– జైల్లో ఉంటూ పాలించవచ్చా?
– అందుకోసమే ‘తొలగింపు’ బిల్లు
– కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా
ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిన ఉదంతం కారణంగానే ఈ బిల్లులను తీసుకురావాల్సి వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఒకవేళ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ రోజు ఈ మార్పులు అవసరం అయ్యేవి కావని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించిన సమయంలో, జైలుకు వెళ్లిన వారు కూడా పదవుల్లో కొనసాగుతారని ఎవరూ ఊహించి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు.
కేరళలో జరిగిన మనోరమ న్యూస్ కాన్క్లేవ్లో అమిత్ షా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని గుర్తుచేశారు. ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? ఇది ఎలాంటి చర్చో నాకు అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా నైతికతకు సంబంధించిన ప్రశ్న అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి పాలన సాగించిన ఘటన జరిగింది. మరి రాజ్యాంగాన్ని సవరించాలా, వద్దా? గతంలో బీజేపీ ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్నాయి, కానీ మాకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నైతికతను కాపాడాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండింటిపైనా ఉంటుందని అమిత్ షా అన్నారు.
తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలపై వరుసగా 30 రోజుల పాటు అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.