– కొమ్మినేనికి పూర్తిస్థాయి బెయిల్‌ను వ్యతిరేకించని ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ
– సుప్రీంకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసిన కొమ్మినేని
– ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్న న్యాయవాది ముకుల్
– ఆ స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
– బెయిల్ అభ్యంతరం లేదని చెప్పే లాయరుకు అన్ని లక్షల ఫీజులెందుకో?
– దానికి మామూలు లాయర్ సరిపోతారు కదా?
– కొమ్మినేని పిటిషన్‌ను వ్యతిరేకించవద్దన్న నిర్ణయం ఎవరిది?
– ఎవరు ఎవరితో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శల వర్షం
– చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పిటిషన్లను వ్యతిరేకించిన నాటి వైసీపీ ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ
– అవుటర్, ఫైబర్‌నెట్, అసైన్డ్ కేసుల్లో బాబుకు వ్యతిరేకంగా వాదించిన ముకుల్
– జగన్ సర్కారు ఆయనకు 10 కోట్లు ఇచ్చిన జీఓ బయటపెట్టిన టీడీపీ నేతలు
– ఆయనను ఎలా న్యాయవాదిగా పెట్టుకుంటారన్న టీడీపీ లీగల్ లీడర్లు
– కొమ్మినేని బెయిల్ పిటిషన్ వ్యతిరేకించపోవడమంటే అమరావతి రైతులను అవమానించినట్లే
( మార్తి సుబ్రహ్మణ్యం)
అమరావతి మహిళలను వేశ్యలతో అభివర్ణిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు తన సాక్షి డిబేట్లో నిర్వహించిన ఒక అంశం వివాదాస్పదమయింది. ఆ మేరకు ఆయనపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ఆయనను జైలుకు పంపించటం, ఆయన నేరుగా సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడం తెలిసిందే.
అలాంటి కొమ్మినేని ఇప్పుడు స్వేచ్ఛాజీవి అయ్యారు. కాదు.. ప్రభుత్వ న్యాయవాది ఆయనను స్వేచ్ఛాజీవిని చేశారు. ఎలాగంటే.. కొమ్మినేని వారికి పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చేందుకు, తమకు అభ్యంతరం లేదని అంగీకరించడం ద్వారా! నిజం.. దీనికి సుప్రీంకోర్టు తీర్పే ఉదాహరణ.
కొద్దికాలం క్రితం కొమ్మినేని సాక్షిలో నిర్వహించిన చర్చలో పాల్గొన్న జర్నలిస్టు రామకృష్ణంరాజు, అమరావతి మహిళలను వేశ్యలన్న అర్ధం వచ్చేలా చేసిన వ్యాఖ్య పెనుదుమారం రేపింది. అమరావతి రైతులను అది ఆగ్రహానికి గురిచేసింది. దానితో రాష్ట్రవ్యాప్తంగా కొమ్మినేని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఆయనను అరెస్టు చేసి, జైల్లో వేయాలంటూ మహిళలు ధర్నాలు నిర్వహించారు. అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు.
ఫలితంగా హైదరాబాద్‌లో ఉన్న కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దానితో ఆయన నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన కథనే.
ఈ నేపథ్యంలో కొమ్మినేని తన మధ్యంతర బెయిల్‌ను పూర్తి స్థాయి బెయిల్‌గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సందర్భంగా సహజంగా ఆయన పిటిషన్‌ను, ఏపీ ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్గీ వ్యతిరేకిస్తారని భావించారు. కానీ విచిత్రంగా కొమ్మినేనికి పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ మంజూరు చేసేందుకు, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడమే ఆశ్చర్యం.
అసలు అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలపై విషం చిమ్ముతున్న సాక్షికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొమ్మినేని మధ్యంతర బెయిల్ పిటిషన్ రద్దు కోసం పోరాడాల్సింది పోయి.. దానికి బదులు అదే కొమ్మినేనికి, పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని, స్వయంగా ప్రభుత్వమే అంగీకరిండంపై అమరావతి రైతులేకాదు. టీడీపీ న్యాయవాద వర్గాలు కూడా నోరెళ్లబెడుతున్నాయి.
