భారత్ చంద్రుని దిశగా సాగిస్తున్న ప్రస్థానంలో చంద్రయాన్ వేసిన తొలి విజయవంతమైన అడుగు..23.08.2023..
అందని జాబిలి..అన్నాం..
రాహువు..కేతువు మింగేస్తారని అనుకున్నాం..
లేరు మనకు బంధువులు
లేరు తల్లిదండ్రులు..
మనని చూసి
అయ్యో పాపం
అనేవారు ఎవ్వరు..
అనేవారు ఎవ్వరూ..
అని పాడుకున్నాం…
నెలవంక తొంగి చూసింది..
చలిగాలి మేను సోకింది..
ఆంటూ మురిసిపోయాం..
జాబిల్లి పిలిచింది
నిన్ను నన్నూ..ఓయమ్మో..
అలా ఊహించుకున్నాం..
చందమామ రావె..
జాబిల్లి రావె..
కొండెక్కి రావె..
గోగుపూలు తేవే..
ఇలా పిలుపులు చేశాం..
జాబిలితో చెప్పనా
జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి..
ప్రేమ కబుర్లూ
ఆ చక్కనయ్యతోనే..
చక్కనయ్యా..చందమామ..
ఎక్కడున్నావు..
నీవు లేక దిక్కు లేని చుక్కలయ్యాము..
ఓ చంద్రుడా..
నువ్వు రాకపోతే కలవరమేనని
మొరలూ పెట్టుకున్నాం…
అన్నమయ్య మొదలుకుని
వాగ్గేయకారులు..
కవులూ ఆ జాబిలిని
ఎంతగా వర్ణించారో..
ఎలా సాంతం సొంతం
చేసుకున్నారో..
ప్రతి భావనలో
జాబిలే..
నీలాకాశంలో నెలరాజు రాక..
మధురభావాల ఏరువాక..
నెలరాజా పరుగిడకు..
చెలి వేచే నీ కొరకు..
ఆయనొస్తే కోరిక..
రాకుంటే కొరత..
దిగాలుగా కలువనెలత..!
అలాంటి జాబిల్లి
నేడు చేరువైన..
చేతికి అందిన భావన..
శుక్లపక్షమని..
బహుళపక్షమని అనుకున్నా
మనిషి పక్షమని అనిపించింది..!
అందెను నేడే అందని జాబిలి
అదెంత గిలి..
పరవశించలేదా
ఈ నేలపై ప్రతి లోగిలి..
నిండు జాబిలితోనే
ఆ కౌగిలి..
పులకించదా మానవాళి..
మన విక్రమ్ అక్కడ చేస్తుంటే
పరిశోధనల వ్యాహ్యాళి..!
ఈ జగతి ఎలా పలికినా
తేనెలొలుకు తెలుగు
జాబిలితోనే
వరస కలిపింది
మామా అని..
పిలిచింది దిగిరావాయని..
ఆయనేమో
అందనంత దూరం..
ఇస్రో తీసుకుంది ఆ భారం..
దిగ్విజయంగా నడిపింది
చందమామతో రాయబారం..!
– సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
7995666286