– తెలంగాణ సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగమొల్ల దర్శన్ గౌడ్
హైదరాబాద్ : ఉద్యోగులకు భద్రత లేని సి.పి.ఎస్ విధానాన్ని రద్దుచేసి 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగులు వృద్ధాప్యంలో పదవీవిరమణ అనంతరం ఆత్మగౌరవంతో జీవించాలని కోరుతూ సెప్టెంబర్ 1 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సి.పి.ఎస్ ఉద్యోగుల ఆత్మ గౌరవసభ నిర్వహిస్తున్నామని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్ లో యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సి.పి.ఎస్ రద్దుచేసేవరకు రాజీలేని పోరాటం చేస్తామని,అధిక సంఖ్యలో సి.పి.ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరై సి.పి.ఎస్ ఉద్యోగుల ఆత్మ గౌరవసభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.రామకృష్ణ మాట్లాడుతూ….. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తూ ప్రభుత్వాని ప్రజలకు మధ్య వారధిగా సుమారు 30-35 సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ సి.పి.ఎస్ విధానం వల్ల పదవీవిరమణ అనంతరం వృద్ధాప్యంలో పెన్షన్,హెల్త్ కార్డులు లేక ఆర్ధిక, అనారోగ్య సమస్యలతో మానసిక ఆందోళన చెందుతున్నారని, ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఉద్యోగులకు,ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారిన సి.పి.ఎస్ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్ మాట్లాడుతూ…… పాత పెన్షన్ ప్రకటన కోసం రాష్ట్రంలోని 2 లక్షల పై చిలుకు సి.పి.ఎస్ ఉద్యోగుల కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయని, ఉద్యోగుల ఆకాంక్షను గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో పెట్టినప్పటికీ కాలయాపన చేయడంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సి.పి.ఎస్ విధానం రద్దు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అని ఉద్యోగులు బలంగా విశ్వసిస్తున్నారని, ప్రభుత్వం త్వరగా సి.పి.ఎస్ విధానాన్ని రద్దుచేసి 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రకటించి రాష్ట్రంలోని రెండు లక్షల పై చిలుకు ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లెక్కల వీరేశం,మంగ నర్సింహులు,మారం లింగారెడ్డి,లింగం శ్రీనివాస్, క్రిష్ణారావు, మున్నూరు నాగన్న,శోభన్,శిరందాసు రాందాసు,సందీప్ తాహెర్ అలీ,భూలక్ష్మి, అశోక్ తదితరులు పాల్గొన్నారు