అమరావతి నుంచి సూచనలు రాకపోతే.. సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని, టీడీపీ న్యాయవాద వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ మేరకు ముకుల్‌కు సూచనలు ఇచ్చిన వారెవరన్నదానిపై, పార్టీ-ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
సహజంగా సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా పార్టీ అయితే, సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించే సీనియర్ కౌన్సిల్‌తో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అడ్వకేట్ జనరళ్లు ఒకరోజు ముందే చర్చిస్తారు. రేపు మీరు ఆ కేసుకు హాజరుకావాలి కాబట్టి, రేపు డేట్‌ను బ్లాక్ చేసుకోమని సూచిస్తుంటారు. దానితోపాటు ఆ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియచేసి, మీరు ఆ మేరకు వాదించమని ఏజీలు చెబుతుంటారు.
ఆ మేరకు ఏజీలు సీఎంలతో ఆ కేసు గురించి చర్చించి, ఆయన చేసిన సలహా-సూచనలను సుప్రీంకోర్టులో కేసు వాదించే ప్రభుత్వ న్యాయవాదికి చెబుతుంటారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది కూడా ఆ ప్రకారమే కేసు వాదిస్తుంటారు. ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియనే.
మరి ఆ ప్రకారంగా.. ‘సాక్షి’ కొమ్మినేని బెయిల్ విషయంలో అభ్యంతరం చెప్పవద్దని, సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది ముకుల్‌కు సూచించింది ఎవరన్న ప్రశ్న, టీడీపీ న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొమ్మినేని బెయిల్ పిటిషన్ వ్యతిరేకించకూడదన్న నిర్ణయాన్ని ముఖ్యమత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి వారి అనుమతి తీసుకుని దానిని అమలు చేశారా?
లేక ముకుల్ తన సొంత నిర్ణయం తీసుకున్నారా? అన్న అంశంపై స్పష్టత కావాల్సిందేనంటున్నారు. ఎందుకంటే ఇది అమరావతి రైతులు-మహిళల ఆత్మాభిమానానికి సంబంధించిన సున్నితమైన కేసు కాబట్టి, దానిపై సీఎం కూడా వివరణ కోరాల్సిన అవసరం ఉందని, లే కపోతే అమరావతి రైతులకు తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం లేకపోలేదని టీడీపీ న్యాయవాద వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
సహజంగా అమరావతితోపాటు, కూటమిపై నిత్యం విషం చిమ్మే సాక్షికి సంబంధించిన ఏ అంశంలోనయినా.. కూటమి ప్రభుత్వం కఠినంగానే ఉండి తీరాలి. ఆ ప్రకారంగా కొమ్మినేని రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. అసలు ఆయన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలనే పోరాడాలి. ఇవన్నీ కాకపోయినా.. కనీసం మొహమాటానికయినా కొమ్మినేని బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు వాదించాలి.
అయితే.. వీటిలో ఏ ఒక్కటీ జరగకపోగా, కొమ్మినేని బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించడం లేదని ప్రభుత్వ న్యాయవాది ముకుల్ చెప్పడమే ఆశ్చర్యం. దీనిపై అమరావతి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ అమరావతిపై విషం చిమ్మడమే కాకుండా, భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ అమరావతి మునిగిపోయిందని దుష్ర్పచారం చేస్తున్న సాక్షిలో పనిచేసే కొమ్మినేని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వ్యతిరేకించకపోవడమంటే.. అమరావతి మహిళలను ప్రభుత్వమే అవమానించినట్లు అని అమరావతి రైతులు విరుచుకుపడుతున్నారు.
