– ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించి రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
– టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను బిజెపి అడ్డుకుంటుందని టీ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బిజెపికి దమ్ముంటే వెంటనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి బీసీ బిల్లును ఆమోదించాలని, ఇండియా కూటమి పూర్తి మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
వినాయక చవితి సందర్భంగా గాంధీభవన్ లో టీ పీసీసీ ప్రధాన కార్యదర్శులు నాగభూషణం. కొమరయ్య, ఉపాధ్యక్షుడు సురేష్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నెల రోజులపాటు పార్లమెంటు సమావేశాలు జరిగితే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి
కిషన్ రెడ్డి, బండి సంజయ్, మిగతా బీజేపీ ఎంపీలు ప్రధానిని కలిసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాల్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. బిజెపి నేతలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి బిజెపి రకరకాల కుట్రలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద ఉందని వెంటనే ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బిజెపికి బీసీలు సరైన రీతిలో గుణపాఠం చెబుతారని, బిజెపి బీఆర్ఎస్ పార్టీలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బొంద పెడతారని ఆయన హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని, విజయమే లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రి వేడుకలు ప్రశాంతంగా ముగియడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మండప నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.