– రాష్ట్ర సచివాలయంలో మట్టి విగ్రహాల పంపిణీ
అమరావతి: వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతిని పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుదాం… పర్యావరణ భద్రత…మనందరి బాధ్యత అంటూ రాష్ట్ర సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాలను పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తరపున వారి పేషీ అధికారులు, సిబ్బంది మట్టితో తయారు చేసిన అంకుర గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ గణపతి ప్రతిమలలో ఒక విశిష్టిత ఉందని, గణపతి పూజ అనంతరం ఈ విగ్రహాన్ని నీటితో తడిపి నానబెడితే అందులో నుండి మొక్క వస్తుందని తద్వారా పచ్చదనం ఫరిడవిల్లుతుందన్నారు.
అదే విధంగా రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ తద్వారా ప్లాస్టర్ ఆప్ పారిస్, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
రాష్ట్ర కాలుష్య నివారణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్. అధికారి ఎం.సుధాకర్, కాలుష్య నివారణ మండలి ప్రర్యావరణ ఇంజనీరు మెహ్మద్ నజీనా బీగం తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ మానవ సమాజ భద్రత బాధ్యత ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.