంటి పేలుడు పదార్థాలకు సంబంధించిన నిపుణులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టాలి. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం,బిఆర్ఎస్ పార్టీని అధికారం నుండి తప్పించడం కోసం అనేక కుట్రలు అబద్దాలు చెప్పింది.
నిన్నటికి నిన్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం 8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాలు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా బిఆర్ఎస్ హయాంలో కేవలం 3.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ లో పి.హెచ్డి చేశారు.
కేసిఆర్ నిర్మించిన ప్రగతిభవన్ లో బంగారు బాత్రూంలు ఉన్నాయని అబద్దాలు చెప్పారు. ఇపుడు అదే భవనంలో నివాసం ఉంటున్న డిప్యూటి ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను అడిగితే నవ్వుతున్నారు. కాళేశ్వరం విషయంలో కూడా కాంగ్రెస్ బిజెపి పార్టీలు కలిసి కుట్రలు చేసి మేడిగడ్డ బ్యారేజిని కూల్చే కుట్ర చేశాయి. 2019 లో కేసిఆర్ రాత్రింబవళ్లు శ్రమించి ఇంజనీర్లతో చర్చించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి జాతికి అంకితమిచ్చారు.
2019 నుండి 2023 వరకు అత్యంత పకడ్బందీగా పనిచేసిన బ్యారేజీ ఆకస్మాత్తుగా ఎన్నికల ముందు ఎలా కుంగింది? అంతకుముందు ఏడాది 29 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి నిలిబడ్డ డ్యాం, కేవలం 20 లక్షల క్యూసెక్కుల వరదలు ఎలా కుంగింది? పైగా వర్షాకాలం పోయిన తర్వాత అక్టోబర్ నెలలో ఎలా ఈ సంఘటన జరిగింది?
సుమారు 500 ఏళ్ల తర్వాత 2022 లో పెద్ద వరదలు వచ్చిన సందర్భంలోనే బ్యారేజీ నిలబడి,అంతకంటే చిన్న వరదలకు కుంగడం ఏంటి? అది కూడా కేవలం బ్లాక్ 7 లో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగడం ఎలా సాధ్యం? బ్యారేజీ కుంగితే కూలిపోవాలి. కానీ కాంక్రీట్ పిల్లర్ కు క్రాకులు రావడం ఏంటి?
ఈఫిల్ టవర్ కంటే 7 రెట్ల ఐరన్, బుర్జ్ ఖలీఫా కంటే 7 రెట్ల సిమెంట్ వాడి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును అసాంఘిక శక్తులను వాడి,ప్రతిపక్ష బిజెపి,కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బిఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని, బదనాం చేయాలని కుట్రలు చేశాయి. నిజంగా తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం ఉంటే, నిపుణుల సాయంతో బ్యారేజీ రిపేర్ చేయించేవారు. కానీ చేయించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఖాళీగా ఉంచారు.
ఎందుకంటే ఆయన ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో కీలు బొమ్మలా ఉన్నారు. స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డిని 20 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు నడిపిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర ఏజెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టే కాళేశ్వరం రిపేర్ చేయించడం లేదు. పిసి ఘోష్ కమీషన్ ను లోతైన విచారణ జరపనివ్వలేదు.
తెలంగాణ ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలి. కోటి ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చే,హైదరాబాద్ కు తాగు నీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్నికల్లో గెలవడం కోసం కూల్చే కుట్ర చేశారు. అందుకే ప్రభుత్వం 174/2023 మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును విచారించి, నిజానిజాలను తేల్చాలి. రేవంత్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలి.