– పి ఫోర్ స్ఫూర్తితో కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయించాం
– ఉండి ప్రజలు, రైతులు, నా మిత్రులతో పాటు నేను, కొంత మొత్తం సిఎస్ఆర్ నిధులను అదనంగా కలుపుకొని కలెక్టరేట్ నిర్మించాలన్నది లక్ష్యం
– కలెక్టరేట్ నిర్మాణానికి స్థలంతో పాటు సగం ధనం సమకూరుస్తానని మాట ఇచ్చా
– ముఖ్యమంత్రి ముందు నా ప్రతిపాదన పెట్టా
– అభివృద్ధి వ్యతిరేకులుగా మిగిలిపోతామంటే ప్రజలు సహించరు
– ఉండి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ 4 స్ఫూర్తితో ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రజల సహకారంతో భీమవరంలో కలెక్టరేట్ కార్యాలయ భువన సముదాయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లుగా ఉండి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మండలి చైర్మన్ మోషన్ రాజు తో పాటు పలువురు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు.
భీమవరంలో కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణం కోసం స్థలంతో పాటు, సగం ధనాన్ని సమకూరుస్తానని తాను ప్రతిపాదించానన్నారు. పీ 4 లక్ష్యానికి అనుగుణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయం నచ్చని వారు, పీ 4 అంటే ఇష్టం లేని శాసనసభ్యులు ఎవరైనా ఉంటే వారు తమ అభిప్రాయాన్ని నేరుగా ముఖ్యమంత్రికి చెప్పవచ్చునని అన్నారు.
కలెక్టరేట్ నిర్మాణంలో ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అని, తన ప్రతిపాదన కంటే మెరుగైన ప్రతిపాదనతో ఎవరైనా ముందుకు వస్తే, దానికి ప్రభుత్వం అంగీకరిస్తే తనకు అభ్యంతరం లేదన్నారు. ముఖ్యమంత్రి తీసుకుని ఏ నిర్ణయం అయినా శిరసా వహించాల్సిందేనని తెలిపారు.
జిల్లా విడిపోయిన తర్వాత అద్దె భవనంలో కలెక్టరేట్
ఏలూరు నుంచి విడిపోయి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు గణపవరం మండలం తో కలిసి పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్ కార్యాలయం గత మూడున్నర ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. భీమవరంలోని అంతర్భాగమైన పెదమిరం పరిధిలోని 3 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని కలెక్టరేట్ భవన సముదాయం కోసం సేకరించడం జరిగిందన్నారు. ఈ స్థలం అన్యాక్రాంతం కాగా, అక్కడ గుడిసెలు వేసుకున్న వారికి ప్రత్యామ్న్యాయ ప్రభుత్వ స్థలాన్ని చూపించి, కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణం కోసం సేకరించినట్లుగా తెలిపారు.
ఇక్కడ సెంట్ స్థలం 50 లక్షల ధర పలుకుతుందని, ఎకరా 50 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. అటువంటి ఖరీదైన స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం సేకరించినట్టుగా తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెబుతున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుండా పోయిందన్నారు.
కలెక్టర్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వమే 100 కోట్లు వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేయాలని, 70 నుంచి 80 కోట్ల రూపాయలు వెచ్చించి భవన సముదాయాన్ని నిర్మించాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు . ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు వెచ్చించి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించే పరిస్థితిలో లేదన్నారు.
ప్రభుత్వ ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిందని, అతి కష్టం మీద ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నా రఘురామ కృష్ణంరాజు , ఆ ఉద్దేశంతోనే భీమవరంలో కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రజల సహకారంతో నిర్మించాలని ప్రతిపాదించినట్లుగా తెలిపారు..
భీమవరం, ఉండి వేరు వేరు కాదు
భీమవరం, ఉండి వేరువేరు కాదని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. దీన్ని ఉండి, భీమవరమనే పిలుస్తారని గుర్తు చేశారు. మధ్యలో విస్సా కోడేరు మాత్రమే ఉన్నదని, విస్సా కోడేరు కు అటువైపు భీమవరం నియోజకవర్గం, ఇటువైపు ఉండి నియోజకవర్గం ఉన్నాయన్నారు. మనకు మనం గీసుకున్న గీతలతో సంకుచిత మనస్తత్వంతో కొంతమంది భీమవరం నుంచి కలెక్టరేట్ తరలిపోతే సహించబోమని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించిన స్థలానికి చెందిన మూడు సర్వే నెంబర్లను భీమవరం మున్సిపాలిటీలో కలిపేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్థానికులు నిరభ్యంతర పత్రాన్ని కూడా ఇచ్చారని గుర్తు చేశారు.
పెదమిరం గ్రామంలోని ఇంజనీరింగ్ కాలేజి, ఐఐటీ కాలేజి, ఫంక్షన్ హాలు తోపాటు అన్నింటినీ భీమవరంలో ఉన్నట్టుగానే పరిగణిస్తారన్నారు. చివరకు జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి పెదమిరం లోని ఫంక్షన్ హాల్ లో బస చేసినప్పటికీ, ఆయన భీమవరం లోనే బస చేశారని పత్రికల్లో రాస్తారని పేర్కొన్నారు. భీమవరంలో అంతర్భాగమే పెదమిరం లో కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయం నిర్మించాలని ప్రతిపాదిస్తే మనోభావాల పేరిట కొంతమంది అడ్డుకోవాలనుకోవడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి పి ఫోర్ ప్రారంభించక ముందే ఉండి లో ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ4 అనే విధానాన్ని ప్రవేశ పెట్టకముందే, ఉండి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల సహకారంతో చేపట్టడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, స్కూళ్ల అభివృద్ధి, పోలీస్ స్టేషన్లో ఆధునీకరణ, పోలీసు స్టేషన్లకు వాహనాల కొనుగోలు వంటి కార్యక్రమాలన్నీ ప్రజల సహకారంతోనే చేపట్టడం జరిగిందన్నారు.
రాష్ట్రానికే రోల్ మోడల్ గా ఉండి నియోజకవర్గ ప్రజల, రైతుల, నా స్నేహితుల సహకారంతో, సిఎస్ఆర్ నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కలుపుకొని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించినట్లుగా ఆయన తెలిపారు.
ఇందులో కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం 60 కోట్లు రూపాయలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని 30 కోట్ల రూపాయలు ఇవ్వమని కోరడం జరిగిందని, 75 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 35 కోట్ల రూపాయలు ఇస్తే, మిగతా 35 కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించనున్నట్లుగా తెలిపారు. కలెక్టర్ కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో బ్యాంకు ఖాతాను తెరిచి ప్రజల నుంచి విరాళాలను సేకరించనున్నట్లుగా తెలిపారు.
అయితే కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం సేకరించిన స్థలం ఇరిగేషన్ శాఖకు చెందినదని మండలి చైర్మన్ మోషన్ రాజు పేర్కొనడం పట్ల రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ, గతంలో ఇరిగేషన్ శాఖకు అదనంగా భూములను కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూముల్ని ప్రజా అవసరాల కోసం వెనక్కి తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉన్నదని పేర్కొన్నారు.
కాలువలు, చెరువులను ఆక్రమించరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని కానీ అదనపు స్థలాలలో ప్రజావసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించ రాదని ఏ న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు లేవన్నారు.
ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెవెన్యూ శాఖకు బదిలీ చేసిందన్న ఆయన, దానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రతులను మీడియా ముందు ప్రదర్శించారు . కలెక్టరేట్ నిర్మాణం కోసం ఉండి నియోజకవర్గ ప్రజలనే కాకుండా, జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలను భాగస్వాములను చేయడానికి ప్రయత్నించనున్నట్లు తెలిపారు. ప్రతిదానికి సంపూర్ణంగా ప్రభుత్వం పై ఆధారపడకుండా మనమే చొరవ తీసుకొని మన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించుకుందామన్నారు.
ఉండి నియోజకవర్గ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చయిందన్నారు. ఈ మొత్తాన్ని ప్రజలతోపాటు తన స్నేహితులు, తాను సమకూర్చినట్లు తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయడానికి లేదని, గత ప్రభుత్వ హయాంలోని లెక్కకు మించి అప్పులు చేశారన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్వాగతించాలని, రాష్ట్రానికి మంచి జరిగితే ఆహ్వానించాలన్నారు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం స్థలమన్నదే లేదని, కనీసం స్థానికంగా ఒక్క ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా లేదన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఓపెన్ థియేటర్ నిర్మాణంలో ఉన్నదని, సంక్రాంతి నాటికి ప్రారంభించనున్నట్లుగా తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమవరం, ఉండి కలిపి మూడు నియోజకవర్గాలు అవుతాయన్నారు. అటువంటిప్పుడు ఈ సంకుచిత మనస్తత్వం ఎందుకన్నారు. త్వరలోనే భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని కూడా కలిపి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని చెబితే, తానే భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ కు మూడు సార్లు విన్నవించడం జరిగిందన్నారు.
భీమవరంలోనే కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించాలని, లేకపోతే తమ మనోభావాలు దెబ్బతింటాయన్న వారెవరు కూడా ఈ విషయంలో మాట్లాడలేదని విమర్శించారు. అభివృద్ధికి విగాథం కలిగించాలంటే రకరకాలుగా మాట్లాడవచ్చునని, మాట్లాడేవారిపై ఆయా పార్టీ నాయకత్వాల నుంచి ఒత్తిడి ఉండి ఉండవచ్చునని అన్నారు. పార్టీలకతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏకైక ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు.
ఐదేళ్ల తర్వాత కలెక్టరేట్ కడతామంటే అప్పటివరకు వేచి చూడడం ఎందుకని ప్రజలు ముందుకు వచ్చినప్పుడు మన ప్రాంత అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎదుట తాను ఈ ప్రతిపాదన ఉంచడం జరిగిందన్నారు.
కలెక్టరేట్ నిర్మాణం వల్ల నాకు కలిసి వచ్చేది ఏమిటి?
కలెక్టరేట్ భీమవరంలో నిర్మించడం వల్ల తనకు కలిసి వచ్చేది ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తన వ్యవసాయ భూమి ధర రూపాయ కూడా పెరగదన్న ఆయన, తనకు ఇక్కడ ఒక ఇల్లు మాత్రమే ఉందన్నారు. గతంలో తాను ఎంపీగా పని చేశానని, ఇప్పుడు అనుకోకుండా ఎమ్మెల్యేని అయ్యానని అన్నారు. భవిష్యత్తులో ఏమీ అవుతానో తెలియదని చెప్పారు. దీనివల్ల వ్యక్తిగతంగా నాకు కలిసి వచ్చేది ఏమీ లేదన్న ఆయన, కలెక్టరేట్ స్థానికంగా ఉండాలన్నది తన నా కోరిక అని తెలిపారు.