– అచ్చెన్న వేధింపులకు ఆగ్రోస్ ఉన్నతాధికారి బలి
– అవినీతికి సహకరించలేదని ఆగ్రోస్ జీఎం బదిలీ
– కమీషన్లు వచ్చేలా చూడాలని మంత్రి అచ్చెన్న పేషీ నుంచి వేధింపులు
– భరించలేక సీఎస్‌కి లేఖ రాసి సెలవుపై వెళ్లిపోయిన రాజమోహన్
– ఆ లేఖ ఆధారంగా మంత్రి అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకోవాలి
– శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాకుళం జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు
శ్రీకాకుళం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతో అవినీతిలో ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా పోటీ పడుతున్నారని మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు ధర్నాన కృష్ణదాస్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రుల అవినీతిని తట్టుకోలేక పారిపోతున్న అధికారులను వెంటాడి మరీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అచ్చెన్నాయుడి అవినీతికి సహకరించలేదనే కారణంతోనే ఆగ్రోస్ జీఎం రాజమోహన్ని ఈ ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో అవినీతి కేసులున్న జూనియర్ అధికారిని నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిజాయితీగా పనిచేసే అధికారులకు కనీస గౌరవం లేకుండా పోతోంది.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన అవినీతికి సహకరించలేదనే కారణంతో సీనియర్ అధికారి ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో అర్హత లేని చిన్న స్థాయి ఉద్యోగిని తెచ్చిపెట్టుకున్నారంటే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థమైపోతుంది. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం నెరిపి తనకు మేలు జరిగేలా చేయాలని మంత్రి పేషీ నుంచి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ కి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది.
కానీ దానికి ఆయన అంగీకరించకుండా సెలవుపై వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో అవినీతి ఆరోపణలు, పెండింగ్ కేసులన్న జూనియర్ అధికారిని తీసుకొచ్చి నియమించడం చూస్తుంటే అవినీతికి ఈ ప్రభుత్వం ఏవిధంగా పెద్దపీట వేస్తుందో చెప్పకనే చెప్పింది. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో రైతులకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించాల్సిందిపోయి, కమీషన్ల ద్వారా జేబులు ఎలా నింపుకోవాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేసుకోవడం సిగ్గుచేటు.
ఆగ్రోస్ జీఎం రాజమోహన్ బదిలీ వెనుక ఏం కారణాలున్నాయో స్పష్టం చేయాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడిపై ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగా వేధించి ఉండకపోతే సీఎస్‌కి లేఖ రాసి మరీ ఆయన వెళ్లిపోతారు? సమర్థవంతమైన నిజాయితీగల అధికారులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా?