– రీసైక్లింగ్ కు అదనపు ప్రోత్సాహకాలు
– షేడ్ నెట్ల వాడకం వల్ల నేల తల్లికి హాని
– వాటి తయారీలో ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబించాలి
– కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య
విజయవాడ: ‘మనం తలచుకుంటే వ్యర్థాలను రీసైక్లింగ్, పునర్వినియోగం, సృజనాత్మక మార్పుల ద్వారా విలువైన ఉత్పత్తులుగా మార్చొచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది‘ అన్నారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య.
రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, వ్యవసాయ రంగం, పశుసంవర్ధక శాఖ, మత్స్య తదితర రంగాల నుంచి వచ్చే వ్యర్థాలను నిరుపయోగంగా నేలపాలు చేయకుండా, సందప సృష్టించే వనరుగా భావించాలని ఆకాంక్షించారు. ఆ వనరులు వినియోగించుకుని ఉపాధిని పెంచుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఎలా కల్పించాలనే ఉద్దేశంతో- వివిధ రంగాలకు సంబంధించిన వ్యర్థాలు ఎంత వస్తున్నాయి? వాటిని ఎలా వాడుతున్నారు? ఏ విధంగా పునర్వినియోగంలోకి తీసుకురావాలి? కొత్తగా ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పాలి? తద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే అంశం పై విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం వర్క్ షాపు జరిగింది.
పీసీబీ ఛైర్మన్ డా.పి.క్రిష్ణయ్య, మెంబర్ సెక్రటరీ శరవణన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ, పశు సంవర్థక, పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తోపాటు.. వ్యవసాయ శాఖ ఇతర ఉన్నతాధికారులూ, విశ్వవిద్యాలయాల ఉపకులపతులూ హాజరయ్యారు. వ్యవసాయం, ఆక్వా, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ తదితర రంగాల్లో ఏ మేరకు వ్యర్థాలు ఉత్ఫన్నమవుతున్నాయి. వాటిని ఎలా నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయో పీసీబీ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఎం. రాజశేఖర్. వివరించారు
వర్క్ షాపులో పాల్గొన్న నిపుణులూ తమ తమ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను చర్చించడంతోపాటు తగిన సూచనలు చేశారు. గ్రామ స్థాయిలో వ్యర్థాలకు అడ్డు కట్ట వేయడంతోపాటు ఆయా రంగాల్లో మెరుగైన రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుతో- అటు వ్యర్థాల భారం తగ్గుంది. ఇటు ఉపాధి అవకాశాలూ మెరుగై ఆర్థిక వనరులు సమకూరుతాయని వారంతా తెలియజేశారు.
ఈ సందర్భంగా పీసీబీ ఛైర్మన్ క్రిష్ణయ్య మాట్లాడుతూ…‘మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన రీసైక్లింగ్ పాలసీ ద్వారా పర్యావరణ అనుకూల పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి. రీసైక్లింగ్ కు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో ఎక్కువగా పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది’ అన్నారు. అంతేకాక, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబించడంలో భాగంగా మల్చింగ్ ఫిల్మ్, డ్రిప్ ఇరిగేషన్ లో సన్నటి ప్లాస్టిక్ పైపులు, మత్య్స రంగంలో మత్స్యకారులు వాడని వలలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు, హార్టికల్చర్ లో ప్లాస్టిక్ తో రూపొందించిన షేడ్ నెట్ల వాడకం వల్ల నేల తల్లికి ఎంతో హాని జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటి తయారీలో ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు.