– పోలీసు, జైలు అధికారి వద్దన్నా శ్రీకాంత్‌కు పెరోల్‌కు సిఫార్సు చేసిన ‘ప్రభుత్వ పెద్ద’?
– సిఫార్సులో గూడూరు వ్యాపారవేత్త కీలకపాత్ర?
– ‘కులాభిమానం’తో ఆ వ్యాపారవేత్తను సంతృప్తి పరిచిన ‘ప్రభుత్వ పెద్ద’?
– ఆ వ్యాపారవేత్తకు చెన్నైలో బినామీ వ్యాపారాలు?
– ఏపీకి చెందిన మరో ‘కార్పొరేషన్’ ప్రముఖుడికీ అక్కడే బినామీ వ్యాపారాలు
– ఇద్దరికీ బినామీ ఒక న్యాయవాదేనట?
– లాబీయింగ్‌లో గూడూరు ప్రముఖుడు మొనగాడేనట
– అరుణతో ఆయనకు సన్నిహిత సంబంధాలు తేల్చిన నిఘా విభాగం?
– ఆయన చెబితేనే ప్రభుత్వ పెద్దను కలిసిన అరుణ?
– దానితో హోంశాఖ ఉన్నతాధికారికి శ్రీకాంత్ పెరోల్ సిఫార్సు చేసిన ప్రభుత్వ పెద్ద?
– పాయకరావుపేట ‘చిట్టి’ తండ్రి నుంచే ఫైల్ కదిలిందా?
– ‘చిట్టి’ తండ్రికి అరుణ బంధువుతో ‘బంధం’?
– వైసీపీ లోనూ శ్రీకాంత్‌ను అడ్డుపెట్టుకుని నెల్లూరు రూరల్ నేత బెదిరింపులు
– కూటమికి అప్రతిష్ఠ తెస్తున్న అడ్డగోలు చర్యలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లి అవి జనక్షేత్రంలో ప్రజామోదం పెరగాల్సిన సమయంలో అందుకు భిన్నంగా.. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు-ఎమ్మెల్యేలు జమిలిగా చేస్తున్న అప్రతిష్ఠ చర్యలు, కూటమి ప్రభుత్వ ఇమేజీని డామేజీ చేస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం, సీఎం చంద్రబాబు ఈ వయసులో కూడా నిరంతరం కష్టపడుతుంటే.. మరోవైపు అధికారులు-ఎమ్మెల్యేలు-నేతల వికార-అనైతిక చేష్టలు, ఆయన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తుండం, టీడీపీ వర్గాలను ఆవేదనకు గురిచేస్తోంది.
గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన లేడీడాన్ అరుణ ప్రియుడు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో.. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక ‘ప్రభుత్వ పెద్ద’ ఒత్తిడి చేసినట్లు, అధికార-రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పేరు-పాత్ర ఇప్పటివరకూ తెరపైకి రాకుండా, కథ అంతా గత వైసీపీ ప్రభుత్వం-ఇప్పటి ఇద్దరు ఎమ్మెల్యేలు- అరుణ వీడియోకాల్స్-ఆమె నడిపిన దందాల చుట్టూ తిప్పుతున్న వైనం ఆశ్చర్యపరుస్తోంది.
