ఎన్ టీ రామారావు, కత్తి కాంతారావు తో విఠలాచార్య తీసిన చిక్కడు – దొరకడు, కదలడు – వదలడు లాంటి చాలా జానపద సినిమాలు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటాయి. వాటిల్లో కధానాయకులు గానీ…. రాజనాల లాంటి విలన్లు గానీ… గుర్రాలపై దౌడు తీసే దృశ్యాలను మనం చూసే ఉంటాము.
లాంగ్ షాట్ లో నిజం గుర్రాలపైనే ఓ పదిమంది దౌడు తీస్తుంటారు. క్లోజ్ – అప్ లో మాత్రం ఎన్టీఆర్, కాంతారావు, రాజనాల గుర్రపు స్వారీ ని చూపించాల్సి వచ్చినప్పుడు, కొయ్య గుర్రాలను పెడతారు. వాటిమీద వాళ్ళు విపరీతం గా ఊగిపోతూ ఉంటారు…. వెనక్కి వెనక్కి చూసుకుంటూ. చూసే ప్రేక్షకులకు మాత్రం… వారు నిజం గుర్రాలపై చమటలు కక్కుతూ దౌడు తీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఆ కొయ్య గుర్రాలు… అంగుళం కూడా ముందుకు కదలవు. ఇప్పుడు వైసీపీయులు, వారి అధినేత చెబుతున్న మాటలు వింటుంటే,’ చేస్తున్న చేష్టలు చూస్తుంటే , వీళ్ళు కూడా రాజకీయపు చెక్క గుర్రం ఎక్కి అధికార పార్టీపై (అంటే చంద్రబాబు – లోకేష్ ద్వయం పై ) అదేపనిగా ఊగుతూ, చిందులు వేస్తూ…. పాపం పగటి కలల్లో తేలియాడుతున్నారా అనే భావం కలుగుతున్నది.
వైసీపీయులు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రప్రధమ కారణాలు… దోపిడీలు, దౌర్జన్యాలు. బుకాయింపులు.
కానీ, వీటి గురించి వైసీపీ ఒక్క అక్షరం కూడా మాట్టాడలేదు. విచారం వ్యక్తం చేయలేదు. పైపెచ్చు, ఈ దుర్గుణాలను కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ…. రేయింబవళ్ళు సొంత బాజా భజంత్రీలతో చెవులు చిల్లులు పడేటట్టు ప్రచార హోరు.
ఈ ‘ నెగటివ్ యాటిట్యూడ్ ‘ అనే కొయ్య గుర్రం ఎక్కి, జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఊగుతున్నారు. ఆ కండువా కప్పుకున్నవారు కూడా ఆయనను తు.. చ… తప్పకుండా అనుసరిస్తున్నారు. సత్యాసత్యాలతో పని లేదు.
ఈ ‘కాన్సెప్ట్ ‘ చాలా సింపుల్.
ఒకే విషయాన్ని పది, వందలు, వేలు, లక్ష సార్లు చెబుతుంటే…. ఎంతోకొంత జనం బుర్రల్లో నాటుకుంటుంది అనే పేరాశే వైసీపీయులను నడిపిస్తున్నట్టు కనిపిస్తున్నది.
” మళ్ళీ మేమే అధికారం లోకి వస్తాం. అందరి తాట తీస్తాం ” అనేదే ఆ ఏకైక వాక్యం.
అధికారం లోకి రావాలి అనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా, ” మేం అధికారంలోకి వస్తే…. ప్రజలకు అది చేస్తాం…. ఇది చేస్తాం… ” అని చెప్పడమే – స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాం.
కానీ, ” మేం అధికారం లోకి రాగానే వాళ్ళ చెడ్డీలు విప్పిస్తాం. పోలీసులతో సెల్యూట్ లు చెప్పిస్తాం. ఇంతకు ఇంతా బదులు తీర్చుకుంటాం. నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం…” అంటూ రాక్షస మనస్తత్వ ప్రదర్శన చేస్తున్న వైసీపీనే మొదటి సారిగా చూస్తున్నాం.
ఈ రకమైన మైండ్ సెట్ తో, రాష్ట్రాన్ని మరోసారి చెర బట్టాలి అనుకుంటున్న మూకల్ని ప్రజల్ని అక్కున చేర్చుకుంటారా?
వచ్చే ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల వ్యవధి ఉంది.
” వచ్చే ఎన్నికల్లో వచ్చేది మేమే. రప్పా… రప్పా… ” వంటి ఊహల ఉయ్యాల లో ఊగడానికి జగన్ స్వస్తి చెప్పాలి.
ఎందుకు తనకు కేవలం 11 స్థానాలే లభించాయి? 2029 ఎన్నికలకు వెళ్ళడానికి ఇప్పుడున్న నేతలలో ఎంతమంది ” నేతలు ” పనికి వస్తారు? ప్రజల మనసులు గెలుచుకోడానికి ఏ రకమైన ఆలోచనలు చేయాలి? ఏ రకమైన “సలహా దారు ” లు ఉండాలి? అసలు “సలహాదారు”లు అవసరమా? తల్లి – చెల్లెళ్ళ సమస్యలు ఎలా తనకు అడ్డం రాకుండా చూసుకోవాలి?
