– 12 యూనివర్సిటీల్లో 3675 పోస్టులకు 2419 పోస్టులు ఖాళీ
– అధ్యాపకులు ఉన్నవి కేవలం 1256 మాత్రమే
– నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి?
– నల్లమల నుంచి చదువుకోవడానికి వచ్చిన కృష్ణవర్ధన్ రెడ్డి, మేరెడ్డి చంద్రారెడ్డిని.. అదే జార్జ్ రెడ్డి- గద్దర్- నక్సలైట్ వారసులు చంపిన విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు రేవంత్ రెడ్డి?
– ఇంజనీర్లతో కమిటీ వేసుకోమని చెప్పడం రేవంత్ రెడ్డి అజ్ఞానం
– రేవంత్ రెడ్డికి యూనివర్సిటీకి వెళ్లడానికి అంత భయం ఎందుకు?
– నీకు ఉస్మానియా విద్యార్థులు “తుపాకీ రెడ్డి” అని కొత్త బిరుదు ఇచ్చారు
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు పహారా మధ్య వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో లా కాలేజీ నుంచి ఆడిటోరియం వరకు 12 అడుగుల ఎత్తైన ఇనుప కంచెలు వేసి, పోలీసు పహారా మధ్య, సెక్యూరిటీ నడుమ వెళ్లారు. మరి రేవంత్ రెడ్డికి యూనివర్సిటీకి వెళ్లడానికి అంత భయం ఎందుకు?
తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీ అని చెబుతున్న రేవంత్ రెడ్డి, అదే యూనివర్సిటీలో విద్యార్థులు నిన్ను ఉరికించారని చెప్పుకుంటే బాగుండేది. తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై దాడి చేసిన నీ చరిత్ర గురించి చెబితే బాగుండేది.
అందుకే నీకు ఉస్మానియా విద్యార్థులు “తుపాకీ రెడ్డి” అని కొత్త బిరుదు ఇచ్చారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయాడు.
అసలు యూనివర్సిటీకి ఎందుకు వెళ్లాడో సీఎం రేవంత్ రెడ్డికే కాదు, విద్యార్థులకు కూడా తెలియడం లేదు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి తనను పిలిచారని, అందుకు సంతోషం అంటూ చెబుతూనే, డిసెంబరులో మళ్లీ వస్తాను, ఆ రోజు మీకు వెయ్యి కోట్లే కాదు, ఎంత అడిగినా ఇస్తాను, రుణం తీర్చుకుంటానని మాట్లాడాడు. అలాంటప్పుడు ఈరోజు ఏమి ఒరగబెట్టేందుకు వెళ్లారు?
జార్జ్ రెడ్డి, గద్దర్ నడిచిన నేల అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్లు స్వాతంత్య్ర సమరయోధులా? లేక దేశసేవ చేసిన వారా? అసలు తెలంగాణ ముఖ్యమంత్రిగా విద్యార్థులకు ఏ సందేశం ఇవ్వడానికి వెళ్లారు?
“నల్లమల అడవుల్లో పుట్టిన బిడ్డ నేను, ఇప్పుడు ముఖ్యమంత్రిని అయ్యాను” అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. మరి నల్లమల నుంచి చదువుకోవడానికి వచ్చిన కృష్ణవర్ధన్ రెడ్డి, మేరెడ్డి చంద్రారెడ్డిని.. అదే జార్జ్ రెడ్డి వారసులు, గద్దర్ వారసులు, నక్సలైట్ వారసులు చంపిన విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు రేవంత్ రెడ్డి?
విధ్వంసానికి పరాకాష్టగా నిలిచి, యూనివర్సిటీలో అలజడులు సృష్టించిన జార్జ్ రెడ్డి మాత్రమే గుర్తొచ్చాడా? నక్సల్ భావజాలంతో ప్రేరేపితమై వేలమంది చనిపోవడానికి కారణమైన గద్దర్ నీకు గుర్తొచ్చాడా? మహబూబ్ నగర్ జిల్లా నల్లమల ప్రాంతం జాజాల గ్రామం నుంచి వచ్చిన చంద్రారెడ్డి నీకు గుర్తురాకపోవడం, రేవంత్ రెడ్డి భావదారిద్య్రానికి, పైశాచికత్వానికి పరాకాష్ట.
గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్లు ఇస్తానని అన్నాడు. ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వందల కోట్లు ఇస్తానని తప్పుడు హామీలు ఇస్తున్నాడు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 500 కోట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు కదా. మరి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదు? రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వలేదు. యూనివర్సిటీ బాగుపడిందిలేదు. ఇది వారి దుర్మార్గ పాలన.
ఇంజనీర్ల కమిటీ వేసుకుని తీర్మానం చేస్తే నిధులు విడుదల చేస్తానంటున్న రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకున్నట్టే. అసలు యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్లు, రీసెర్చ్, యూజీసీతో సంబంధం ఉంటుంది. దానికి పాలకమండలి, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటాయి. అందులో తీర్మానం చేసుకోవాలి. కానీ ఇంజనీర్లతో కమిటీ వేసుకోమని చెప్పడం రేవంత్ రెడ్డి అజ్ఞానం.
2 వేల ఎకరాల భూమి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ 1300 ఎకరాలకు కుంచించుకుపోయింది. మిగతా భూమిని భూ కబ్జాదారుల నుంచి రక్షించి యూనివర్సిటీకి ఇస్తారా? ఇవ్వరా? ఈ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీలో 76 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1267 పోస్టులకు గాను కేవలం 354 మాత్రమే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. 913 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రీసెర్చ్ కుంటుపడింది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే.
కాకతీయ యూనివర్సిటీలో 409 పోస్టులకు 86 పోస్టులు మాత్రమే ఫిల్ అయ్యాయి. జేఎన్టీయూలో 410 పోస్టులకు 241 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్సిటీలో 86 పోస్టులకు 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 152 పోస్టులకు 91 ఖాళీలు ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీలో 95 పోస్టులకు 74 పోస్టులు ఖాళీ. శాతావాహన యూనివర్సిటీలో 63 పోస్టులకు 47 ఖాళీలు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ లో 45 పోస్టులకు 38 ఖాళీలు. తెలుగు యూనివర్సిటీలో 72 పోస్టులకు 58 ఖాళీలు. బాసర ట్రిపుల్ ఐటీలో 146 పోస్టులకు 127 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో 420 పోస్టులు ఖాళీ ఉన్నాయి.
ఇలా మొత్తం తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో 3675 పోస్టులకు గాను 2419 పోస్టులు (66 శాతం) ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకులు ఉన్నవి కేవలం 1256 మాత్రమే. నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? ఈ ఖాళీలను ఎలా భర్తీ చేస్తారో ఒక ప్రణాళిక లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా ఏం ఉద్ధరిస్తారు? రేవంత్ రెడ్డి యూనివర్సిటీని ఉద్ధరిస్తానని గొప్పలు చెప్పుకునేందుకే వెళ్లాడు తప్పితే చేసిందేమీ లేదు.
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2843 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకాలు జరిగినవి 1255 పోస్టులు మాత్రమే. ఈ ఖాళీలు భర్తీ చేయకుండా కేవలం ఆర్భాటంగా మాట్లాడటం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డికి హీరోలెవరో, జీరోలెవరో తెలియడం లేదు. యూనివర్సిటీలో కత్తులు, గొడ్డళ్లు, గన్ కల్చర్‌ను పరిచయం చేసిన జార్జ్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పొగడటం సిగ్గుచేటు. అటువంటి వారిని హీరోలుగా చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డి జీరో అయ్యాడు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వందేమాతరం రామచందర్ రావు గుర్తురాలేదా రేవంత్ రెడ్డికి? దుర్మార్గ చేష్టలు చేసి ఎంతోమంది వ్యక్తుల చావుకు కారణమైన జార్జ్ రెడ్డి, గద్దర్ లు గుర్తుకు రావడం దారుణం. నేరచరిత్ర, ద్వేషం, విధ్వంసం సృష్టించే స్వభావం కలిగిన వారిని పొగడటం సీఎం రేవంత్ రెడ్డి స్వభావమా?
“నా బడి ఏబీవీపీ”, ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ లో అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన అసలు ముసుగు బయటపడింది. రేవంత్ రెడ్డి బడి దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఏబీవీపీలో పనిచేసే వాళ్లు అబద్ధాలు చెప్పరు, బడి దొంగలు ఉండరు. రేవంత్ రెడ్డి కేవలం ముసుగు వీరుడు అని తెలిసిపోయింది. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని నీతులు చెబుతాడు. అటువంటి రాజ్యాంగాన్ని కాల్చిన వ్యక్తులు జార్జ్ రెడ్డి వంటి వారిని హీరోలుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి పిచ్చి పరాకాష్టకు చేరుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి… అర్బన్ నక్సలైట్ భావజాలం ఉన్నవారిని, నక్సలైట్లకు అండగా పనిచేసిన కంచె ఐలయ్యను ఓబీసీ ఐడియాలజీ అడ్వైజరీ కమిటీలో చేర్చుకున్నడు. అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీయా? లేక అర్బన్ నక్సలైట్ భావజాలమున్నటువంటి వ్యక్తుల వలయమా?
రేవంత్ రెడ్డి చేసిన పనులకు, దొంగ మాటలకు యూనివర్సిటీని శుద్ధి చేయాల్సి వస్తుందేమో! డిసెంబరు మాసంలో మరోసారి యూనివర్సిటీలోకి వెళ్తామంటున్న రేవంత్ రెడ్డి.. అర్బన్ నక్సలైట్ గూండాలను కవచంగా చేసుకొని వెళ్దామనే ఆలోచనేనా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజచరిత్రను తెలుసుకోవాలని కోరుతున్నాను.