సర్ డాన్ బ్రాడ్‌మన్..
ఆ పేరు వింటే
బంతి బౌండరీలు దాటి
పరుగులు తీస్తుంది..
బ్యాటు ఆయన చెప్పిన
మాట పాటిస్తుంది..
రికార్డులు మోకరిల్లుతాయి..
క్రీజు గ్రీజు పూసుకున్నట్టు
ఆయన్ని వదిలి పెట్టదు..
ఆయన ఆడుతుంటే
అంపైర్ వేలు
ఒక పట్టాన లేవదు..
అదే అంపైర్ చేతులు
అలా అడ్డంగా ఊగుతూ
నిలువునా పైకి లేస్తూ ఉండాల్సిందే..!
సెంచరీలు కొట్టే వయస్సు..
బౌండరీలు దాటే మనస్సు
తొమ్మిది దశాబ్దాలకు
ముందే డాన్ కి వచ్చేసింది..
బరిలోకి దిగాడంటే..
కొడితే కొట్టాలిరా
సిక్సు కొట్టాలి..
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి..
ఒకే రోజున
మూడొందలు ఊదేసిన
ఈ క్రికెట్ దేవుడు..
ఎంతగా చేసి ఉంటాడో
బాదుడే బాదుడు..!
క్రికెట్ ఆట కనిపెట్టిన
ఇంగ్లీషు దొరలకు
బంతిలో భూగోళాన్ని..
బ్యాటులో అండపిండాన్ని..
క్రీజులో బ్రహ్మాండాన్ని
చూపిన ఈ షంషేర్
ఆంగ్లేయులకు నైట్మేర్..
బౌలర్లు ఫాస్టు వేస్తే
ఇతగాడికి అదే ఫీస్టు..
బంతిని స్పిన్‌ను చేస్తే
డానుకు అదో ఫన్ను..
బలమైన బౌన్సర్లకు అంతకంటే
బలమైన ఆన్సర్..
గుగ్లీ పడితే జంగ్లీ
దారి పట్టడమే..
రకరకాలుగా చేతులు తిప్పే
ఇంగ్లీషు బౌలర్లు
ఈ సర్ ధాటికి చేతులెత్తేసి..
అతన్ని కట్టడి చేసేందుకు
ఎలా ముట్టడి
చెయ్యాలో తోచక..
ఈ లయన్‌ను
అడ్డుకునేందుకు
కనిపెట్టారు బాడీలైన్..
అప్పుడూ వారికే
అవసరమైంది సెలైన్..!
మన గవాస్కరు..
టెండూల్కరూ
బద్దలు కొట్టిన వరకు
అన్ని రికార్డులు
బ్రాడ్‌మన్ ఖాతాలోనే..
ఆ ఇద్దరికీ దేవుడు
ఈ బహుదొడ్డ జీవుడు..!
బిరుదేమో సర్..
బౌలర్లకేమో ఫీవర్..
ఆంగ్లేయులకైతే
నిలువెల్లా షివర్..
ఈ బ్రాడ్‌మన్ అంటే ఎప్పటికీ
ప్రపంచ అభిమానులకు
అంతులేని ఫేవర్..!
– సురేష్
9948546286
7995666286