వివేకా మర్డర్ ఘటన తో ఎదురైన అపకీర్తి నుంచి బయట పడి, పులివెందుల లో ఎదురు కానున్న రాజకీయ సవాళ్ల ను ఎలా అధిగమించాలి? వైసీపీ అంటే రౌడీ షీటర్స్, సంఘవ్యతిరేక శక్తులు అంటూ సమాజం లో నెలకొని ఉన్న ఒక అభిప్రాయాన్ని మాసిపోయేట్టు చేయడం ఎలా? చంద్రబాబు – లోకేష్ పాలన లో అసంతృప్తికి, అసహనానికి, ఆగ్రహానికి, చిరాకు కు గురవుతున్న నేతలను, సామాజిక ముఖ్యులను, మేధావులను, వ్యవస్థల్లోని ముఖ్యులను, రాజశేఖర రెడ్డి పూర్వపు అభిమానులను, తటస్థులను తమ వైపు తిప్పుకోవడం ఎలా?
ఇవన్నీ సమర్ధం గా చేయగల యంత్రాంగాన్ని సమకూర్చుకోవడం ఎలా? వంటి సవాలక్ష చేయాల్సిన పనులను పక్కన బెట్టి రప్పా… రప్పా జనాలను పక్కనేసుకుని, తిరగడం వల్ల… ఆ చెక్క గుర్రం ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు.
తాను ఏ ఊరు వెళ్లినా… ఇసుక వేస్తే రాలడం లేదంటూ భజంత్రీలు బ్యాండ్ మేళం వాయించినంత మాత్రాన…. ఒక వంద ఓట్లు అదనం గా రావు.
మనిషికో ఐదు వందల నోటు, ఒక క్వార్టరు, ఒక బిర్యాని ప్యాకెట్టు మనవి కాదు అనుకుంటే…. ఉజ్జోగం, సజ్జోగం లేకుండా ఆవారా గా తిరిగే జనానికి షార్టేజ్ ఏమీ లేదు. మన జనాభా ఆరు కోట్లు.
అందువల్ల, పూనకాలతో ఊగి పోయే ( అందుకు సెపరేట్ రేటు ) జనాలను చూపించి, ” మళ్ళీ మేమే వస్తున్నాం…. మీ తాట తీస్తాం… ” అంటూ సమాజాన్ని బెదరేద్దాం అనుకుంటే… కుదరదనే విషయాన్ని… 2029 ఎన్నికల ఫలితాల తరువాత అనుభవ పూర్వకం గా తెలుసుకుంటారో… కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి ఇప్పుడు తెలుసుకుంటారో చూడాలి.
కూటమి ప్రభుత్వం పై, కూటమి అగ్రనేతల పై అభాండాలు, అసత్యాలు, అతిశయోక్తులతో కూడిన ఆరోపణలనే కొయ్యగుఱ్ఱం ఎక్కి ఊగుతూ…” వచ్చేది మేమే ” అంటూ ఆత్మానందం పొందడం సంగతి ఆ ఏసు ప్రభువు ఎరుగు…. ముందు, ముసురుకుని వస్తున్న క్రిమినల్ కేసుల నుంచి బయట పడే మార్గం జగన్ ఆలోచించుకోవాలని పరిశీలకులు అంటున్నారు.
తన స్వంత చిన్నాన్న వివేకానంద రెడ్డి బ్రూటల్ మర్డర్ కేస్ లో నిందితులకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం లేకపోలేదని ఏకం గా సీబీఐ న్యాయవాది సుప్రీం కోర్టులో చెప్పారు. దీనిని బట్టి ఆయన, ఆయన పరివారం ఏ పరిస్థితుల్లో ఉన్నారో జగన్ అర్ధం చేసుకోవాలి. లిక్కర్ కుంభకోణం లో తాను ఎంత లోతులో ఇరుక్కున్నానో ఆయన అర్ధం చేసుకోవాలి.
తన పాలన లో, టచ్ చేయడానికి కూడా సాహసించలేని వ్యక్తి – అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోని మూకలను…. ” ఎక్కువ చేశారంటే కాల్చి పారేస్తా నా కొడకల్లారా… ” అంటూ పులివెందుల డీయస్పీ అన్నారూ అంటే…. ప్రస్తుతం తన పరిస్థితి ఏంటో జగన్ గమనించాలి.
ఇవేమీ లేనట్టు…. తన హయాంలో అసలు అవినీతి, అరాచకం, దోపిడీ, దౌర్జన్య కాండ… మొదలైన సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అసలు ఏమీ జరగనట్టు గా…. కూటమి నేతలు, ప్రభుత్వం పై పనికిమాలిన విమర్శలలోని డొల్ల తనాన్ని ప్రజలు గమనించడం లేదని జగన్ భావిస్తున్నారేమో తెలియదు.
చంద్రబాబు, లోకేష్ ను నిర్మాణాత్మకంగా విమర్శించాలి అనుకుంటే…. అంశాలు లేక పోలేదు. అడ్డగోలుగా విమర్శించడం -‘ నెగటివ్ పొలిటిక్స్ ‘. అది చెక్క గుర్రం పై ఊగుతూ ” నేను వచ్చేస్తున్నా…. నేను వచ్చేస్తున్నా… ” అనుకోవడం లాటిది.
నిర్మాణాత్మకం గా విమర్శించడం…. “పాజిటివ్ పొలిటిక్స్ “. జనం లోకి వెడుతుంది. ఎన్. ఐ (నేచురల్ ఇంటిలిజెన్స్ ). చంద్రబాబు ది ఏ. ఐ. (అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ).
అందుకే, చెక్క గుర్రం స్వారీ కి జగన్ స్వస్తి చెప్పాలి.