ఇదిలాఉండగా.. అసలు జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసి, అమరావతి రాజధాని సహా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నాలుగు కీలక కేసులు వాదించిన ముకుల్ రోహత్గీని, కూటమి ప్రభుత్వ న్యాయవాదిగా నియమించుకోవడం- ఆయనతో డీల్ కుదిర్చిన ప్రముఖుడిపైనే పార్టీ న్యాయవాద వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం తరఫున వాదించిన అదే ముకుల్‌కు..జనవరి 17, 2020న 10 కోట్ల రూపాయలు విడుదల చేసిన జీఓ కాపీలను, నాడు విపక్షంలో ఉన్న టీడీపీ నే తలు ప్రెస్మీట్లో విడుదల చేశారు. జగన్ సొంత కేసులు వాదిస్తున్న ముకుల్‌కు, ప్రభుత్వ నిధులు ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ముకుల్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన న్యాయవాదిగా ఎలా నియమించుకుంది? ఆయన పేరు ప్రభుత్వానికి సిఫార్సు చేసి, డీల్ కుదుర్చిన ఆ ప్రముఖుడు ఎవరంటూ టీడీపీకి చెందిన సీనియర్ న్యాయవాదులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఇప్పుడు కొత్తగా ఢిల్లీ లాయర్లను బ్లాక్ చేసే కల్చర్ వచ్చింది. బ్లాక్ అంటే వారు మరొక కేసు వాదించకుండా, తామే ఎక్కువ ఫీజులు ఇచ్చి బుక్ చేసుకోవడం అన్నమాట. దానికి కొందరు మేధావులు ప్రభుత్వానికి వింత లాజిక్ వినిపిస్తున్నారు. ఫలానా సీనియర్ న్యాయవాది అటు వెళ్లకుండా వాళ్లను మనమే ముందు బ్లాక్ చేసుకుంటే, అప్పుడు ఎదుటివారికి లాయర్లు దొరకరు అన్న లాజిక్ వినిపిస్తూ ప్రభుతాలను ఒప్పిస్తున్న పరిస్థితి
సహజంగా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు పార్టీలతో అనుబంధం ఉన్నప్పటికీ, కేసుల విషయంలో వారు పార్టీ కోణాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఆ న్యాయవాదులకు కావలసింది ఫీజులు మాత్రమే. వాటిని జాతీయ పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోవు.
కానీ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల్లో మాత్రం, కార్యకర్తలు అలాంటివాటిని సహించరు. క్షేత్రస్థాయిలో ప్రత్యర్ధి పార్టీలతో పోరాడే వారి ఆలోచనలు, ఎప్పుడూ రాజకీయ కోణంలోనే ఉంటాయి. గత ప్రభుత్వానికి అనుకూలంగా వాదించి, తమ పార్టీ నాయకులకు శిక్షలు వేయించిన న్యాయవాదిని.. తన పార్టీ-ప్రభుత్వం ఎలా నియమించుకుందన్న కోణంలోనే సగటు కార్యకర్త ఆలోచిస్తాడు.
ఆ నిర్ణయాన్ని కార్యకర్త మ్యాచ్‌ఫిక్సింగ్ కోణంలోనే చూస్తాడు తప్ప.. కొందరు మేధావులు చెప్పే, సాంకేతిక అంశాల గురించి ఆలోచించడు. ఇప్పుడు ముకుల్ విషయంలో జరుగుతోంది అదే. కొమ్మినేనికి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించకూడదన్న నిర్ణయం ఏ స్థాయిలో జరిగింది? అందుకు సీఎం-లోకేష్ అనుమతి ఉందా? లేదా? లేక అది ముకుల్ సొంత నిర్ణయమా? ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
ఇవ న్నీ అటుంచితే.. కొమ్మినేని రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు అభ్యంతరం చెప్పడం లేదన్న ఢిల్లీ న్యాయవాది ముకుల్ ఫీజు సాధారణంగా 50 లక్షల వరకూ ఉంటుంది. ఆ ప్రకారంగా అన్ని ఫీజులు తీసుకున్న లాయరు గారు.. ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని బల్లగుద్ది వాదించకుండా, కొమ్మినేనికి రెగ్యులర్ బెయిల్ ఇస్తే మాకేం అభ్యంతరం చెప్పారు.
మరి ఆ పాటి దానికి ఆయనకు అన్నేసి లక్షల రూపాయల ఫీజు తగలేయడం ఎందుకు? అదేదో సుప్రీంకోర్టులోనే ప్రభుత్వం జీతాలిచ్చి పోషిస్తున్న, మామూలు లాయర్లతోనే చెప్పిస్తే ఆ డబ్బు ఆదా అయ్యేది కదా? ఈ చేతచమురు బాగోతం ఎందుకన్నది టీడీపీ లాయర్ల ధర్మసందేహం. నిజం శ్రీనివాసుడికెరుక?