– కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదు
– న్యాయనిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి
– ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయి
– రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీయే
– అధికారంలోకి రాగానే జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది
– జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తాం
– జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా
హైదరాబాద్ : జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సహా హౌజింగ్ సొసైటీలకు భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో తీవ్ర నిరాశ, నిస్ప్రహల్లో మునిగిపోయిన జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బాసటగా నిలిచారు. జర్నలిస్టులెవరూ బాధపడొద్దని సూచించారు. జర్నలిస్టులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగానే చర్చించి జర్నలిస్టులందరికీ ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవకాశవాద రాజకీయాలే కారణమని విమర్శించారు. ఓట్లపై ఉన్న శ్రద్ధ జర్నలిస్టులుసహా పేదవర్గాలను ఆదుకోవడంలో లేదని దుయ్యబట్టారు.
అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ కుమార్ జర్నలిస్టుల పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి…
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సహా హౌజింగ్ సొసైటీలకు భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం దురద్రుష్టకరం. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యమే. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేశారు. న్యాయ స్థానంలో ఆయా ప్రభుత్వాలు సరైన వాదనలను విన్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా భావిస్తున్న జర్నలిస్టుల జీవితాలు దుర్భరంగా మారాయి. చాలీచాలని జీతాలతో పనిచేస్తూ అద్దె ఇండ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టు సమాజమంతా తీవ్ర నిరాశలో ఉంది. వారిని ఆదుకుని అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోకపోతే వారికి న్యాయం చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో చర్చించి న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లను నిర్మించి ఇస్తాం.