లేడీ డాన్ అరుణ, తన ప్రియుడు శ్రీకాంత్‌కు పెరోల్ కోసం చేసిన ‘శ్రమదానం’.. ఆ మేరకు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చి, ఆమె ముచ్చట తీర్చడం.. మంత్రిగారు కూడా ముందు ‘ఆ సిఫార్సు లేఖ సంగతేంటో చూడమ’ని అధికారులను పురమాయించడం.. అంతకుముందే తిరుపతి ఎస్పీ, నెల్లూరు జైలు అధికారి సదరు శ్రీకాంత్‌కు పెరోల్ ఇస్తే కొంపకొల్లేరవుతుందని ఆ పిటిషన్‌ను తిరస్కరించడం.. అయినా శ్రీకాంత్ పిటిషన్‌పై రాజముద్ర పడటం.. అది కాస్తా మీడియాలో గుప్పుమనడంతో రద్దవడం.. ఆ తర్వాత సదరు అరుణ, వైసీపీ జమానాలో నెల్లూరు ఎస్పీగా పనిచేసిన ఓ అధికారితో ‘విజయ’వంతంగా పనులు చక్కదిద్దుకోవడం.. మరికొందరు పోలీసు అధికారులు ఆమెతో సరస సల్లాపాడే సంభాషణ లీక్ కావడం.. శ్రీకాంత్‌కు పెరోల్ సిఫార్సు చేస్తూ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖలను వైసీపీ బయటపెట్టడం.. ఆ మధ్యలో శ్రీకాంత్ టీడీపీ ఎమ్మెల్యేతో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలతోపాటు.. ఖైదీగా ఉన్న శ్రీకాంత్ సేదరిన ఆసుపత్రికి వెళ్లిన, అరుణ మేడమ్ మసాజ్ చేయించుకున్న వీడియోలు బయటకు రావడం… ఇవన్నీ గత వారం రోజుల నుంచి తెలుగు ప్రజలు, మీడియా-సోషల్ మీడియా ద్వారా చూసి తరిస్తున్న దృశ్యాలే.
అరుణ వైసీపీ హయాంలో సాగించిన హవానే, కూటమి సర్కారులోనూ కొనసాగిస్తోందంటూ పుంఖానుపుంఖాల కథనాలు, వీడియోలతో అదరగొడుతున్న మీడియా-సోషల్‌మీడియా.. అసలు శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శిపై ఒత్తిడి చేసింది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన ప్రముఖుడెవరు? దీనికి ‘కులాభిమానం’ ఎలా కారణమయిందన్న అంశాలు మాత్రం ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం.
పార్టీ-అధికార వర్గాలందించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ఖైదీ శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వమని, ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించే ‘ఒక ప్రభుత్వ పెద్ద’ హోంశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి ఒత్తిడి చేసినట్లు, హోంశాఖ కార్యాలయ వర్గాల్లో ప్రచారం జరిగింది. సహజంగా సౌమ్యుడు, వివాదరహితుడయిన సదరు హోంశాఖ కార్యదర్శి, సదరు ‘ప్రభుత్వ పెద్ద’ ఆదేశాల మేరకు శ్రీకాంత్‌కు పెరోల్‌పై సంతకం చేసినట్లు అటు అధికార వర్గాల్లో కూడా ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమని తేల్చిన నిఘా విభాగం కూడా, సీఎంకు ఇచ్చిన నివేదికలో దానినే పేర్కొన్నట్లు తెలిసింది.
నిజానికి ఆ ప్రభుత్వ పెద్ద ఆ హోదాలోకి రావడం కరుడుగట్టిన పసుపుదళాలకు మొదటినుంచీ ఇష్టం లేదు. వైసీపీ హయాంలో నాటి పాలకులతో అంటకాగిన ఆయన పుణ్యానే, కడపకు చెందిన ఓ ఎలక్ట్రికల్ కంపెనీకి వేల కోట్ల రూపాయల ఆర్డర్లు దక్కాయన్నదే పసుపు సైనికుల ఆగ్రహం. దానిపై అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీ నేతలు విమర్శలు కురిపించారు కూడా! ఆ తర్వాత కూడా ఆ కంపెనీతో బంధ ం కొనసాగించేందుకు, సదరు కీలక అధికారే మధ్యవర్తిత్వం చేశారన్న ప్రచారం.. సోషల్ మీడియా, పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగిన విషయం తెలిసిందే.
మరి ఇన్ని విమర్శలు-ఆరోపణలు ఎదుర్కొని కూడా, కేవలం కులం కార్డుతో కీలక స్థానం సంపాదించుకున్న సదరు అధికారి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? కీలక-సున్నిత అంశాల్లో ఇంకెంత ఆచితూచి వ్యవహరించాలి? వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉండాలి కదా? కానీ అందుకు భిన్నంగా.. ే వలం గూడూరుకు చెందిన ఓ వ్యాపార-కాలేజీ ప్రముఖుడు ‘కులాభిమానం’తో చేసిన సిఫార్సును, అమలు చేయడం ఏమిటన్నదే ఇప్పుడు కూటమి వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. కాగా సదరు ప్రభుత్వ పెద్దతో ఆయన కులానికి చెందిన రాజకీయ-వ్యాపార-అధికార ప్రముఖులు తరచూ భేటీ అవుతుంటారన్న ప్రచారం అధికారవర్గాల్లో చాలకాలం నుంచి వినిపిస్తున్నదే.
