– బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులే లేరా?
– “మీరెంతో – మీకు అంత” అనే రాహుల్ గాంధీ నినాదం ఎక్కడికి పోయింది?
– బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని మరోసారి తేలిపోయింది
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్ : ఇవాళ ఇండీ కూటమి నేతల సమావేశం జరిగింది. అందులో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, తెలంగాణకు చెందిన రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును అభ్యర్థిగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ కూటమికైనా వారి ఇష్టానుసారం అభ్యర్థిని ప్రకటించుకోవచ్చు. దీనిపై ఎవరికి అభ్యంతరం లేదు.
అయితే, కాంగ్రెస్ పార్టీ చెప్పేది వేరు, చేసేది వేరు. ఆచరణలో చెప్పింది కనిపించడం లేదు. సమతుల్యత ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాలు, రాహుల్ గాంధీ రాజకీయాలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ రాజకీయాలు తెలంగాణ చుట్టే తిరుగుతున్నాయి.
నిత్యం కాంగ్రెస్ పార్టీ బీసీ జపమే చేస్తోంది. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఈ రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఒక్క ఓబీసీ అభ్యర్థి కూడా దొరకకపోవడం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని బయటపెట్టింది. రాహుల్ గాంధీ తానే ఓబీసీల ఉద్ధారకుడని చెప్పుకుంటున్నాడు. ఆయన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణనే రోల్ మోడల్ అంటున్నాడు. కానీ వీరి మాటలు, మాయమాటలే తప్ప ఆచరణలో ఏదీ జరగడం లేదు.
కులగణన చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కూడా నిలబెట్టలేకపోవడం, కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని చూపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, నిజానికి బీసీ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది.
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కనీసం ఒక బీసీ అభ్యర్థిని కూడా రెఫర్ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ పడింది. తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయారు. ఏఐసీసీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయిస్తామని చెప్పినా, అది అమలు కాలేదు.
చివరికి ఓడిపోతామని తెలిసినా.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీసీని నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తూ, దొంగజపం చేస్తోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని మరోసారి తేలిపోయింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిన్న రేవంత్ రెడ్డిని “రేవంత్ గౌడ్” అంటూ సంబోధించారు.
మరి 24 గంటలు కూడా దాటకముందే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని రెఫర్ చేయలేని ఆలోచన రేవంత్ రెడ్డిది. అలాంటి రేవంత్ రెడ్డి బీసీల పట్ల చూపిస్తున్న కపటప్రేమ, అతని నిజస్వరూపాన్ని బయటపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హన్మంతరావు పేరు కూడా గుర్తురాలేదా? బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులే లేరా?
“మీరెంతో – మీకు అంత” అనే రాహుల్ గాంధీ నినాదం ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క బీసీ అయినా, బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి అయినా ఆ పార్టీకి కనపడలేదు.
కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సామాజిక న్యాయం సాధించింది. మొదటి అవకాశంలో శాస్త్రవేత్త, మైనారిటీ వర్గానికి చెందిన డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ని రాష్ట్రపతిగా చేసింది. రెండోసారి అవకాశం వచ్చినప్పుడు ప్రముఖ న్యాయవాది, దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసింది. మూడో సారి అవకాశం వచ్చినప్పుడు గిరిజన మహిళ, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ముగారిని రాష్ట్రపతిగా చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్కరిని కూడా చేయలేకపోయింది.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రతిరోజూ “మోదీ , కిషన్ రెడ్డి , బండి సంజయ్ బీసీలకు వ్యతిరేకం” అంటూ, రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతూనే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2025 వరకు ముఖ్యమంత్రులలో ఎక్కువసార్లు పాలన చేసినది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత టీడీపీ, బీఆర్ఎస్… ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఈ దీర్ఘకాల పాలనలో ఒక్క దామోదరం సంజీవయ్య రెండు నెలల పాటు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం తప్పితే, ఏ ఒక్క బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాలేదు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ జపం చేస్తూ, బీజేపీని విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు తప్పితే, బీసీలకు ఒరగబెట్టినది మాత్రం శూన్యం.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం, రిజర్వేషన్లపై రెండు నాలుకల ధోరణి మానుకోవాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఫక్తు బీసీలను మోసం చేసే రాజకీయాలు చేయాలనే ఆలోచనను వదలాలని మా హితవు. భారతీయ జనతా పార్టీ మాత్రం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్‌కు చెందిన అభ్యర్థిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ని ప్రకటించింది.
అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం – చిట్టచివరి వ్యక్తి వరకు అధికార ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యం. సమాజాన్ని ఐక్యతతో ఉంచి, అట్టడుగు వ్యక్తులకు అధికార ఫలాలు అందించేలా బీజేపీ పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలారా… ఆలోచించండి. ఎవరు బీసీ వ్యతిరేకులో, ఎవరు బీసీ అనుకూలురో? ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ద్వారా మీరే నిర్ణయించండి.
దేశ ప్రజలారా ఆలోచించండి. ఓబీసీల పట్ల రాహుల్ గాంధీ కపటనాటకం.. కాంగ్రెస్ పార్టీ నిజమైన వైఖరిఏంటో ఆలోచించండి. కనీసం ఓడిపోయే అభ్యర్థిని కూడా బీసీ అభ్యర్థిగా నిలబెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు అండగా ఉండేది బిజెపి మాత్రమే.