• భూ రీ సర్వే లోపాలపై గీవెన్స్ లో ఫిర్యాదు
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి: ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన రాయపాటి రంగమ్మ మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు. తమ గ్రామంలో సర్వే నెం.210లో తనకు 0.85 సెంట్లు భూమి ఉంది. దానికి సంబంధించిన పట్టాదార్ పాస్ బుక్ (ఎఫ్ 518732, ఖాతా నెం.706) కూడా మంజూరైంది. అయితే రీ సర్వేలో జరిగిన లోపాల వల్ల ఆన్ లైన్ లో కేవలం 0.55 సెంట్లు మాత్రమే చూపిస్తుంది. తమ భూమిని ఆన్ లైన్ లో మొత్తం 0.85 సెంట్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని నేతలు ఏపీ ఉమెన్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీతల సుజాత, ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
నంద్యాల పట్టణానికి చెందిన ముంగర విజయసుందరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూనే, తమ భర్త అనారోగ్యం కారణంగా చిన్న టీ స్టాల్ పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాను. వైద్య ఖర్చుల కోసం మహేంద్ర, యమునా, మీనా, షహనస, మనోహరి అనే వారి దగ్గర అప్పు తీసుకున్నాను. అనుకున్నదానికంటే ఎక్కవ వడ్డీలతో అప్పు చెల్లించాను. వారు ఇచ్చిన డబ్బులకు రెండింతలు వసూలు చేశారు.
తను డబ్బులు కట్టలేని పరిస్థిల్లో వడ్డీదారుల అనుచరులు నందవరంలోని ఒక ఇంట్లో తనను బంధించి ప్రాంసరీ నోట్లు బలవంతంగా రాయించుకుని చంపేస్తామని బెదిరించారు. స్థానిక పెద్దమనిషి సుబ్బరాయుడు మధ్యవర్తిత్వం చేయగా, అతని ద్వారా రూ.32 లక్షలకు బాండ్ రాయించుకున్న తరువాత విడిచిపెట్టారు. అనంతరం తనను కిడ్నాప్ చేసి నంద్యాలలో బంధించగా, పోలీసులు జోక్యం చేసుకుని విడిపించారు. ఇప్పటికీ తనకు, తన కుటుంబానికి ప్రాణహాని బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దామినీడు గ్రామానికి చెందిన దీపారెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నంబర్లు 192/20, 192/21, 192/23 పరిధిలో ఉన్న తమ ఇళ్లు D.No.9-41/1లో 25 సెంట్ల స్థలంలో 15 సెంట్ల భూమిని ఎస్ మునిరత్నం రెడ్డి ఆక్రమించారు. 192/20 లో 38 సెంట్లలో 10 సెంట్ల భూమిని అతని తమ్ముడు కబ్జా చేశాడు. ఈ భూమిని తమ తండ్రి జి. వేమారెడ్డి వివాహ సమయంలో బహుమతిగా ఇచ్చారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉద్యోగం చేస్తున్న మునిరత్నం రెడ్డి, టీటీడీలో పనిచేస్తున్న అతని తమ్ముడు కలిసి తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.
కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన బలే రమేష్ బాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ముదినేపల్లి మండలం జానకీగూడెం యంపీపీయస్ స్కూల్ ల్లో తన భార్య దాసరి పద్మలత ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తూ 2020 మార్చి 3న మరణించారు. కావునా కారుణ్య నియామకం ద్వారా తన కుమారుడు బలే విజయబాబుకు ఉద్యోగం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో తన సమస్యను అధికారులు పట్టించుకోలేదు. తను బైపాస్ సర్జరీ చేయించుకున్నందు అనారోగ్య సమస్యల రీత్యా ఎక్కువగా పనిచేయలేను. తమయందు దయవుంచి తన కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని కోరారు.