నిజానికి గూడూరుకు చెందిన ఓ కాలేజీ ప్రముఖుడికి.. అరుణతో సన్నిహిత సంబంధాలున్నాయని, పార్టీ-పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా పనులు చేయించుకునే లాబీయిస్టుగా ఆయనకు పేరుంది. ఆయన కులానికి చెందిన మంత్రులు, అధికారులతో పనులు చేయించుకుంటారన్న ప్రచారం కూడా లేకపోలేదు.
ఆ విషయం తెలిసిన అరుణ, ఆయనతో శ్రీకాంత్ పెరోల్ ముచ్చట ప్రస్తావించిన నేపథ్యంలో.. తన కులానికే చెందిన ఆ ప్రభుత్వ పెద్దకు ‘ఫలానా అరుణ వచ్చి కలుస్తుంది. పని చేసిపెట్టమ’ని పురమాయించడం.. ఆ మేరకు అరుణ మేడమ్ ఆ ప్రభుత్వ పెద్దను కలవడం.. తర్వాత ఆయన హోంశాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేసి, శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేయడం, అది బయటకొచ్చి రచ్చరంబోలా కావడంతో రద్దవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
కాగా సదరు గూడూరు వ్యాపారవేత్తకు చెన్నైలో మరికొన్ని బినామీ వ్యాపారాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆయన కులానికే చెందిన మరో ‘కార్పొరేషన్’ ప్రముఖుడికీ చెన్నైలో బినామీ వ్యాపారాలున్నాయని, వారిద్దరి బినామీ వ్యాపారాలను ఒక న్యాయవాది చూసుకుంటారని నెల్లూరు జిల్లా పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తన కులానికే చెందిన ఓ రిటైర్డ్ అధికారిని, ఆర్టీఐ సభ్యుడిగా నియమించడంలో ఈ గూడూరు ప్రముఖుడు కీలకపాత్ర పోషించారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. తన కులానికి చెందిన తూర్పు గోదావరి మంత్రితో సిఫార్సు చేయించి, ఆ రిటైర్డ్ అధికారికి ఆ పదవి వచ్చేలా చక్రం తిప్పారన్న ప్రచారం జరిగింది. నిజానికి అదే పదవికి, అదే కులానికి చెందిన టీడీపీ సీమ సీనియర్ నేత పేరు పరిశీలనకు వచ్చింది. కానీ ఆ పదవి ఆయనకు దక్కలేదు.
ఇదిలాఉండగా.. అసలు శ్రీకాంత్ పెరోల్ పిటిషన్‌కు రెక్కలొచ్చి, ప్రాణం పోసుకున్నదే పాయకరావుపేట నుంచి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నియోజకవర్గ వ్యవహారాలు చూసే ఒక ‘చిట్టి’ తండ్రికి, అరుణ బంధువుతో చాలాకాలం నుంచి ‘అత్యంత సన్నిహిత సంబంధాలు’న్నట్లు పోలీసులు కూడా గుర్తించినట్లు చెబుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలతోపాటు, సదరు ‘చిట్టి’తండ్రి పలుకుబడి.. శ్రీకాంత్ ఫైల్ శరవేగంతో సర్క్యులేట్ అయ్యేలా చేసినట్లు, పార్టీ-ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా ఖైదీ శ్రీకాంత్ కు గతంలో వైసీపీలో ఉంటూ, తర్వాత టీడీపీలో చేరిన ఓ నెల్లూరు ప్రముఖుడు, ఇప్పుడు జిల్లా చక్రం తిప్పుతున్న మరో మున్సిపల్ కార్పొరేషన్ కీలకనేతతో వ్యాపారబంధం ఉన్నట్లు టీడీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. భూవివాదాలు, ఇతర వ్యవహారాల్లో సదరు ప్రముఖులు, శ్రీకాంత్ సైన్యం సేవలను వినియోగించుకునేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
