– తన పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు
– వారి దారుణాలపై చంద్రబాబువి తాటాకు చప్పుళ్ళే
– స్వప్రయోజనాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్.
– తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ నాయకులు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన వెంకట మహేష్
తాడేపల్లి: తన సొంత పార్టీలోని ఎమ్మెల్యేల అరాచకాలను చూస్తూ కూడా వారిని అదుపు చేసే స్థితిలో సీఎం చంద్రబాబు లేడని వైయస్ఆర్సీపీ నేత, పార్టీ గుంటూరు పార్లమెంట్ నియెజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు.
అటవీశాఖ అధికారుల మీద దాడులు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా చిన్న ట్వీట్‌తో సరిపెట్టడం దారుణం. టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేదాకా ఊరుకోను అని గట్టిగా చెప్పలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం.
విశాఖ స్టీల్ ప్లాంట్ కావొచ్చు, సుగాలి ప్రీతి కేసు కావొచ్చు.. ఏ విషయం లోనూ పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే మనిషి కాదు. రాష్ట్రం గురించో, జనసేన కోసమో ఆయన ఆలోచించడం లేదు. ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, సీఎం చంద్రబాబు ప్రయోజనాల కోసం ఆయన పోరాడతారని ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయి.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వారి ఆగడాలపై కేబినెట్లో చంద్రబాబు సీరియస్ డ్రామాలు తాటాకు చప్పుళ్ళేనని అన్నారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న కూటమి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎక్కడ తిరగబడతారోననే చంద్రబాబు భయం అని ధ్వజమెత్తారు.
కేబినెట్ మీటింగ్‌లో గలీజు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలను రాయించుకుంటున్నారు. అరాచకాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకి లేదు. చంద్రబాబు నిజంగా ప్రజల బాగోగులు గురించి రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించే వారే అయితే ఇప్పటికి ఒక్కరిమీదైనైనా కేసు పెట్టారా?
ఆఖరుకి పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. తన అటవీశాఖలోని అధికారులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా కొట్టి వేధిస్తే ఆయనపై చర్యలు తీసుకునేలా చంద్రబాబుని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? సుగాలి ప్రీతి కేసు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలను ఆయన గెలవగానే వదిలేశారా?
ప్రజలను పక్కదారి పట్టించడానికి మాత్రం గలీజు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ మీడియాలో ఊకదంపుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అసలీ చంద్రబాబు ఎవరి మీద సీరియస్ అయ్యారు? సీరియస్ అయ్యారు, నిప్పులు చెరిగారు, ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. లాంటి డైలాగులకు అర్థమేంటి?
ఈ సీరియస్ డ్రామాలతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కర్నయినా భయపెట్టగలిగారా? ఒక్కరి మీదనైనా కేసు పెట్టారా? చట్టపరంగా ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకున్నారా? కనీసం విచారణకు ఆదేశించిన దాఖలాలైనా ఉన్నాయా అంటే అదీ లేదు. ప్రజలను పక్కదారి పట్టించడానికి తప్ప ఈ సీరియస్ డ్రామా వల్ల జరిగిన ప్రయోజనం ఏంటి బాబూ?
డీలర్లతో కమీషన్ల గురించి మధ్యవర్తిత్వం వహించనందుకు మంత్రి అచ్చెన్నాయుడు తనని బదిలీ చేశాడని ఏకంగా చీఫ్ సెక్రటరీకి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ లేఖ రాస్తే కనీసం పిలిచి విచారించారా? ఒక ఉన్నతాధికారి ఫిర్యాదు చేస్తే కనీసం దర్యాప్తు కైనా ఆదేశించారా? రౌడీ షీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్ లు తప్పుడు సిఫార్సు లేఖలిచ్చారు.
హోంశాఖ రిజెక్టు చేసినా ‘వీటో’ చేస్తూ ఏకంగా హోంమంత్రి అనిత పెరోల్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? దాన్ని పక్కదారి పట్టించడానికి వైయస్సార్సీపీ నాయకుల గురించి ప్రజల ముందు పచ్చి అబద్ధాలు చెప్పారు. పెరోల్ రిజెక్ట్ చేస్తూ 16.07.2025న హోంశాఖ లేఖ ఇచ్చింది. అయినా 30.07.2025 రౌడీషీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇస్తూ ఉత్తర్వులిచ్చిన హోంశాఖ మంత్రి అనిత మీద ఏం చర్యలు తీసుకున్నారో సీఎం చంద్రబాబు చెప్పాలి.
ఒక మహిళతో గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అసభ్య చేష్టల వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ వ్యవహారం బయటపెట్టారనే అనుమానంతో ఒక మహిళను వేధిస్తుంటే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? బాధిత మహిళకు అండగా నిలిచారా? దళిత మహిళ, కేజీబీవీ ప్రిన్సిపల్ ని వేధించి వెంటాడి ఆమె మీద కక్ష తీర్చుకున్న ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నారు?
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని నారా లోకేష్‌కి అత్యంత సన్నిహితుడైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్.. అత్యంత దారుణంగా దుర్భాషలాడితే ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్‌ని బండ బూతులు తిట్టిన తర్వాతనే సీఎం చంద్రబాబుని ఆ ఎమ్మెల్యే రెండుసార్లు కలిశాడు. ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నట్టు? ఏమీ సంబంధం లేని మహిళ గురించి అత్యంత హేయంగా మాట్లాడితే ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏమైంది? మీడియాలో బిల్డప్ బ్రేకింగులు తప్పించి ఏం చేశారు.